న్యూఢిల్లీ: లోక్సభ మంగళవారం దద్దరిల్లింది. తెలుగు రాష్ట్రాల హైకోర్టును విభజించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు సభలో డిమాండ్ చేశారు. ఎంపీలు ఫ్లకార్డులతో స్పీకర్ పోడియం చుట్టుముట్టి హైకోర్టు విభజించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.
దీంతో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. టీఆర్ఎస్ ఎంపీలను ఆందోళన విరమించి తమ తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని సూచించారు. ఏదైనా అంశం చర్చించాలనుకుంటే జీరో అవర్ లో ప్రస్తావించవచ్చని ఆమె టీఆర్ఎస్ ఎంపీలను కోరారు. అయినా ఎంపీలు తమ పట్టు వీడక పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని విభజన అంశం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. అయినా టీఆర్ఎస్ ఎంపీలు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను 11.20 నిమిషాల పాటు వాయిదా వేశారు.