TRS MPs
-
ఇక పోరు ఢిల్లీలో.. టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వంపై పోరును తీవ్రం చేయాలని అధికార టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ విషయంలో లేఖలు, లెక్కల పేరిట గోల్మాల్ చేస్తున్న బీజేపీ వైఖరిని ఎండగట్టేందుకు ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనుంది. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో పార్టీ ఎంపీలు, పలువురు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపై తదుపరి పోరాటం, శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. నాలుగు రోజులపాటు పార్లమెంటు లోపల, బయట నిరసన చేపట్టిన పార్టీ ఎంపీలను కేసీఆర్ అభినందించారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వడంతోపాటు ధాన్యం కొనుగోలులో వార్షిక లక్ష్యం నిర్ణయించడం, కనీస మద్దతు ధరల చట్టం కోసం డిమాండ్ చేయడంలో వెనక్కి తగ్గొద్దని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఇతర పార్టీలను కలుపుకొని సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని సూచించారు. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు శాసనమండలి ఎన్నికలు ముగిశాక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడదామని కేసీఆర్ ప్రతిపాదించారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో కలసి తాను కూడా ధర్నాలో పాల్గొంటానని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఎంపీలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన లెక్కలపై త్వరలో స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. -
వరి నిరసనలు.. వాయిదా తీర్మానాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం సేకరణ విధానంపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని పార్లమెంటులో టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉభయసభల్లోనూ సోమవారం తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో నిరసనకు దిగింది. వార్షిక ధాన్యం సేకరణపై ప్రకటన చేయాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పార్టీ ఎంపీలు ఉభయ సభలను అడ్డుకున్నారు. శీతాకాల సమావేశాలు ఆరంభమైన తొలి రోజు లోక్‌సభ ఆరంభమైన వెంటనే స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీ లు నిరసన చేపట్టారు. లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, రాములు, ఎమ్మెస్ఎన్ రెడ్డి తదితరులు సభను స్తంభింపజేశారు. వీరితో పాటు ఇతర పార్టీల సభ్యులు సైతం పంటలకు కనీస మద్దతు ధర, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు కోరుతూ నిరసనకు దిగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనను కొనసాగించడంతో సభ మంగళవారానికి వాయిదా పడింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా ఇదే అంశమై వాయిదా తీర్మానం ఇవ్వగా, స్పీకర్ దాన్ని తిరస్కరించారు. రాజ్యసభలోనూ.. కేంద్రం సమగ్ర జాతీయ ధాన్యం సేకరణ విధానం తీసుకురావాలంటూ రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కె.కేశవరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత సభ ప్రారంభమయ్యాక కేకే సహా ఎంపీలు బండ ప్రకాశ్, కేఆర్ సురేశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌లు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే సమయంలో ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన చైర్మన్ వెంకయ్యనాయుడు.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు అవకాశం ఇచ్చారు. గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఏ రాష్ట్రమైనా ఉల్లంఘిస్తే, ఎటువంటి చర్యలు తీసుకుంటారని జీవీఎల్ అడిగారు. అయితే టీఆర్ఎస్ సభ్యులు సభకు అడ్డుపడుతుండటంతో.. శాంతించాలని, వెల్‌లోకి రావొద్దని వారికి చైర్మన్ సూచించారు. బండ ప్రకాశ్ పేరును ప్రస్తావిస్తూ ఆయన్న అదుపు చేయాల్సిందిగా కేశవరావును కోరారు. ఈ గందరగోళం మధ్యే జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానం ఇచ్చేందుకు లేచి నిలబడి మాట్లాడటం ప్రారంభించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు ఆవరణలోని గాంధీవిగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కొనసాగించారు. బీజేపీ ప్రభుత్వం–రైతుల ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు. సమగ్ర ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలి రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలానికి సంబంధించి కేంద్రం పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించాలని కేకే, నామా నాగేశ్వర్‌రావులు డిమాండ్ చేశారు. సమగ్ర జాతీయ ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలని కోరారు. తెలంగాణలో పెరిగిన వరిసాగుకు అనుగుణంగా ధాన్యం సేకరించాలని కోరితే కేంద్రం సరైన విధంగా స్పందించడం లేదని విమర్శించారు. యావత్ రైతాంగానికి సంబంధించిన ఈ అంశంపై మిగతా పార్టీల ఎంపీలు కూడా కలిసి రావాలని కోరారు. -
ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించండి: కేసీఆర్‌కు ఎంపీల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కొందరు టీఆర్ఎస్ ఎంపీలు కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, దీనిపై సరైన సమయంలో స్పందిస్తానని అన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2,3 రోజుల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన లేదా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ నెల 19 నుంచి పార్ల్లమెంటు సమావేశాలు ప్రారంభమ వుతున్న నేపథ్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఎంపీలతో చర్చించడంతో పాటు వివిధ అంశాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగానే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశం, టీఆర్ఎస్ పోషించాల్సిన పాత్రపైనా చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హక్కులు హరిస్తున్న కేంద్రం ‘దేశ రాజకీయాలు రోజురోజుకూ పూర్తిగా మారిపోతున్నాయి. కొత్త రాష్ట్రమైనా మనం తెలంగాణను బలంగా అభివృద్ధి చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సాయం లేకున్నా అభివృద్ధి బాటలో సాగుతున్నాం. అయితే రాష్ట్రాన్ని బలహీన పరిచేందుకు అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రం మన హక్కులను హరించి వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. అయినా టీఆర్ఎస్ వల్లే తెలంగాణ ఈ రోజు దేశం ముందు సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. రాష్ట్రాలకు వాటా మేరకు నిధుల కేటాయింపులు జరగడం సహజమే అయినా, కొత్త రాష్ట్రానికి ఎలాంటి అదనపు సాయం లేదు. దేశ రాజకీయాలపై ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉన్నాం. సరైన సమయంలో స్పందిస్తా..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాగునీటి విషయంలో అన్యాయం జరక్కూడదు ‘సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదు. లోక్‌సభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటా కోసం కేంద్రాన్ని నిలదీయాలి. గట్టిగా కొట్లాడాలి. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కృషి చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన పెండింగు సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించాలి. సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలను అందచేయాలి..’ అని పార్టీ ఎంపీలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సంబంధించి సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కేఆర్ సురేశ్‌రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్‌సభ సభ్యులు బి.బి పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. ఈ మేర కు బుధవారం పార్లమెంటు ఆవర ణలోని గాంధీ విగ్ర హం వద్ద ధర్నా చేపట్టారు. నిధులను వి డుదల చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధర్నాలో టీఆర్ఎస్ పార్లమెంట రీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, పసునూరి దయాకర్, బీబీ పా టిల్, మాలోతు కవిత, వెంకటేష్ నేత, రంజిత్‌రెడ్డి, బండ ప్రకాశ్, లింగయ్యయాదవ్, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు జీఎస్టీ, వివిధ పథకాల కింద రూ. 29,891 కో ట్లు, ఐజీఎస్టీ కింద రూ. 4,531 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ. 450 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 312 కోట్లు, యూఎల్బీ గ్రాంట్ కింద రూ. 393 కోట్లు, నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ భగీరథకు రూ. 19,204 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని ఎంపీలు తెలిపారు. -
ఎంపీ బండి సంజయ్‌పై ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యల మీద టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించేందుకు అసెంబ్లీలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీలు ఎంపీ సంజయ్‌కు సూచించారు. కాగా లోక్‌సభలో జీరో అవర్ చర్చలో భాగంగా తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బుధవారం ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ విద్యను కేవలం వ్యాపార దృక్పథంతో చూస్తూ.. అనుభవం లేని గ్లోబరీనా వంటి సంస్థకు ఫలితాల విడుదలు చేసే బాధ్యతను అప్పగించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 3 లక్షలమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ముగ్గురు సభ్యుల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పెద్దింట్లో చనిపోయిన వారిని పరామర్శించేందుకు సమయం ఉండే ముఖ్యమంత్రికి.. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు మాత్రం సమయం ఉండదా అని ఘాటు విమర్శలు చేశారు. చదవండి : పెద్దింటి వారిని పరామర్శిస్తారు కానీ.. -
నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల తర్వాత 17వ లోక్‌సభ మొదటిసారిగా సమావేశం కానుంది. సోమవారం నుంచి పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. మొదటి మూడు రోజుల పాటు లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీ సోయం బాపురావు, పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతలు ఇరువురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇరువురు పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆదివారం ఈ నేతలు వేర్వేరుగా దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అనూహ్యంగా విజయం.. గత ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. మే 23న ఫలితాలు వెలబడ్డాయి. ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్‌పై 58వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆరు నియోజకవర్గాల్లో గెలుపొందగా ఒక్క ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అనూహ్యంగా ఇక్కడ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గెలుపొందడం చారిత్రాత్మకమైంది. ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గమైన ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ నేత సోయం బాపురావు ఘన విజయం సాధించారు. పెద్దపల్లి నుంచి... పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 95వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ మూడో స్థానంలో నిలిచారు. వెంకటేశ్ నేత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చెన్నూర్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అక్కడ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో కేటీఆర్ సమక్షంలో పార్లమెంట్ ఎన్నికల ముందు వెంకటేశ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇద్దరు తొలిసారే.. ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన సోయం బాపురావు, బొర్లకుంట వెంకటేశ్ నేత ఇరువురు పార్లమెంట్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. సోయం బాపురావు గతంలో బోథ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక బొర్లకుంట నేత ఉద్యోగిగా పదవి విరమణ తీసుకొని డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరిక్షించుకుని విజయం సాధించారు. ఇదిలా ఉంటే సోయం బాపురావు తెలుగులో ప్రమాణస్వీకారం చేయనుండగా, వెంకటేశ్ నేతది తెలియరాలేదు. -
తెలంగాణ ప్రయోజనాలే పరమావధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించాలని టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్బోధించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంపీలు పని చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రఫ్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేరే వరకు కేంద్రంతో సంప్రదింపులు కొనసాగించాలని, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వంతో వ్యహరించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో గురువారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వంతో సామరస్య ధోరణితో వ్యవహరించాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఎంపీలకు సూచించారు. నిరంతర సంప్రదింపుల ప్రక్రియతో రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వపరంగా రాష్ట్రానికి వచ్చే నిధులు, నిర్ణయాల విషయంలో ఆయా మంత్రిత్వశాఖలతో నిత్యం సంప్రదింపులు జరపాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నిక... లోక్‌సభ కొత్తగా కొలువుదీరుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్లమెంటరీపక్ష ఎన్నికల ప్రక్రియను ఈ సమావేశంలో పూర్తి చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కె. కేశవరావును తిరిగి ఎన్నుకున్నారు. రాజ్యసభలోనూ టీఆర్‌ఎస్‌పక్ష నేతగా కేశవరావు వ్యవహరిస్తారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేతగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు ఎన్నికయ్యారు. అలాగే లోక్‌సభలో టీఆర్ఎస్ ఉప నేతగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, విప్‌గా జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్‌ను ఎన్నుకున్నారు. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌పక్ష ఉప నేతగా బండ ప్రకాశ్, విప్‌గా జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుల ఎన్నిక సమాచారంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి లేఖ రాశారు. -
ఢిల్లీలో ఆత్మగౌరవ బావుటా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల: టీఆర్ఎస్ ఎంపీలను ఢిల్లీకి పంపించి తెలంగాణ హక్కులను సాధించుకుందామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో, కరీంనగర్లో రోడ్డు షోలలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం జరుగుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించుకుని ప్రతీ ఎకరాకు కేంద్రం నిధులతో గోదావరి జలాలను మళ్లించుకుందామని తెలిపారు. తెలంగాణ మెట్ట ప్రాంతం సాగు నీరు లేక బోర్లపై ఆధారపడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ బాధలన్నీ పోవాలంటే గులాబీ సైనికులు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఢిల్లీలో ఎగురవేసి ఎర్రకోటపై ఎవరు జెండా ఎగుర వేయాలో నిర్ణయించే శక్తిని టీఆర్ఎస్కు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎందుకీ పేదరికం? 71 ఏళ్ల స్వతంత్ర దేశంలో 55 ఏళ్లు కాంగ్రెస్, 13 ఏళ్లు బీజేపీ, మూడేళ్లు జనతాపార్టీ అధికారంలో ఉందని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పాలన బాగుంటే దేశం ఇంకా ఎందుకు పేదరికంలో ఉందని ఆయన ప్రశ్నించారు. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు కావాలన్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేశారని వివరించారు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం కాపీ కొట్టిందని విమర్శించారు. పేరు మార్చి దేశంలోని పేద రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని కాస్తయినా అందిస్తున్నారంటే అది కేసీఆర్ పుణ్యమేనని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అంటే గిట్టని పార్టీలు చాలా ఉన్నాయని, తెలంగాణ నుంచి 16 సీట్లు టీఆర్ఎస్ గెలిస్తే దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి 170 సీట్లతో ఢిల్లీని శాసించే సత్తా టీఆర్ఎస్కు ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను మన రాష్ట్రం అమలు చేసిందని, ఇదే స్ఫూర్తితో దేశానికి దిక్సూచిగా టీఆర్ఎస్ నిలుస్తుందని తెలిపారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని చెబితే స్పందించిన ముఖ్యమంత్రే నేరుగా రైతుతో మాట్లాడే పరిస్థితి ఉందంటే అది కేవలం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. భవిష్యత్‌లో అవినీతి అనే మాటే లేకుండా పనులు జరిగే పరిస్థితులు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్కుబుల్లెట్ రైలు నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు బుల్లెట్ రైలు వేయించారని, కేంద్రంలో టీఆర్ఎస్ అడుగుపెడితే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు తీసుకురావచ్చని కేటీఆర్ చెప్పారు. 16 మంది ఎంపీలతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించుకుందామని అన్నారు. మోదీ పేదల కడుపు కొట్టారని, నోట్ల రద్దుతో చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారని ధ్వజమెత్తారు. మోదీ, చంద్రబాబు నాయుడు తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ మెడలు వంచే మొనగాడు కేసీఆర్ రాష్ట్రంలో పదహారుకు పదహారు ఎంపీ సీట్లను గెలిపిస్తే, అంతటితో ఆగవని.. ఈ పదహారుకు మరో 150 తోడవుతాయని, 150 మందితో ఢిల్లీ మెడలు వంచే మొనగాడు కేసీఆర్ అని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాహుల్, మోదీ వాళ్లిద్దరి మధ్యనే ప్రధాని పదవి ఉండాల్నా అని ప్రశ్నించారు. ఢిల్లీ గులాములు కావాలో, తెలంగాణ గులాబీలు కావాల్నో నిర్ణయించుకోవలసింది ప్రజలేనని కేటీఆర్ అన్నారు. -
మన ఎంపీలే మనకు బలం
సిరిసిల్ల: ఢిల్లీలో మనోళ్లు ఉంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవచ్చని టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు అన్నారు. కేంద్రంలో బడితే ఉన్నోడిదే బర్రె అని.. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఆ రాష్ట్రాలకు నిధుల తన్నుకుంటూ వస్తాయని చెప్పారు. కరీంనగర్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రం మెడలు వంచాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి.. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ సాధించిన కేసీఆర్.. 16 మందిని గెలిపిస్తే ఎట్టుంటదో ప్రజలు ఆలోచించా లని కోరారు. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాం ధీకి, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోదీకి లాభమని.. అదే టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం చేకూరుతోందని చెప్పారు. ఎక్కువ మంది ఎంపీలుంటే కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేస్తారన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఒక కూటమి తయారు చేస్తారని కేటీఆర్ వివరించారు. ప్రాంతీయ పార్టీలదే హవా దేశంలో కాంగ్రెస్, బీజేపీలు అంటే గిట్టని ప్రాంతీయ పార్టీలు అనేకం ఉన్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గెలిచే 16 మంది ఎంపీలకు తోడు దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలను కలుపుకొని సీఎం ముందుకు వెళ్తారని వివరించారు. ఆ సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోందని చెప్పారు. మందికి ఓట్లు వేసి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చుడేంది.. మన ఇంటి పార్టీ టీఆర్ఎస్కు ఓట్లు వేసి తెలంగాణ గడ్డకు మేలు చేసుకుందామని పిలుపునిచ్చారు. అందుకే ‘సారు.. కారు.. పదహారు.. కేంద్రంలో సర్కారు’అంటున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కేంద్రంలో మంత్రిగా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు 90 శాతం నిధులు వస్తయి.. 10 శాతం మనం పెట్టుకుంటే చాలు.. పొలాలకు నీళ్లు వస్తయి.. రెండు పంటలకు కడుపునిండా నీరు వచ్చే అవకాశం ఉంటుందని కేటీఆర్ వివరించారు. 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు మనం రూ.80 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని గోదావరి జలాలు పొలాలకు చేరుతాయని కేటీఆర్ అన్నారు. కేంద్రం నిధులివ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి కేంద్రంలోని నీతి ఆయోగ్ సంస్థ తెలంగాణకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నివేదిక ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలో బడితే ఉన్నోడిదే బర్రె అని, రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్‌కు రైల్వే లైన్లు, రైళ్లు వెళ్లాయని, లాలూప్రసాద్ యాదవ్ ఉంటే ఆయన అత్తగారి ఊరికి రైలుమార్గం వేసుకున్నారని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల ప్రాంతానికి రెండేళ్లలో రైలు వస్తుందని, దీనికోసం సీఎం, ఎంపీ వినోద్‌కుమార్ ఎంతో కృషి చేశారన్నారు. మనోళ్లు ఢిల్లీలో ఉంటే ఇక్కడ గల్లీలో ఏం కావాలన్నా చేసుకోవచ్చని తెలిపారు. మే నుంచి పింఛన్లు మే నెల నుంచి ఆసరా పింఛన్లు రూ.2,016 చొప్పున ఇస్తామని, 57 ఏళ్లకే పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 80 లక్షల మందికి పింఛన్లు ఇస్తామన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష మెజార్టీ అందించాలని కోరారు. ఎంపీ, కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి వినోద్‌కుమార్ మాట్లాడుతూ 35 ఏళ్ల కిందటే కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అర్హతను కోల్పోయిందన్నారు. బీజేపీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయని.. దేశానికి తెలంగాణ దిక్సూచి అవుతుందన్నారు. ముస్తాబాద్ ప్రాంత రైతాంగానికి మేలు చేసే కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేయిస్తానన్నారు. ఎంపీగా రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించడంలో, రైల్వే నిధులు సాధించడంతో ముందున్నానని స్పష్టం చేశారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత సమర్ధవంతంగా పనిచేస్తానని పేర్కొన్నారు. -
ఇప్పటివరకు కేంద్రంలో ఏం చక్రం తిప్పారు
జగిత్యాలరూరల్: రాష్ట్రం లో టీఆర్ఎస్కు ఇప్పటివరకు ఉన్న ఎంపీలతో కేం ద్రంలో ఏం చక్రం తిప్పా రని, రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేశారో చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీమంత్రి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకువచ్చేందుకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మంజూరు చేశామన్నారు. ఆ ప్రాజెక్ట్‌ను టీఆర్ఎస్ పక్కన పడేసిందన్నారు. ప్రాణహిత నదీ జలాలు తరలించేలా ఏర్పాట్లు చేసిన మేడిగడ్డ, తమ్మడిహెట్టికి జాతీయ ప్రాజెక్టు హోదా సాధించే అవకాశం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హోదా రాలేదన్నారు. -
పాలమూరు పౌరుషం చూపించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి 16 మంది టీఆర్ఎస్ ఎంపీలుంటే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. పాలమూరులోని రెండు ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించి పాలమూరు పౌరుషాన్ని రుచి చూపించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితోపాటు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, ఎంపీపీలు, సర్పంచులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ షాద్‌నగర్, నాగార్జున సాగర్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి ఆయన అనుచరులు టీఆర్ఎస్లో చేరడం పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఏం పని అంటూ కాంగ్రెస్, బీజేపీలు అడుగుతున్నాయి. ఆ పార్టీలు గెలిస్తే రాహుల్ లేదా మోదీ ప్రధానులవుతారు. కానీ టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ గడ్డ అభివృద్ధి చెం దుతుంది. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు 16 మంది ఎంపీల తో తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తాడు. తెలంగాణ వచ్చాక పాలమూరు పచ్చగా మారిపోయింది. 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులయ్యాయి. చెరువులు నిండాయి. కొత్తగా 8 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా సాగుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూం ఇళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో తెలంగాణలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్‌కు అండగా నిలబడాలి. బడితె ఎవడిదైతే బర్రె వాడిదే అవుతుందన్నట్లు కేంద్రంలో ఎవరు మంత్రులుగా ఉంటే వారికే అభివృద్ధి జరుగుతుంది. ఇందుకు గతంలో కేంద్ర మంత్రులుగా లాలూ, మమతలే ఉదాహరణ. మోదీ ప్రధానిగా ఉండి తన సొంత రాష్ట్రానికి బుల్లెట్ రైళ్లు వేసుకున్నాడు. గజ్వేల్ పర్యటనకు వచ్చిన మోదీని కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ అడిగితే ఇంతవరకూ దానికి అతీగతీ లేదు. కేంద్రంలో మనం శాసించే స్థాయిలో ఉంటే మరిన్ని నిధులు, మరింత అభివృద్ధి ఎందుకు సాధ్యం కాదు? అందుకే ఢిల్లీలో ఎంపీలుగా కాంగ్రెస్, బీజేపీ గులాములుండాలా లేక టీఆర్ఎస్ ఎంపీలు ఉండాలా అనేది ప్రజలు తేల్చుకోవాలి. పాలమూరు పౌరుషం చూపించి కారు గుర్తును 16 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించా లని ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మె ల్యే ప్రతాప్‌రెడ్డికి సూచించారు. ఆయన గెలిస్తే జిల్లాలో నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రు లు శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మల్కాజిగిరిలో భారీమెజారిటీతో గెలవాలి: కేటీఆర్ దేశంలోనే అతిపెద్ద ఎంపీ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో గెలవాలని కేటీఆర్ అన్నారు. శుక్ర వారం టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి కేటీఆర్‌ను ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మం త్రులు జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి ఉన్నారు. -
టీఆర్ఎస్ ఎంపీలు ఏం సాధించారు?’
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో టీఆర్ఎస్, ఎంఐఎంతో కలసి 16 మంది ఎంపీలు ఉన్నా వారు సాధించింది ఏమిటని బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు విమర్శించారు. ఏమీ సాధించని టీఆర్ఎస్ను ఈసారి 16 స్థానాల్లో ఎందుకు గెలిపించాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఎన్ని గంటలు మాట్లాడారో చెప్పాలని, వారి ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బులెట్ ట్రైన్ గురించి విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఇక్కడ ఎంఎంటీఎస్‌కు సంబంధించిన వాటా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే అని రాంచంద్రరావు ఆరోపించారు. -
ఈసారి 17 మంది వస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: 16వ లోక్‌సభకు 11 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఎన్నికవగా తరువాత మరో ముగ్గురు జత అయ్యారని, 17వ లోక్‌సభలో మాత్రం తెలంగాణలోని అన్ని సీట్లు గెలుచుకుని 17 మంది టీఆర్ఎస్ సభ్యులం వస్తామని ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 16వ లోక్‌సభ చివరి సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. సభాపతి సుమిత్రా మహాజన్ తమను బిడ్డల్లా ఆదరించారని పేర్కొన్నారు. తెలంగాణపై మాట్లాడేందుకు అనేకసార్లు అవకాశం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. అయితే తెలంగాణకు సంబంధించి ఇంకా ఒక అంశం పెండింగ్‌లో ఉందని, బైసన్ పోలో మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉందని సభలోనే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తెలంగాణ నూతన సచివాలయాన్ని ఇక్కడ నిర్మించాలన్న ప్రతిపాదనతో ఉన్నామని వివరించారు. ఫుడ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందుకు సభాపతికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ పదవిలో ఉంటూ క్యాంటీన్ ద్వారా అందరికీ హైదరాబాద్ బిర్యానీ అందుబాటులోకి తెచ్చానని వివరించారు. దీనికి సభాపతి స్పందిస్తూ పోరాటం చేసేందుకు దీని వల్లే బలం వచ్చిందంటారా? అని ఛలోక్తి విసిరారు. దీనికి జితేందర్‌రెడ్డి స్పందిస్తూ.. కేవలం హైదరాబాద్ బిర్యానీ మాత్రమే కాదని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సహకారంతో అన్ని రాష్ట్రాల ఆహారాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన ఆహారాన్ని ఒక్కో వారం పాటు ఫుడ్ ఫెస్టివల్ రూపంలో పార్లమెంటులో అం దుబాటులోకి తెచ్చామని తెలిపారు. చక్కటి ఆహారం అందించినందుకు ప్రధాని కూడా తనను ఓ సందర్భంలో అభినందించారని పేర్కొన్నారు. నారమల్లి శివప్రసాద్‌ను గుర్తుచేసిన ప్రధాని.. ప్రధాని తన ప్రసంగంలో టీడీపీ ఎంపీ నారమల్లి శివప్రసాద్‌ను గుర్తుచేశారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన టాలెంట్ చూపారని, టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూడా తన వేషధారణతో అందరి దృష్టిని మళ్లించేవారని, సభ్యులంతా టెన్షన్ మరిచి ఆయన వైపు అటెన్షన్‌గా చూసేవారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడుతూ.. ఆలింగనం చేసుకోవడం, బలవం తంగా మీద పడటం తనకు ఈ సభ ద్వారానే తెలిసిం దని వ్యంగ్యంగా అన్నారు. కన్నుగీటడం ద్వారా పరాచికాలు చేయవచ్చని తనకు ఇక్కడే తెలిసిందని, దేశంలోని మీడియా ఆ వీడియోలను బాగా ఆస్వాదించిందని ఛలోక్తులు విసిరారు. ప్రధాని ప్రశంసలు.. సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘జితేందర్‌రెడ్డి మంచి భోజనం తినిపించారు. పార్లమెంటు బయట ప్రజల్లో ఒక చర్చ నడిచేది. పార్లమెంటు క్యాంటీన్లో భోజనం చవక అని, బయట చాలా ఎక్కువ రేట్లని, ఎంపీలకు అలా ఎందుకు అందించారని చర్చ నడిచేది. జితేందర్‌రెడ్డి నేతృత్వంలోని ఫుడ్ కమిటీ నా భావనలను అర్థం చేసుకుంది. సభాపతి కూడా మా భావనలను అర్థం చేసుకున్నారు. సభ్యుల జేబులకు కొంత భారం పడినా.. క్యాంటీన్ రేట్లను సవరించడం బాగుంది’అని అన్నారు. -
రక్షణ మంత్రిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సచివాలయ నిర్మాణం, రహదారుల విస్తరణకు వీలుగా రక్షణ శాఖ పరిధిలోని బైసన్ పోలో భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రక్షణ శాఖ భూముల బదలాయింపుపై ఇప్పటికే అనేక మార్లు ప్రధాని మోదీని కలిశాం. బైసన్‌పోలో స్థల వివాదం కేసు హైకోర్టులో ఉందని గతంలో ప్రధాని చెప్పారు. తాజాగా హైకోర్టు బైసన్ పోలో స్థలం కేంద్రానిదే అని స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర మంత్రిని కలిసి ఈ అంశంపై చర్చిం చాం. బైసన్‌పోలో స్థలానికి బదులు స్థలం, కొంత శాతం పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించాం. మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ రాసిన లేఖను కేంద్ర మంత్రికి ఎంపీ వినోద్‌కుమార్ అందజేశారు. రక్షణ మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు కవిత, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జోగినిపల్లి సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. -
ప్రధానిని కలసిన టీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సంతోష్, బూర నరసయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీతారాం నాయక్, జి.నగేశ్, బీబీ పాటిల్, బి.లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు సమావేశమై ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి స్థలం కేటా యింపుపై వినతిపత్రాన్ని ఇచ్చారు. పార్లమెంటు లో టీఆర్ఎస్కు ఉన్న 17 మంది సంఖ్యా బలం ఆధారంగా పట్టణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు తమకు వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆర్పీ రోడ్డులో స్థలాన్ని కేటాయించాలని ప్రధానిని కోరారు. ముందుగా ఢిల్లీలోని సాకేత్, వసంత్ విహార్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ ప్రాం త్రాలను టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం పరిశీలించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వెళ్లే ముందు సీఎం కేసీఆర్ కూడా ఆయా ప్రాంతాల మ్యాపులను పరిశీలించి తెలంగాణ భవన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరికి అన్ని అనుకూలతలను పరిశీలించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ రోడ్ ను ఎంపిక చేసుకున్నారు. నాకు ఒక్క స్వీటు కూడా ఇవ్వలేదు.. తనను కలసిన టీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని మోదీ సరదా సంభాషణ సాగించారు. తెలం గాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజా రిటీతో గెలిచినా తనకు ఒక్క స్వీటు తినిపించలేదన్నారు. మంత్రులు, ఎంపీలకు స్వీట్లు తినిపిం చి నాకు మాత్రం ఇవ్వరా? అని మోదీ సరదాగా అన్నట్టు తెలిసింది. దీనికి స్పందించిన టీఆర్ఎస్ ఎంపీలు.. పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి ప్రత్యేకంగా బెల్లం, కాజుతో చేసిన స్వీట్లు స్వయంగా తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. -
ప్రధానిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపుపై వారు ప్రధానంగా ప్రధానితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో పార్టీ కార్యలయం నిర్మించడానికి భూమి కేటాయింపు అంశంపై మోదీతో చర్చించినట్టు తెలిపారు. ఉభయసభల్లో కలిపి 17మంది టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారని.. చట్ట ప్రకారం తమకు 1000 చదరపు గజాల స్థలం వస్తుందన్నారు. అర్బన్ డెవలప్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 1000 చదరపు మీటర్ల స్థలం ఇవ్వాలని చెప్పారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని తమకు కేటాయించాలని ప్రధానిని కోరినట్టు వెల్లడించారు. -
జవదేకర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన పలు విద్యాసంస్థలపై చర్చించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో విద్యా సంస్థల ఏర్పాటుపై చర్చించాం. సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో సీట్ల సంఖ్య పెంచాలని కోరాం. మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’అని వివరించారు. ఈ భేటీలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీలు విన్నవించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రి థావర్ చంద్గెహ్లాట్ను వారు కలిశా రు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎన్సీబీసీ చైర్మన్‌ను నియమించాలని విన్నవించారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ‘ఏక్ దేశ్–ఏక్ నీతి ఉండాలన్నదే మా అధినేత నినాదం. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. అయినా కేంద్రం ఇప్పటివరకు ఓబీసీలకు సంబంధించిన మంత్రిత్వ శాఖపై నిర్ణయం తీసుకోలేదు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విభిన్న రకాలుగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎన్సీబీసీ ఏర్పాటు చేసి 9 నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చైర్మన్‌ను నియమించలేదు..’ అని టీఆర్ఎస్ ఎంపీలు మీడియాకు వివరించారు. ఐఐఎం ఏర్పాటుపై వినతి తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు టీఆర్ఎస్ ఎంపీలు విన్నవించారు. బుధవారం సాయంత్రం వారు మంత్రిని కలిశారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, కొత్త జిల్లాల్లో జిల్లాకో నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒత్తిడి పెంచుతున్నాం. నాలుగున్నరేళ్లుగా విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్రమంత్రిని అనేకసార్లు కలిశాం. అయినా స్పందించడం లేదు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ సైతం కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం జరిగిన సమావేశంలో మరోసారి గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేశాం..’అని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. కేంద్ర మంత్రులను కలసిన వారిలో ఎంపీలు కె.కవిత, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, ప్రకాశ్ ముదిరాజ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి ఉన్నారు. ఆ గుర్తులు కేటాయించొద్దు ఎన్నికల చిహ్నంగా ట్రక్కు, కెమెరా, ఇస్త్రీపెట్టె, హ్యాట్ గుర్తులను కేటాయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు టీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. బుధవారం టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి ప్రధాన కమిషనర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు ట్రక్కు, కెమెరా, ఇస్త్రీపెట్టె, హ్యాట్ తదితర గుర్తులు కేటాయించడంతో టీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లిందని నివేదించారు. ఈ చిహ్నాలు టీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉండటంతో తమకు రావాల్సిన ఓట్లు ఆయా గుర్తులకు పోలయ్యాయని వివరించారు. ఎన్నికలకు ముందే ఈ అంశంపై సీఈసీకి నివేదించామని గుర్తుచేశారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని కోరారు. -
‘నిన్న ఈవీఎంలు అన్నారు.. నేడు చంద్రబాబు అంటున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్‌లను కలిసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమికి ప్రతిపక్షాలు కుంటి సాకులు వెతుకుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమికి తొలుత ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారని.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ తరఫున కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించాలని గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. తక్షణమే హైకోర్టును విభజించాలని మంత్రులకు చెప్పినట్టు తెలిపారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కేంద్రం జాప్యం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఎటువంటి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీ కేవలం మాటల ప్రభుత్వం అని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. అసెంబ్లీ రద్దుకు తర్వాత కూటమి ఏర్పాటయిందని గుర్తుచేశారు. కూటమి కట్టకముందే కాంగ్రెస్ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. -
కదిలింది గులాబీ దండు
నిజామాబాద్‌అర్బన్: దారులన్నీ అటు వైపే.. వాహనాలన్నీ ‘ప్రగతి’ సభ వైపే.. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ బిజీబిజీగా కనిపించాయి. గులాబీ జెండాల రెపరెపలతో సందడిగా మారాయి. టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కంగరకొలాన్లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. వందలాది వాహనాల్లో వారంతా తరలి వెళ్లడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. 1.10 లక్షల మంది తరలింపు.. ప్రగతి నివేదన సభకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 1.10 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 53 వేల మంది సభకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనాల్లో ఉదయం నుంచే బయల్దేరి వెళ్లారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యలు, రాష్ట్ర నాయకులు జన సమీకరణ చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి 88 ఆర్టీసీ బస్సులు, 90 ప్రైవేట్ బస్సులు, 240 వరకు కార్లలో 8,700 మంది వరకు తరలివెళ్లారు. బాల్కొండ నుంచి 687 వాహనాల్లో 12,465 మంది, బోధన్ నుంచి 450 వాహనాల్లో 9,700 మంది, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో 425 వాహనాల్లో 11,400 మంది, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో 750 వాహనాల్లో 12,500 మందిని తరలించారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి 16 వేలు, బాన్సువాడ నుంచి 12 వేలు, ఎల్లారెడ్డి నుంచి 12 వేలు, జుక్కల్ నుంచి 11 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు అద్దె వాహనాల్లో తరలి వెళ్లారు. మొత్తం కామారెడ్డి జిల్లా నుంచి 51 వేల మంది వరకు ప్రగతి నివేదన సభకు బయల్దేరి వెళ్లారు. రహదారులన్నీ గులాబీమయం.. జన సమీకరణ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్యేలు రెండు, మూడ్రోజులుగా తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేసి జన సమీకరణకు సర్వశక్తులు ఒడ్డారు. జనాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 508 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అలాగే, ప్రైవేట్ వాహనాలు, ట్రాక్టర్లు, సుమోలు అద్దెకు తీసుకుని జనాలను తరలించారు. 44వ జాతీయ రహదారి గులాబీమయంగా మారింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వాహనాలతో హైవే కిక్కిరిసింది. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన ప్రాంతాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద సీపీ కార్తికేయ ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించారు. హైవేతో పాటు జిల్లాకు అనుసంధామున్న రాష్ట్ర రహదారులు, వివిధ మండలాల నుంచి జిల్లాకు.. అక్కడి నుంచి జాతీయ రహదారికి వెళ్లేందుకు రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. ఒక్కో ప్రధాన ప్రాంతం వద్ద సీఐ స్థాయి అధికారి, ట్రాఫిక్ పోలీసులను నియమించారు. -
ప్రగతి నివేదన సభకు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు
భూపాలపల్లి (వరంగల్): జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రగతి నివేదన సభకు భారీగా తరలి వెళ్లారు. శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి పరోక్షంగా, మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే పుట్ట మధు వాహనాలను పంపించి జనాల తరలింపులో సఫలీకృతమయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి సుమారు 100 ఆర్టీసీ బస్సుల్లో 6 వేల మంది, 90 డీసీఎంలలో 5 వేలు, 75 స్కూల్ బస్సుల్లో 3 వేలు, 60 ట్రాక్టర్లలో 1,500, వంద కార్లలో 700 మందిని ప్రగతి నివేదన సభకు తరలించారు. అలాగే మంత్రి చందూలాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను భారీ మొత్తంలోనే తరలించారు. నియోజకవర్గం నుంచి 100 ఆర్టీసీ బస్సులు, 64 ప్రైవేట్ బస్సులు, 25 మినీ బస్సులు, 50 స్కూల్ బస్సులు, 49 డీసీఎంలు, 50 టెంపో టాక్సీలు, 151 టవేరా వాహనాల్లో సుమారు 18 వేల మందిని తరలించారు. అలాగే మంథని నియోజకవర్గంలోని కాటారం, మహముత్తారం, మల్హర్, మహదేవ్పూర్, పలిమెల మండలాల నుంచి 190 ప్రైవేట్ వాహనాలు, 20 స్కూల్, ప్రైవేట్ బస్సులతోపాటు ఇతర వాహనాల్లో సుమారు 3,500 మందిని ఎమ్మెల్యే పుట్ట మధు తరలించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 37,500 మంది ప్రగతి నివేదన సభకు తరలివెళ్లినట్లు సమాచారం. పోటాపోటీగా.. పనితీరు ఆధారంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం టీఆర్ఎస్లో ఊపందుకోవడంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రగతి నివేదన సభను సవాల్‌గా తీసుకున్నారు. ఒకరి కంటే ఒకరు పోటీగా వాహనాలను సమకూర్చి జనాలను తరలించారు. ప్రజాప్రతినిధులతో పాటు టికెట్లు ఆశిస్తున్న వారు సైతం తమ బలాన్ని చూపించుకోవడం కోసం తాపత్రయపడ్డారు. అనుకూలంగా ఉన్న మండలాలు, గ్రామాలకు వాహనాలను పంపించి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను తరలించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో శాసన సభాపతి మధుసూదనాచారితోపాటు గండ్ర సత్యనారాయణరావు కూడా సభకు ప్రజలను తరలించినట్లు తెలిసింది. ఇబ్బందుల్లో ప్రయాణికులు.. సభ కారణంగా సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లాలో ఏకైక భూపాలపల్లి బస్‌డిపోలో 81 బస్సులు ఉండగా అందులో 71 బస్సులు సభకు వెళ్లాయి. -
సచివాలయం, రోడ్ల విస్తరణకు భూములివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో గ్రౌండ్స్, రోడ్ల విస్తరణకు రక్షణ భూము లు బదలాయించాల ని గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చా రు. వెంటనే కల్పించుకుని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించేలా తగిన ఆదేశాలి వ్వాలని ప్రధానిని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బాల్క సుమన్, బీబీ పాటిల్, దయాకర్, బండా ప్రకాశ్, లింగయ్య యాదవ్, మల్లారెడ్డి తదితరులు శుక్రవారం పార్లమెంటు లో ప్రధానితో సమావేశమయ్యారు. నూతన సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో గ్రౌండ్స్, రోడ్ల విస్తరణకు కంటోన్మెంట్లో స్ట్రాటజిక్ రోడ్లు బదలాయింపునకు గతంలో కేంద్ర రక్షణశాఖ మంత్రులుగా పనిచేసిన మనో హర్ పారికర్, అరుణ్ జైట్లీ సూత్రప్రాయంగా అంగీకరించారని వివరించారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ కూడా పలు మార్లు కేంద్రాన్ని కోరారని వెల్లడించారు. అలాగే ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించేలా రూపొందించుకున్న కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలయ్యేలా చూడాలని కోరారు. తెలంగాణ విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం: జితేందర్‌రెడ్డి సమావేశం అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. బైసన్‌పోలో గ్రౌండ్స్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం 595 ఎకరాలు సహా అదనంగా రూ.95 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీకి వివరించామని ఎంపీ జితేందర్‌రెడ్డి చెప్పారు. అయితే బైసన్‌పోలో సమీపంలో ఉన్న కట్టడాల ద్వారా రక్షణశాఖకు ఏటా రూ.31 కోట్ల ఆదాయం వస్తోందని, దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరడం సరికాదని.. ఈ నిబంధనను తొలగించాలని విన్నవించామన్నారు. ఇటీవల కర్ణాటక అభ్యర్థన మేరకు ఆ రాష్ట్రానికి 210 ఎకరాలను ఆగమేఘాల మీద బదలాయించిన రక్షణశాఖ.. తెలంగాణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో పనిచేసిన ఇద్దరు రక్షణశాఖ మంత్రులు భూముల బదలాయింపునకు అంగీకరిస్తే.. ఇప్పటి రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం భూముల బదలాయింపును ఆలస్యం చేస్తున్నారని అన్నారు. అందుకే బైసన్ పోలో ఫైలు, కంటోన్మెంట్ స్ట్రాటజిక్ రోడ్ల ఫైలు విడిగా పంపాలని ఆమె కోరుతున్నారని చెప్పారు. బైసన్‌పోలో గ్రౌండ్ ఇచ్చివుంటే ఇప్పటికే రూ.400 కోట్లతో అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించేవాళ్లమని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్లో రోడ్లు విస్తరిస్తేనే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. -
తెలంగాణపై ఎందుకీ సవతి తల్లి ప్రేమ?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నూతన సచివాలయం, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి వీలుగా రక్షణశాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. గురువారం లోక్‌సభలో ఈ అంశంపై ఆందోళన చేపట్టారు. తెలంగాణ మీద ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి. జితేందర్‌రెడ్డి నిలదీశారు. జీరో అవర్‌లో ఆయన మాడ్లాడుతూ ‘‘తెలంగాణలో ప్రస్తుత సచివాలయం ఇరుకుగా ఉన్నందున బైసన్ పోలో మైదానం, జింఖానా మైదానంలో నూతన సచివాలయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్థలాన్ని బదలాయించాలని ప్రధాని, రక్షణ మంత్రికి మా ముఖ్యమంత్రి పలుమార్లు విన్నవించారు. సచివాలయ నిర్మాణంతోపాటు జాతీయ రహదారి–44, రాష్ట్ర రహదారి–1పై పలు మౌలిక వసతులు నిర్మించాల్సి ఉంది. ఇందుకు మొత్తంగా 200.58 ఎకరాలు అవసరమవుతోంది. సికింద్రాబాద్ ప్రాంతంలో ఇరుకైన రహదారి కారణంగా కరీంనగర్ రోడ్డు తరచూ బ్లాక్ అవుతుంది. అందువల్ల రక్షణశాఖ పరిధిలోని ఈ మైదానాలను బదలాయించాలని అనేక మార్లు కోరగా అప్పటి రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఈ భూములను బదలాయించేందుకు వీలుగా రూ. 95 కోట్లు చెల్లించాలని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఇది జరిగి మూడేళ్లయినా తదుపరి చర్యలు లేవు. ఈ స్థలం కేటాయించడం వల్ల తాము కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేసేలా ఏటా రూ. 31 కోట్లు పరిహారంగా చెల్లించాలని కంటోన్మెంట్ బోర్డు కోరింది. అయితే దీన్ని మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. అప్పటి నుంచి బదలాయింపు పెండింగ్‌లో ఉంది. కర్ణాటక ప్రభుత్వానికి ఇటీవల 200 ఎకరాల రక్షణ భూమిని కొద్ది సమయంలోనే బదలాయించారు. కానీ మేం మూడేళ్లుగా అడిగినా బదలాయించలేదు. తెలంగాణలో మౌలిక వసతుల నిర్మాణాలను పెండింగ్‌లో పెట్టేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండరాదు’’అని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా బతిమాలుతూ వచ్చామని కానీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామన్నారు. అందుకే నిరసన కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లో తమ నిరసన కొనసాగించారు. -
‘విభజన హామీల్లో అదొక్కటే ఉందా?’
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో బీజేపీ అభ్యర్ధికి మద్దతిచ్చి.. లోక్‌సభలో బైసన్ పోలో గ్రౌండ్‌కోసం నిరసన తెలపడం టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి మద్దతుపలుకుతున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాజ్యసభలో బీజేపీ అభ్యర్ధికి మద్దతు పలికి, లోక్‌సభలోనేమో బైసన్ పోలో గ్రౌండ్ కోసం నిరసన చేయడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. విభజన చట్టంలో ఎన్నో హామీలు ఉండగా కేవలం బైసన్ పోలో గ్రౌండ్ కోసమే పట్టుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అందుకే నూతన సెక్రటేరియట్ నిర్మాణం పేరిట నిధులు దోచుకోవడానికే ఈ కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. బీజేపీ విభజన హామీలు నెరవేర్చకుండా జాప్యం చేస్తుంటే.. ఇంకా ఆ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం రోజు టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేయకుండా సభనుంచి ఎందుకు పారిపోయారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లు గడిచాక ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రులకు విభజన హామీలు గుర్తుకొచ్చాయంటూ ఎద్దేవా చేశారు. తెర ముందు బీజేపీని తిడుతూ.. తెరవెనక ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. మీ తెర వెనక రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో వాల్లే మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. -
70 ఏళ్లు వెనుకబాటుకు గురయ్యాం
సాక్షి, న్యూడిల్లీ: 70 ఏళ్లు తీవ్ర వెనుకబాటుతనానికి, దోపిడీకి గురైన తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం దృష్టి సారించా లని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీల అమలుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎంపీలు కె.కేశవరావు, బండ ప్రకాశ్ మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఏపీలో కలిపారని, దీనివల్ల సీలేరు విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని కేకే అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సిన 6 వేల మెగావాట్ల విద్యుత్‌కు బదులు 1,600 మెగా వాట్లే ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, తెలంగాణకు కలిగే నష్టానికే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఏపీకి హామీల అమలుపై ఎలాంటి అభ్యంతరం లేదని, చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన వాటిని కేంద్రం అమలు చేయాలన్నారు. హామీలపై సమాధానం చెప్పండి.. విభజన చట్టం తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించిందని బండ ప్రకాశ్ పేర్కొన్నారు. ఏపీకి అమలు కావాల్సిన హామీలనే కాకుండా తెలంగాణకు అమలు కావాల్సిన హామీలపై కూడా కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. చట్టంలో రాష్ట్రానికి బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టీ్టకల్చర్, గిరిజన వర్సిటీలు, 400 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు బాధితులకు పునరావాసం, కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు మంజూ రు కావాల్సి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను చేపడుతున్నామని చెప్పారు. కేంద్రం ఏపీ హామీల అమలుపై చర్చించి తెలంగాణ హామీలపై స్పందించకపోవడం సరికాదన్నారు. తెలంగాణ తీవ్ర వెనుకబాటుతనానికి గురైందని, ఎన్నో పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రానికి ఇప్పటికీ కూడా నీళ్లు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును దేశమంతా ప్రశంసిస్తోందని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినట్లు నిధులను కేంద్రం విడుదల చేయాలని కోరారు. -
‘అప్పుడు పులి.. ఇప్పుడు పిల్లి’
సాక్షి, హైదరాబాద్ : 15 ఏళ్ల తర్వాత కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడలేక పారిపోయారని కాంగ్రెస్ శాసన మండలి నేత షబ్బిర్ అలీ ఎద్దేవా చేశారు. బీజేపీకి టీఆర్ఎస్ బి టీమ్‌గా మారిందని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ హక్కుల గురించి టీఆర్ఎస్ పార్లమెంట్లో ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ఆ పార్టీ రహస్య ఎజెండా ఏంటో, కేంద్రం వద్ద ఎందుకు లాలూచీ పడుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు తల్లిని ముక్కలు చేశారన్న ప్రధాన మంత్రి మాటలను టీఆర్ఎస్ ఎంపీలు ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. అవిశ్వాస తీర్మాన సమయంలో పార్లమెంట్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు. ఏపీ గురించి కాకపోయినా కనీసం తెలంగాణ హక్కుల గురించి మాట్లాడితే పోయేది ఏముందని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు పది సీట్లు కూడా రావు కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని షబ్బిర్ అలీ ఆరోపించారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం,గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు హామీలను కేంద్రం నుంచి రాబట్టడంలో విఫలమయ్యారన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి పది సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో పులిలా బతికారని ఇప్పుడు పిల్లికన్నా హీనమయ్యారని ఎద్దేవా చేశారు. ఎంపీ కవితకు నిజామాబాద్ లో తిరిగే పరిస్థితులు లేవని షబ్బిర్ అలీ వ్యాఖ్యానించారు. -
టీఆర్ఎస్ ఎంపీలతో టీడీపీ ఎంపీలు భేటీ
-
టీ సర్కార్‌పై మాజీ ప్రధాని ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన టీఆర్ఎస్ సభ్యులు గురువారం మన్మోహన్‌ను కలిశారు. జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్‌లను రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు మన్మోహన్‌కు పరిచయం చేశారు. అదే విధంగా రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల గురించి మన్మోహన్‌కు టీఆర్ఎస్ సభ్యులు వివరించారు. దీంతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన కితాబిచ్చారు. మన్మోహన్ ప్రశంసలకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా టీఆర్ఎస్ ఎంపీల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ముగ్గురు టీఆర్ఎస్ నేతల ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్, నల్లగొండ జిల్లా నేత బడుగుల లింగయ్యయాదవ్, వరంగల్లు జిల్లాకు చెందిన డాక్టర్ బండ ప్రకాశ్‌ముదిరాజ్ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురు సభ్యులు మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఎంపీ సంతోష్‌కుమార్ ముందు వరుసలో ఉన్న అధికార, ప్రతిపక్ష నేతలందరికీ నమస్కరించారు. పలువురు సీనియర్ ఎంపీలు సంతోష్‌కుమార్ వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీమణి కల్వకుంట్ల శోభ, ఎంపీ కె.కవిత ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. లోక్‌సభ సభ్యులంతా నూతన ఎంపీలను అభినందించారు. స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వచ్చి నూతన ఎంపీలను అభినందించారు. వీరితోపాటు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లారు. బలహీన వర్గాలకు చెందిన తమకు రాజ్యసభ సభ్యులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. అనంతరం సంతోష్‌కుమార్, లింగయ్యయాదవ్, బండ ప్రకాశ్‌లు ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లతో కలసి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షెడ్యూల్ 9, 10లోని ఆస్తులు, ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చారు. -
కొనసాగిన ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా దామాషా ప్రకారం ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆయా రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ 12 రోజులుగా టీఆర్ఎస్ చేస్తున్న ఆందోళన మంగళవారం కూడా కొనసాగింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై వాయిదా పడిన వెంటనే పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. తిరిగి 12 గంటలకు సభలో వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ ఎంపీలు ఎ.పి.జితేందర్‌రెడ్డి, లక్ష్మీకాంతరావు, బి.వినోద్‌కుమార్, అజ్మీరా సీతారాంనాయక్, బాల్క సుమన్, నగేశ్, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్ పాల్గొన్నారు. మా హక్కునే అడుగుతున్నాం: సీతారాం నాయక్ పార్లమెంటు ఆవరణలో సీతారాంనాయక్ మీడియాతో మాట్లాడుతూ ‘12 రోజులుగా మేం ఒకే నినాదంతో పోరాడుతున్నాం. రిజర్వేషన్ కోటాను పెంచాలి. రిజర్వేషన్ సాధించే వరకు పోరాడుతాం. రాజ్యాంగం ఇచ్చిన హక్కును మేం అడుగుతున్నాం. ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ అడగడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణచివేయకుండా చూడండి’అని పేర్కొన్నారు. ‘2001 నుంచి టీఆర్ఎస్ రిజర్వేషన్లపై స్పష్టతతో ఉంది. తెలంగాణలో ఉన్న జనాభా దామాషా ప్రకారం పెంచుకుంటామ ని ఉద్యమ సందర్భంలోనే కేసీఆర్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాం. ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ప్రధానికి గతంలోనే వివరించాం. సానుకూలంగా స్పందించారు. కానీ అది ఆచరణలో కనిపించలేదు. అందుకే ఆందోళనకు దిగాం’అని బాల్క సుమన్ చెప్పారు. ‘ఆయా రాష్ట్రాల్లో ఉండే సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలి. తమిళనాడులో 69% ఉంది. మహారాష్ట్రలో 52% రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ల పెంపుపై మరో 9 రాష్ట్రాల నుంచి కూడా నివేదనలు ఉన్నాయి. రిజర్వేషన్ల కోటా పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం. పలు పార్టీ ల మద్దతు కూడగట్టాం. తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, ఇతర విపక్షాలు మద్దతిస్తు న్నాయి. ఇది ఓ పార్టీకో, ఓ రాష్ట్రానికో సంబంధించిన అంశంగానీ కాదు. దేశంలోని చట్టాల ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది’అని పేర్కొన్నారు. అగ్రవర్ణాల పేదలకూ పరిశీలిస్తాం..: కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం చర్చించేందుకు ముందుకు రావడం లేదు. ఆ దమ్మూ ధైర్యం బీజేపీకి లేదు. మా ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. బీజేపీ మా దారిలోకి వస్తుందని భావిస్తున్నాం’అని పేర్కొన్నారు. అగ్రవర్ణాల పేదలు కూడా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్నారని మీడియా ప్రస్తావించగా ‘రిజర్వేషన్లు అవసరమైనప్పుడు ఆ డిమాండ్‌ను టీఆర్ఎస్ పరిశీలిస్తుంది’అని తెలిపారు. మా నిరసన అడ్డంకి కాదు స్పీకర్ తలచుకుంటే అవిశ్వాసంపై చర్చ సాధ్యమే : ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో వైఎస్సార్ సీపీ, టీడీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిపేందుకు తమ నిరసన ఏ మాత్రం అడ్డంకి కాదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాసంపై చర్చ జరపాలన్న ఉద్దేశం ఉంటే స్పీకర్‌కు అది పెద్ద విషయమేకాదన్నారు. తాము సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రిజర్వేషన్ల పెంపు అంశంపైనే సభలో ఆందోళన చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజనను అశాస్త్రీయంగా, హేతుబద్ధత లేకుండా చేశారని టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ జాతికే అవమానకరమన్నారు. నిన్నటి వరకు బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ నేడు అవిశ్వాస తీర్మానం పెట్టింద ని ఆరోపించారు. టీడీపీ అసలు ఎవరిని సంప్రదించి అవిశ్వాసం పెట్టిందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం తోనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని, తమతో చర్చించకుండా అవిశ్వాసం పెడితే తామెందుకు మద్దతివ్వాలని ప్రశ్నించారు. -
పెదవి విరిచిన టీఆర్ఎస్ ఎంపీలు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై మరింత స్పష్టత రావాల్సి ఉందని, ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించారో కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్పష్టత లేదని టీఆర్ఎస్ ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయం కావడంతో ఆకర్షణీయమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, కానీ కొన్ని విషయాలను బడ్జెట్లో విస్మరించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళుతామని, రాష్ట్రానికి తగిన నిధులు కేంద్రం కేటాయింస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. రాష్ట్రాల వారీగా కాకుండా మంత్రిత్వ శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు జరిపారు గత సంవత్సరం నుంచి ఈ కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోంది ఇంటింటికి మంచినీరు, రైతుల ఆదాయం రెట్టింపు, రైల్వే, మౌలిక వసతులకు బడ్జెట్ లో పెద్దపీఠ వేశారు రాష్ట్రాల అవసరాలను బట్టి బడ్జెట్‌ను మంత్రిత్వ శాఖలు కేటాయిచనున్నారు రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన నిధులను సాధిస్తాం సీఎం కేసీఆర్ లాగా బడ్జెట్‌ను కేంద్రంగానీ, ఏ దేశంగానీ రూపొందించలేవు అన్ని వర్గాల ప్రజల కష్టాలు, అవసరాలు, ప్రజల నాడిని పట్టుకొని సీఎం రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు మిషన్ భగీరథ, పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ ఇలా ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ రూపొందించారు బడ్జెట్ ప్రసంగం విన్నా, చిన్న పిల్లాడు చదివినా అర్థం అయ్యేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది కానీ కేంద్ర బడ్జెట్లో స్పష్టత లేదు - జితేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల సంవత్సరం కావడంతో ఆకర్షణీయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు గ్రామీణాభివృద్ధి, రైతాంగానికి పెద్దపీఠ వేశారు అయితే కొన్ని అంశాలను విస్మరించారు పశుసంవర్థక శాఖకు కేవలం రూ. 11 వేల కోట్లు, హార్టికల్చర్‌కు రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించారు కేంద్రం బడ్జెట్‌తో పోలిస్తే తెలంగాణ బడ్జెటే ముందుంది గొర్రెల పెంపకానికే రాష్ట్ర ప్రభుత్వం రూ. నాలుగు వేల కోట్లు కేటాయించింది బడ్జెట్లో లెక్కలు చెప్పారు కానీ, ఏ రాష్ట్రంలో ఏది నెలకొల్పబోతున్నారు, ఏం కేటాయించబోతున్నారో చెప్పలేదు తెలంగాణపై పెట్టుబడి పెడితే, తిరిగి రాష్ట్రం దేశానికి కాంట్రిబ్యూషన్ ఇస్తుంది దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి వచ్చే టాక్స్‌లు ఎక్కువ నిరుద్యోగుల శిక్షణకు నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పే ఆలోచనను స్వాగతిస్తున్నాం గిరిజన బిడ్డలు అధికంగా ఉన్న తాండూరు, పరిగి లో కొత్తగా ఏకలవ్య పాఠశాలలు వస్తాయని ఆశిస్తున్నా సొంతిళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయించింది ఈ విషయంలో డబుల్ బెడ్ రూం స్కీంతో తెలంగాణ ముందు వరుసలో ఉంది మిషన్ భగీరథ, కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు కోరాం కేంద్రం సైతం ఇంటింటికి మంచినీటి పథకం కోసం నిధులు కేటాయించింది ఈ పథకంలో భాగంగా ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథకు నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నా - కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీ -
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నిలదీయండి
నల్లగొండ టూటౌన్: ఫసల్ బీమా పథకం గురించి చెప్పని టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వచ్చినప్పుడు రైతులు నిలదీయాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు వచ్చినప్పుడు రైతులకు అండగా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫసల్ బీమా పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు. రైతులకు మేలు చేసే ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఎకరాకు 4 వేలు ఇస్తే రైతుల సమస్యలు తీరవని, పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రైతులు బిచ్చగాళ్లు కాదని, వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచండి
అరుణ్ జైట్లీని కోరిన టీఆర్ఎస్ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ 19 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి సాధిస్తోందని, అందువల్ల రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచి రుణాలు తీసుకొనే పరిమితి పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని అదనంగా 0.5 శాతం పెంచాలని కోరారు. వెనుకబడ్డ జిల్లాలకు రావాల్సిన రూ.450 కోట్ల మూడో విడత నిధులు విడుదల చేయాలని అరుణ్ జైట్లీని కోరినట్లు సమావేశం అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. -
ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతు
టీఆర్ఎస్ ఎంపీల వెల్లడి న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు చిత్తశుద్ధితో ఉన్నారని, వర్గీకరణకు టీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో టీఎమ్మార్పీఎస్, మాదిగ విద్యార్థి జేఏసీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. గురువారం రెండో రోజు జరిగిన ఈ ధర్నాలో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొని మద్దతు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, ఈ తీర్మాన ప్రతులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారని ఎంపీలు తెలిపారు. కాగా, ఈ ధర్నాలో ఎస్సీ కార్పొరేషన్ చెర్మన్ పిడమర్తి రవి, టీఎమ్పార్పీఎస్ అధ్యక్షుడు ఈటుక రాజు, మాదిగ విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాలు పెరిగాయి.. నిధులు పెంచండి
కేంద్ర మంత్రులను కోరిన టీఆర్ఎస్ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే నిధులు, ఇతర ప్రయోజనాలను పెంచాలని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, సృ్మతీ ఇరానీలను టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. బుధవారం ఈ మేరకు ఎంపీలు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, సీతారాం నాయక్, కొత్త ప్రభాకర్ రెడ్డి, పసునూరి దయాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై వినతిపత్రాలను సమర్పించారు. జవదేకర్‌తో సమావేశమై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించి నట్టు టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణలో ఎరుుమ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయాలని నడ్డాను కోరినట్టు వివరించారు. స్మృతీ ఇరానీతోనూ సమావేశమై.. మహబూబ్‌నగర్‌లో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. 2026 వరకు అసెంబ్లీ స్థానాల పెంపు కుదరని, పునర్విభజన చట్ట ప్రకారం సీట్ల పెంపు చేయాల్సి వస్తే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేయడంపై ఆయన స్పందిస్తూ.. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చిస్తున్నామని తెలిపారు. కాగా, పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేపడుతోందని ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ముంపు గ్రామాల్లో ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతోందన్నారు. -
హుందాగా వ్యవహరించాలని ఎంపీలకు కేసీఆర్ ఫోన్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్టీ ఎంపీలతో ఫోన్లో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో సభలో హుందాగా వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా పార్టీ ఎంపీలకు సూచించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లొద్దని, సభను అడ్డుకోవద్దని సూచనలు చేసిన కేసీఆర్.... సమస్యల పరిష్కారం కోసం తగిన విధంగా ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళదామని తెలిపారు. అలాగే పాత నోట్ల రద్దు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారని సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల పక్షంగా టీఆర్ఎస్ వైఖరి ఉండాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చించాలంటూ విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి. -
గాలిమోటార్పై గంపెడాశ
మామూనూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ ? కేంద్రంపై ఒత్తిడికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం నేడు ఢిల్లీలో కొత్త ఎయిర్‌పోర్టులపై సమావేశం సాక్షి, హన్మకొండ :వరంగల్ ఎయిర్ పోర్టు పునరుద్ధరణ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. వరంగల్ ఎయిర్‌పోర్టును వాడుకలోకి తీసుకొచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ ఎంపీలు నడుం బిగించారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తే వరంగల్ వాసులకు విహంగయానం అందుబాటులోకి వచ్చినట్లే. తెలుగు రాష్ట్రాలకు చెందిన అశోక్‌గజపతిరాజు ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం, పాత ఎయిర్ స్ట్రిప్, ఎయిర్డ్రోమ్ల పునురుద్ధరణపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. శుక్రవారం న్యూఢిల్లీలో అశోక్‌గజపతిరాజు అధ్యక్షతన కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలు హాజరవుతున్నారు. రాష్ట్రంలో రెండో పెద్దనగరమైన వరంగల్‌లో ఉన్న మామునూరు ఎయిర్‌పోర్టును పునరుద్ధరించాలని వీరు ప్రధానంగా కోరనున్నట్లు సమాచారం. అడ్డుగా 150 కిలోమీటర్లు హైదరాబాద్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) పరిధిలో 150 కిలోమీటర్ల పరిధిలో మరో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు వీలు లేదు. ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల్లో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసిన జీఎంఆర్ సంస్థల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఫలితంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండంలలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కేవలం కొత్తగూడెం ఎయిర్‌పోర్టు అభివృద్ధి పైనే ప్రకటనలు ఇస్తోంది. వరంగల్‌పై ప్రత్యేక దృష్టి.. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రెండో పెద్ద నగరం కావడంతో పాటు త్వరలో ఇక్కడ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టెక్స్టైల్స్ పార్కును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు మఫత్‌లాల్ వంటి ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. భారతక్రికెట్ కంట్రోల్ బోర్డుతో చర్చలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఇక్కడ కొలువుదీరగా త్వరలో ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి జాతీయస్థాయి విద్యాసంస్థలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో 150 కిలోమీటర్ల నిబంధన నుంచి వరంగల్ ఎయిర్‌పోర్టుకు సడలింపు ఇవ్వాలనే అంశంపై కేంద్రంతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 ఏళ్లుగా భూసేరకణ... మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరణ 1960కి ముందే భూసేకరణ చేసినట్లు రికార్డులు చెపుతున్నాయి. విమానాశ్రయం కోసం మామునూరు ప్రాంతంలో మొత్తం 706 ఎకరాలు సేరించారు. విమానాశ్రయం అవసరాలకు కనీసం 1200 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలని చెప్పడంతో అదనంగా 450 ఎకరాలు సమీప గ్రామాల్లోని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. దీని కోసం రూ.28 కోట్లు అవసరమవుతాయని... ఈ మొత్తం విడుదల చేస్తే రైతులకు ముందుగా చెల్లింపులు జరుపుతామని ప్రభుత్వానికి నివేదించారు. 2008లో ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం జిల్లాకు వచ్చింది. అప్పటి కలెక్టర్‌తో భేటీ అయ్యింది. మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుకు అక్కడి స్థలాన్ని పరిశీలించింది. జిల్లా యంత్రాంగం నుంచి భూసేకరణ ప్రారంభానికి ముందుగా రూ.28 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసింది. భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ప్రకటన జారీ చేసేందుకు అనుమతివ్వాలని జిల్లా అధికారులు 2012 డిసెంబరులో ప్రభుత్వానికి లేఖ రాసారు. ప్రభుత్వం నుంచి దీనిపై ఇప్పటికీ స్పందన రాలేదు. నిజాం హయాంలోనే... హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వ హయంలో మామునూరు విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నడిచేవి. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం సమయంలోనూ ఈ విమానాశ్రయంలోనే రక్షణ దళాలు మొహరించాయి. ఆ తర్వాత సర్వీసులు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరణ, విస్తరణ డిమాండ్ సుదీర్ఘంగా ఉంది. దేశ తొలిప్రధాని నెహ్రూ తొలిసారిగా వరంగల్‌కు వచ్చినప్పుడు వాయుదూత్ విమానంలో మామునూరులో దిగారు. అప్పటి నుంచి జిల్లా యంత్రాంగం భవిష్యత్ అవసరాల దృష్యా›్ట మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరించాలని కేంద్రానికి ప్రతిపాదనలుS పంపుతూనే ఉంది. -
కేంద్ర సర్కార్‌కు అంశాలవారీగా సహకారం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా సహకారం అందిస్తామని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పారు. హైకోర్టు విభజనపై పార్లమెంట్లో పోరాడుతామన్నారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం పార్టీ ఎంపీలతో సమావేశమై పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో కలసి చర్చిస్తామని చెప్పారు. -
సవరణ బిల్లు తీసుకురండి
హైకోర్టు విభజనపై కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్ * ఏపీ న్యాయమూర్తులను తెలంగాణకు పంపారు * సమస్య పరిష్కరించకుంటే పార్లమెంటులో ఆందోళన తప్పదు * కేంద్ర మంత్రులతో భేటీ.. వివాదాన్ని పరిష్కరించాలని విన్నపం సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై కేంద్రం సవరణ బిల్లు తేవాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఎక్కడ పనిచేస్తున్న న్యాయాధికారులు అక్కడే ఉండాలంటూ అపాయింటెడ్ డే కంటే రెండ్రోజుల ముందు డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను కాదని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ న్యాయాధికారుల కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మంగళవారం టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, ఎ.పి.జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితర ఎంపీలంతా తెలంగాణ న్యాయవాదులతో వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, డీవోపీటీ మంత్రి జితేంద్రసింగ్, న్యాయమంత్రి సదానందగౌడలను కలిశారు. తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలను వివరించారు. తక్షణం హైకోర్టు విభజన జరగాలని, న్యాయాధికారుల కేటాయింపులపై జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలుత కె.కేశవరావు మాట్లాడుతూ.. ‘‘సబార్డినేట్ జ్యుడీషియరీ సర్వీసులకు సంబంధించి ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం చెప్పిందేమిటంటే... ఒక కమిటీ వేసి విభజన జరపాలని చెప్పింది. దాన్నే ప్రస్తావిస్తూనే అపాయింటెడ్ డే కంటే రెండ్రోజుల ముందు మార్గదర్శకాలు వెలువడ్డాయి. కేంద్రం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఏ రాష్ట్రంలో పనిచేసే న్యాయాధికారులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలని చెప్పారు. అయినా న్యాయాధికారుల కేటాయింపులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ పోస్టుల్లో బదిలీ చేసి పంపారు. ఆప్షన్ ఇవ్వొచ్చన్న సాకుతో ఇలా చేశారు. ముందుగా స్వస్థలం.. తర్వాత ఆప్షన్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలి. మీ ఖాళీల కంటే మీరు ఎక్కువగా ఉన్నప్పుడు.. సర్దుబాటు కానప్పుడు ఇక్కడ సర్దుబాటు చేయొచ్చు. కానీ అలా చేయకుండా తెలంగాణలో నింపేశారు. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇక్కడ న్యాయాధికారులుగా నియమితులైన వారు చివరకు హైకోర్టు న్యాయమూర్తులవుతారు. అంటే మరో ముఫ్పై ఏళ్ల వరకు తెలంగాణ హైకోర్టులో కూడా ఏపీ న్యాయమూర్తులే ఉంటారు. తెలంగాణ హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులు ఉండడానికి వీలు లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు’’ అని అన్నారు. ఈ అన్యాయంపై నిరసన వ్యక్తం చేసిన న్యాయాధికారులను సస్పెండ్ చేశారని, ఇది దేశంలోనే మొదటిసారని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ మంత్రులకు వివరించామని, వారికి మొత్తం విషయం అర్థమైందని పేర్కొన్నారు. న్యాయమంత్రి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అన్నారని, తమతో ఏకీభవించినట్టుగా కనిపించిందని చెప్పారు. న్యాయవాదులను రోడ్డెక్కిస్తున్నారు: ఎంపీ జితేందర్‌రెడ్డి మంచిగా విడిపోయాం. మనుషులుగా కలిసి ఉందాం. అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, మనోభావాలు రెచ్చగొడుతూ న్యాయవాదులను రోడ్డెక్కిస్తున్నారు. మాకు రావాల్సిన నీళ్లను అడ్డుకున్నారు. మా నియామకాలను అడ్డుకుంటున్నారు. ఏపీ అనవసరంగా లేనిపోని గొడవలు చేస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరించాం. మా హైకోర్టును మాకు అప్పగించాలని, న్యాయాధికారులను విభజించాలని కోరాం. రిజిస్ట్రార్ జనరల్ ఎలా నిర్ణయం తీసుకుంటారు: ఎంపీ వినోద్‌కుమార్ న్యాయాధికారులు తమ సంఘం ద్వారా హై కోర్టు చీఫ్ జస్టిస్‌కు విన్నవించుకున్నారు. చీఫ్ జస్టిస్ నాయకత్వాన కమిటీ వేశారు. ఆ కమిటీలో తేలలేదు. ఏపీలో పుట్టి అక్కడ ప్రాక్టీస్ చేసి న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వారిని తెలంగాణకు కేటాయించడం సరికాదని ఆ కమిటీ అభిప్రాయపడ్డట్టు అర్థమవుతోంది. దీంతో చీఫ్ జస్టిస్ దీన్ని ఫుల్ కోర్టుకు రిఫర్ చేశారు. అక్కడ తెలంగాణ న్యాయమూర్తులు ముగ్గురు ఉంటే ఏపీకి చెందినవారు 18 మంది ఉన్నారు. వారంతా తెలంగాణ న్యాయాధికారుల కేటాయింపులపై ముందుకెళ్లారు. దీన్ని తప్పుపడుతూ న్యాయాధికారులు నిరసన తెలియజేస్తే చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సస్పెండ్ చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ కేటాయింపులపై నిర్ణయం ఎందు కు తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి. మిమ్మల్ని ఎవరు గైడ్‌లైన్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పారు? విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. కేంద్రం ఒక కమిటీ వేసి మార్గదర్శకాలు రూపొంది స్తుందని, అప్పుడు విభజన జరగాలని చెప్పిం ది. కానీ మీరు సొంతంగా ఎలా రూపొందిం చారు? ఏపీ విభజన చట్టం సెక్షన్ 31 సబ్‌క్లాజ్‌లో రెండేళ్లలో రాష్ట్రపతి హైకోర్టుపై నోటిఫై చేస్తారని చెప్పి ఉంటే అయిపోయేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సరికాదు. మోదీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ సబ్ క్లాజ్ చేర్చండి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే పార్లమెంటులో మా నిరసన తెలుపుతాం. నేడు హైకోర్టు బంద్‌కు పిలుపు టీఆర్ఎస్ ఎంపీల విలేకరుల సమావేశానికి ముందు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు, అడ్వొకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, జయాకర్ తదితరులు మాట్లాడారు. న్యాయవాదుల అరెస్టులు, న్యాయాధికారుల సస్పెన్షన్‌కు నిరసనగా బుధవారం హైకోర్టు బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయాలని కేంద్రానికి విన్నవించినట్టు తెలిపారు. -
అసెంబ్లీ స్థానాల పెంపుపై ఏజీకి నివేదిస్తాం
-
అసెంబ్లీ స్థానాల పెంపుపై ఏజీకి నివేదిస్తాం
* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి * రాజ్యసభ ఎంపీల లాటరీపై ఓ అవగాహనకు.. * ఆ గ్రామాలను తెలంగాణలో ఉంచాలనడం సబబే * పలు సమస్యలపై వెంకయ్యతో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపుపై అటార్నీ జనరల్‌కు నివేదించనున్నట్టు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. అటార్నీ జనరల్ తన అభిప్రాయాన్ని న్యాయ శాఖకు తెలియజేస్తారని, దాని ఆధారంగానే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుపై తదుపరి నిర్ణయముంటుందని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, వినోద్ గురువారమిక్కడ వెంకయ్యతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వెంకయ్య విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 119 నుంచి 153కు, ఏపీలో 175 నుంచి 225కు పెంచుకోడానికి విభజన చట్టంలో వీలున్నప్పటికీ స్పష్టత లేదు. పాత జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను పెంచడంపై ఎంత వరకు చట్టబద్ధత ఉంటుందనే దానిపై చర్చించాం. అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రానికి అభ్యంతరం లేదు. ఇతర రాష్ట్రాలు ప్రశ్నించకుండా చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం’ అని వెంకయ్య చెప్పారు. విభజన సమయంలో జరిగిన పొరపాటు వల్ల తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులను ఏపీకి, ఏపీకి చెందిన వారిని తెలంగాణకు లాటరీ పద్ధతిలో కేటాయించడం వల్ల వచ్చిన సమస్యపై ఓ అవగాహనకు వచ్చినట్లు వెంకయ్య తెలిపారు. రెండు రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్‌తో పాటు ఏపీ, తెలంగాణ సీఎంలతో మాట్లాడి పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఉన్న అవకాశాలను వివరిస్తానన్నారు. అలాగే పోలవరం ముంపు దృష్ట్యా ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కోరడం సహేతుకంగానే అనిపిస్తోందని వెంకయ్య చెప్పారు. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అంగీకారానికి వస్తే న్యాయ శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు. తెలుగుభాషను పరిరక్షించుకోవాలి మాతృభాష తెలుగును పరిరక్షించుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ఆంధ్రా అసోసియేషన్ రూపొందించిన కొత్త సంవత్సర క్యాలెండర్‌ను గురువారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో తెలుగు భాష తెరమరుగవడానికి చేస్తున్న చర్యలు సరికాదన్నారు. 17న సంక్రాంతి సంబరాల విందు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మణినాయుడు, ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, లహరి, నజీర్‌జాన్, రామ్ గణేష్, రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
'ఫిబ్రవరిలో తెలంగాణలో పర్యటిస్తా'
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ ఎంపీలు భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా పారికర్‌తో సమావేశమైన మంత్రులు తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి బైసన్ పోలో గ్రౌండ్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దాంతో ఫిబ్రవరిలో తాను తెలంగాణలో పర్యటిస్తానని పారికర్ తెలంగాణ మంత్రులకు చెప్పినట్టు తెలిసింది. అంతేకాక పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తానని పారిక్కర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. అంతకముందు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కలిశారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్ను బకాయిలు విడుదల చేయాలని ఆయన కోరారు. అంతేకాక తెలంగాణకు రుణ పరపతి పరిమితి పెంచాలని ఈటల విజ్ఞప్తి చేశారు. -
రూటు మార్చిన టీఆర్ఎస్!
కేంద్రంతో ఢీ అంటే ఢీ * రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గళం * రాష్ట్ర ఆకాంక్షలపై నిత్య నిరసన * కేంద్రంలో చేరికకు దారులు మూసుకుపోవడమే కారణమా? సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై అధికార టీఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. గత నెల 21వ తేదీన ప్రారంభమైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ను పరిశీలిస్తున్న వారు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు తయారైన విధానం, పార్టీ అధినేత కేసీఆర్‌తో వారు జరిపిన భేటీలు, ముందస్తు వ్యూహం వంటి అంశాలను గమనిస్తే రూటు మార్చిన టీఆర్ఎస్ కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలకు దిగుతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై గట్టిగానే నిలదీస్తున్నారు. గత ఏడాది అటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక కేంద్రంతో టీఆర్ఎస్ కొంత దూరమే పాటించింది. కానీ కొద్ది నెలలు గడిచాక గులాబీ నేతలు కేంద్రంతో అంటకాగడానికే అత్యధిక పాధాన్యం ఇచ్చారు. ఈ కార ణంగానే టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరుతోందన్న ప్రచారమూ జోరుగా సాగింది. మొదట్లో దూరం పాటించి, ఆ తర్వాత దగ్గరైన తీరు ఈ వార్తలకు బలం చేకూర్చిం ది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, అవసరాల దృష్ట్యా అవకాశం వస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరడానికీ సిద్ధమేనని ఆ పార్టీ ఎంపీలు ఒకరిద్దరు బహిరంగంగానే ప్రకటించారు. మరో వైపు ప్రధానిమోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన మానస పుత్రిక ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర రాజధాని వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వం ‘స్వచ్ఛ హైదరాబాద్ ’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. వాస్తవానికి స్వచ్ఛ భారత్ జరిగినప్పుడు కనీసం పట్టించుకోలేదు. రాష్ట్ర్రాభివృద్ధి కోసం కేంద్రంతో స్నేహ సంబంధాలే కొనసాగిస్తామని గులాబీ నాయకత్వం ప్రకటనలు గుప్పించింది. ఒక విధంగా టీఆర్ఎస్ ఇన్నాళ్లూ రాజీధోరణినే ప్రదర్శించింది. కానీ, పార్లమెంట్ సమావేశాలు వేదికగా రూటు మార్చింది. విభజన చట్టం అమలు పేర పోరాటం రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో కేంద్రం పట్టింపు లేని తనంపై గళమెత్తుతున్న టీఆర్ఎస్ వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేసింది. పార్లమెంట్ సమావేశాలకు ముందే పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలకు గెడైన్స్ ఇచ్చారు. తెలంగాణకు ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీలో జరుగుతున్న జాప్యం, కమలనాథన్ కమిటీ పనితీరు, తదితర అంశాలపై పట్టుబడుతోంది. ప్రధానంగా రాష్ట్ర హైకోర్టు విభజన అంశంపైనే దృష్టి పెట్టింది. పదో షెడ్యూల్లోని సంస్థల విభజన విషయంలో బాగా ఆలస్యం జరుగుతోందని ఎంపీలు వాదిం చారు. కేంద్రంలోని కొందరు పెద్దలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా, తెలంగాణ అంశాలకు వ్యతిరేకంగా ఉంటున్నారన్న బలమైన అభిప్రాయంతో కేంద్రంతో అమీతుమీకి దిగారు. ఈ కారణంగానే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు టీఆర్ఎస్ ఎంపీలకు మధ్య వాగ్వాదం కూడా జరిగిందంటున్నారు. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో టీఆర్ఎస్ ఎంపీలు విజయం సాధిం చారు. కాగా, కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి ఉన్న దారులన్నీ మూసుకుపోవడం వల్లే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరసలో ఉన్న పొలిటికల్ జేఏసీ.. రాష్ట్ర విభజన పూర్తిగా జరగలేదని, సంపూర్ణ తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తామని ఇస్తున్న ప్రకటనలతో కూడా టీఆర్ఎస్ ముందే మేల్కొని, కేంద్రంపై కాలుదువ్వుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఆందోళన చేపట్టారు. హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఫ్లకార్డులను ప్రదర్శించారు. లోక్ సభలో ఎంపీలు వెల్‌లోకి దూసుకెల్లి స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. హైకోర్టును విభజించి తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
రేపు గవర్నర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి నరసింహన్‌తో భేటీ అవుతారు. హైకోర్టు విభజన ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్‌ను కోరనున్నారు. -
పార్లమెంట్లో హైకోర్టు విభజన సెగ
న్యూఢిల్లీ: లోక్‌సభ మంగళవారం దద్దరిల్లింది. తెలుగు రాష్ట్రాల హైకోర్టును విభజించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు సభలో డిమాండ్ చేశారు. ఎంపీలు ఫ్లకార్డులతో స్పీకర్ పోడియం చుట్టుముట్టి హైకోర్టు విభజించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. టీఆర్ఎస్ ఎంపీలను ఆందోళన విరమించి తమ తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని సూచించారు. ఏదైనా అంశం చర్చించాలనుకుంటే జీరో అవర్ లో ప్రస్తావించవచ్చని ఆమె టీఆర్ఎస్ ఎంపీలను కోరారు. అయినా ఎంపీలు తమ పట్టు వీడక పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని విభజన అంశం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. అయినా టీఆర్ఎస్ ఎంపీలు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను 11.20 నిమిషాల పాటు వాయిదా వేశారు. -
పార్లమెంట్ వద్ద టీఆర్ఎస్ ఎంపీల ధర్నా
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. -
'ఆత్మగౌరవాన్ని చంపుకుని ధర్నాలు చేస్తున్నారు'
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్‌కు పేరు మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎంపీలు బి.సుమన్, బి.నర్సయ్య గౌడ్లు విలేకర్లతో మాట్లాడుతూ... కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. టెర్మినల్ పేరు విషయంలో టి.టీడీపీ నేతలు ఆత్మగౌరవాన్ని చంపుకుని ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని సుమన్, నర్సయ్య గౌడ్ వెల్లడించారు. -
'బాబుతో భేటీకి కేసీఆరే చొరవ చూపారు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ సంతృప్తికరంగా సాగిందని టీఆర్ఎస్ ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్ రెడ్డిలు శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి మోడీ హామీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో బయ్యారం ఉక్కు కర్మాగారం, హార్టికల్చర్ యూనివర్శిటీ, ఎన్టీపీసీ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారని వెల్లడించారు. అలాగే తెలంగాణలో సోలార్ అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని మోడీ భరోసా ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత డేటాతో అక్రమాలు జరుగుతున్నాయని... ఈ నేపథ్యంలో గత నెల 19న సర్వే చేపట్టామని ప్రధానికి వివరించినట్లు చెప్పారు. అయితే తెలంగాణలో నిర్వహించిన సర్వే వివరాలు కేంద్రానికి పంపాలని మోడీ కోరారని చెప్పారు. వీలైతే దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సర్వే చేపట్టాలని ప్రధానికి కేసీఆర్ విన్నవించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో చర్చకు తానే చొరవ చూపానని ప్రధాని మోడీకి ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వివరించారని టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డిలు తెలిపారు. హైదరాబాద్‌లో తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి సామరస్యంగా మెలగాలని ప్రధాని మోడీ సూచించారని టీఆర్ఎస్ ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్ రెడ్డిలు తెలిపారు. -
రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు
-
సీఎం అధికారాలను కత్తిరించే యోచన లేదు
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చలు సఫలం అయ్యాయిన టీఆర్ఎస్ ఎంపీ కేకే తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం రాజ్‌నాథ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం కేకే మాట్లాడుతూ రాష్ట్ర అధికారాలను తగ్గించబోమని రాజ్‌నాథ్ చెప్పారని, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే నడుచుకుంటామన్నారన్నారు. ముఖ్యమంత్రి అధికారాలను హరించబోమని, రాష్ట్రాల హక్కుల అధికారాల్లో జోక్యం చేసుకోమని రాజ్‌నాథ్ చెప్పారని కేకే తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతామన్నారన్నారు. కాగా అంతకు ముందు గవర్నర్‌కు అధికారాలు అప్పగింత అంశంపై ఎంపీలు హోంమంత్రితో చర్చించారు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇస్తే రాష్ట్ర హక్కులను హరించడమేనని ఎంపీలు తేల్చి చెప్పారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఇక నరసింహన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. -
రాజ్‌నాథ్ ను కలవనున్న టీఆర్ఎస్ ఎంపీలు
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను గురువారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీలు కలవనున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీ వినోద్ తెలిపారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టడంపై మంత్రితో చర్చిస్తామని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అవసరమేలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో రాజ్యాంగానికి లోబడి కేంద్రం వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు మండలాల కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందనడంలో వాస్తవం లేదని వినోద్ కొట్టిపారేశారు. -
29వ రాష్ట్ర అధికారాలను లాగేసుకుంటారా?
న్యూఢిల్లీ: రాష్ట్రపునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షను 8ని చూపి కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమించిందని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. 28 రాష్ట్రాల్లోలేని విధంగా 29వ రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి అధికారాలను లాగేసుకోవడాన్ని, గవర్నర్ పాలనకు అధికారాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీ వినోద్‌లు తెలిపారు. పార్లమెంటులో ఈ అంశంపై ఈరోజు పెద్ద దుమారం లేచింది. గవర్నర్‌కు శాంతి భద్రతల ప్రత్యేక అధికారాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లోక్‌సభలో ఉదయం ఈ పార్టీ సభ్యులు వాయిదా తీర్మానం కోరుతూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చాం. అయితే ఆ నోటీసును స్పీకర్ తిరస్కరించారు. అయితే వారు ఆందోళన కొనసాగించడంతో హొంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వచ్చి విభజన చట్టానికి అనుగుణంగానే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం టిఆర్ఎస్ సభ్యులు పార్లమెంటు బయట విలేకరులతో మాట్లాడుతూ సెక్షను 8 ప్రకారం గవర్నర్ పరిధి ఉంటే తప్పుపట్టడంలేదన్నారు. సెక్షను 8లో లేని అధికారాలను ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గవర్నర్‌కు శాంతిభద్రతల విశేష అధికారాల ఆదేశాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. -
లోక్‌సభ రెండు గంటల వరకూ వాయిదా
న్యూఢిల్లీ : తెలంగాణ ఎంపీలు నిరసనలు, నినాదాల మధ్య లోక్ సభ మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడింది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం లోక్ సభలో ఆందోళనకు దిగారు. దాంతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ తొలుత ఓసారి వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా టీఆర్ఎస్ ఎంపీలు తమ పట్టు వీడలేదు. ఈ అంశంపై చర్చించాల్సిందేనంటూ సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చర్చకు మళ్లీ అవకాశం ఇస్తామని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు. -
లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
-
లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ : లోక్‌సభ సోమవారం జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. గవర్నర్ గిరి వద్దంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. కాగా సోమవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అంతకు ముందు గవర్నర్‌కు అధికారాలపై టీఆర్ఎస్ ఎంపీలు సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే ఎంపీల నిరసనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీల నిరసనల మధ్య రాజ్యసభ కూడా పది నిమిషాలు వాయిదా పడింది. డబ్ల్యూటీవోపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఎంపీలు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో రాజ్యసభను ఛైర్మన్ వాయిదా వేశారు. -
కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ అనుసరించాల్సని వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చించారు. కేంద్ర నిర్ణయం పట్ల లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపాలని, ఈ విషయంపై ఇతర పార్టీలతో చర్చించాలని కేసీఆర్ ఎంపీలతో చెప్పారు. -
పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపిస్తాం: టీఆర్ఎస్
పోలవరం ఆర్డినెన్స్‌పై అభ్యంతరాలు చెబుతాం... టీఆర్ఎస్ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంకోసం పోరాడినట్టే, తెలంగాణ పునర్నిర్మాణానికి కావలసిన నిధులు, రాయితీలకోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా పార్లమెంట్లో టీఆర్ఎస్ తరఫున తమ వాణిని వినిపిస్తామని చెప్పారు. లోక్‌సభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం టీఆర్ఎస్ లోక్‌సభా పక్షం నేత జితేందర్ రెడ్డి, పార్టీ ఎంపీలు కవిత, నర్సయ్యగౌడ్, బాల్క సుమన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూనే, మరోవైపు తెలంగాణకు అధిక నిధులకోసం పోరాడతామని జితేందర్‌రెడ్డి చెప్పారు. ‘ పోలవరం ముంపు గ్రామాలపై ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయంతో 200గ్రామాల ఆదివాసీలను నిర్వాసితులను చేయొద్దని కోరేందుకు రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తాం. సానుకూల స్పందన రాకపోతే సభలో మా వాణి వినిపిస్తాం’ అని పేర్కొన్నారు. ‘ఆర్డినెన్స్ చర్చకు వచ్చినప్పుడు సభలో మా వాదన తప్పక వినిపిస్తాం. తెలంగాణకు నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక సహాయం కోసం పోరాటం చేస్తాం, సీమాంధ్రకు ఇచ్చిన పన్ను రాయితీ సదుపాయాలు తెలంగాణకు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రికి, ఆర్థిక మంత్రికి వివరిస్తాం’ అని కవిత తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కావలసిన నిధులు రాబట్టేందుకు శక్తివంచన లేకుండా పోరాడతామని బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. తెలంగాణ విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఎంపీగా తనవంతు కృషి చేస్తానని బాల్క సుమన్ అన్నారు. -
పార్లమెంట్లో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా
రాయలతెలంగాణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు గురువారం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలోపాటు10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా టీఆర్ఎస్ ఎంపీలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు వివేక్, మందా జగన్నాథం, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఆ సమావేశాలు 12 రోజులపాటు జరగనున్నాయి.