రూటు మార్చిన టీఆర్‌ఎస్! | Root changed TRS party mp's! | Sakshi
Sakshi News home page

రూటు మార్చిన టీఆర్‌ఎస్!

Published Tue, Aug 11 2015 3:28 AM | Last Updated on Fri, Nov 9 2018 5:41 PM

రూటు మార్చిన టీఆర్‌ఎస్! - Sakshi

రూటు మార్చిన టీఆర్‌ఎస్!

కేంద్రంతో ఢీ అంటే ఢీ
* రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో గళం
* రాష్ట్ర ఆకాంక్షలపై నిత్య నిరసన
* కేంద్రంలో చేరికకు దారులు మూసుకుపోవడమే కారణమా?

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై అధికార టీఆర్‌ఎస్ తన వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. గత నెల 21వ తేదీన ప్రారంభమైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ను పరిశీలిస్తున్న వారు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమావేశాలకు టీఆర్‌ఎస్ ఎంపీలు తయారైన విధానం, పార్టీ అధినేత కేసీఆర్‌తో వారు జరిపిన భేటీలు, ముందస్తు వ్యూహం వంటి అంశాలను గమనిస్తే రూటు మార్చిన టీఆర్‌ఎస్ కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనలకు దిగుతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై గట్టిగానే నిలదీస్తున్నారు.

గత ఏడాది అటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక కేంద్రంతో టీఆర్‌ఎస్ కొంత దూరమే పాటించింది. కానీ కొద్ది నెలలు గడిచాక గులాబీ నేతలు కేంద్రంతో అంటకాగడానికే అత్యధిక పాధాన్యం ఇచ్చారు. ఈ కార ణంగానే టీఆర్‌ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరుతోందన్న ప్రచారమూ జోరుగా సాగింది. మొదట్లో దూరం పాటించి, ఆ తర్వాత దగ్గరైన తీరు ఈ వార్తలకు బలం చేకూర్చిం ది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, అవసరాల దృష్ట్యా అవకాశం వస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరడానికీ సిద్ధమేనని ఆ పార్టీ ఎంపీలు ఒకరిద్దరు  బహిరంగంగానే ప్రకటించారు.

మరో వైపు ప్రధానిమోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన మానస పుత్రిక ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర రాజధాని వేదికగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘స్వచ్ఛ హైదరాబాద్ ’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. వాస్తవానికి స్వచ్ఛ భారత్ జరిగినప్పుడు కనీసం పట్టించుకోలేదు. రాష్ట్ర్రాభివృద్ధి కోసం కేంద్రంతో స్నేహ సంబంధాలే కొనసాగిస్తామని గులాబీ నాయకత్వం ప్రకటనలు గుప్పించింది. ఒక విధంగా టీఆర్‌ఎస్ ఇన్నాళ్లూ రాజీధోరణినే ప్రదర్శించింది. కానీ, పార్లమెంట్ సమావేశాలు వేదికగా రూటు మార్చింది.
 
విభజన చట్టం అమలు పేర పోరాటం
రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో కేంద్రం పట్టింపు లేని తనంపై గళమెత్తుతున్న టీఆర్‌ఎస్ వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేసింది. పార్లమెంట్ సమావేశాలకు ముందే పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలకు గెడైన్స్ ఇచ్చారు. తెలంగాణకు ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీలో జరుగుతున్న జాప్యం, కమలనాథన్ కమిటీ పనితీరు, తదితర అంశాలపై పట్టుబడుతోంది.

ప్రధానంగా రాష్ట్ర హైకోర్టు విభజన అంశంపైనే దృష్టి పెట్టింది. పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన విషయంలో బాగా ఆలస్యం జరుగుతోందని ఎంపీలు వాదిం చారు. కేంద్రంలోని కొందరు పెద్దలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా, తెలంగాణ అంశాలకు వ్యతిరేకంగా ఉంటున్నారన్న బలమైన అభిప్రాయంతో కేంద్రంతో అమీతుమీకి దిగారు. ఈ కారణంగానే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు టీఆర్‌ఎస్ ఎంపీలకు మధ్య వాగ్వాదం కూడా జరిగిందంటున్నారు.

ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో టీఆర్‌ఎస్ ఎంపీలు విజయం సాధిం చారు. కాగా, కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి ఉన్న దారులన్నీ మూసుకుపోవడం వల్లే టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరసలో ఉన్న పొలిటికల్ జేఏసీ.. రాష్ట్ర విభజన పూర్తిగా జరగలేదని, సంపూర్ణ తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తామని ఇస్తున్న ప్రకటనలతో కూడా టీఆర్‌ఎస్ ముందే మేల్కొని, కేంద్రంపై కాలుదువ్వుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement