
ఒక్కో అవార్డుకు రూ.2 లక్షలతో పాటు మెడల్
నేటి నుంచి ఈ నెల 23 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
‘గవర్నర్ ఎట్ హోం’కార్యక్రమంలో అవార్డుల ప్రదానం
గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ‘గవర్న ర్ ప్రతిభా అవార్డులు’ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ నిర్ణయించారు. ఈ అవార్డులను వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘గవర్నర్ ఎట్ హోం’కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రదానం చేస్తారని గవర్నర్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఒక్కో అవార్డుకు రూ.2 లక్షలతో పాటు ఒక మెడల్ కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
రాజ్‌భవ న్‌లో శుక్రవారం బుర్రా వెంకటేశం విలేకరులతో మాట్లాడుతూ...అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో పనిచేసిన వారు, తెలంగాణేతరులైనా దరఖాస్తు చేసుకోవచ్చని అయితే రాష్ట్రంలో కనీసం ఐదేళ్లు పని చేస్తూ ఉండాలని చెప్పారు. ఈ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 2 నుంచి ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.
నాలుగు విభాగాల నుంచి ఆహ్వానం...
దరఖాస్తులను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని బుర్రా వెంకటేశం వెల్లడించారు. https://governor.telangana.gov.in లేదంటే గవర్నర్ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ సెక్రటేరియట్, రాజ్‌భవన్, సోమాజిగూడ, హైదరాబాద్ – 500041 కు స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా అన్ని డాక్యుమెంట్లతో పాటు సమర్పించాలని కోరారు. గవర్నర్ ఎంపిక చేసిన కమిటీ అన్ని దరఖాస్తులను పరిశీలించి అవార్డులను ఎంపిక చేస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, ఆటల విభాగం, సాంస్కృతిక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వాస్తున్నారు. ఇందులో ఎనిమిది మందికి అవార్డులు ఇవ్వనున్నారు.