29వ రాష్ట్ర అధికారాలను లాగేసుకుంటారా?
న్యూఢిల్లీ: రాష్ట్రపునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షను 8ని చూపి కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమించిందని టీఆర్‌ఎస్ ఎంపీలు మండిపడ్డారు. 28 రాష్ట్రాల్లోలేని విధంగా 29వ రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి అధికారాలను లాగేసుకోవడాన్ని, గవర్నర్ పాలనకు అధికారాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీ వినోద్‌లు తెలిపారు. పార్లమెంటులో ఈ అంశంపై ఈరోజు పెద్ద దుమారం లేచింది. గవర్నర్‌కు శాంతి భద్రతల ప్రత్యేక అధికారాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లోక్‌సభలో ఉదయం ఈ పార్టీ సభ్యులు వాయిదా తీర్మానం కోరుతూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చాం. అయితే ఆ నోటీసును స్పీకర్ తిరస్కరించారు. అయితే వారు ఆందోళన కొనసాగించడంతో హొంమంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చి విభజన చట్టానికి అనుగుణంగానే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
అనంతరం టిఆర్ఎస్ సభ్యులు పార్లమెంటు బయట విలేకరులతో మాట్లాడుతూ సెక్షను 8 ప్రకారం గవర్నర్ పరిధి ఉంటే తప్పుపట్టడంలేదన్నారు. సెక్షను 8లో లేని అధికారాలను ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గవర్నర్‌కు శాంతిభద్రతల విశేష అధికారాల ఆదేశాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.