సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం సేకరణ విధానంపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని పార్లమెంటులో టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉభయసభల్లోనూ సోమవారం తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో నిరసనకు దిగింది. వార్షిక ధాన్యం సేకరణపై ప్రకటన చేయాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పార్టీ ఎంపీలు ఉభయ సభలను అడ్డుకున్నారు. శీతాకాల సమావేశాలు ఆరంభమైన తొలి రోజు లోక్‌సభ ఆరంభమైన వెంటనే స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీ లు నిరసన చేపట్టారు. లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, రాములు, ఎమ్మెస్‌ఎన్ రెడ్డి తదితరులు సభను స్తంభింపజేశారు. వీరితో పాటు ఇతర పార్టీల సభ్యులు సైతం పంటలకు కనీస మద్దతు ధర, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు కోరుతూ నిరసనకు దిగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనను కొనసాగించడంతో సభ మంగళవారానికి వాయిదా పడింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా ఇదే అంశమై వాయిదా తీర్మానం ఇవ్వగా, స్పీకర్ దాన్ని తిరస్కరించారు.
రాజ్యసభలోనూ..
కేంద్రం సమగ్ర జాతీయ ధాన్యం సేకరణ విధానం తీసుకురావాలంటూ రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్ష నేత కె.కేశవరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత సభ ప్రారంభమయ్యాక కేకే సహా ఎంపీలు బండ ప్రకాశ్, కేఆర్ సురేశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌లు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే సమయంలో ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన చైర్మన్ వెంకయ్యనాయుడు.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు అవకాశం ఇచ్చారు. గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఏ రాష్ట్రమైనా ఉల్లంఘిస్తే, ఎటువంటి చర్యలు తీసుకుంటారని జీవీఎల్ అడిగారు. అయితే టీఆర్‌ఎస్ సభ్యులు సభకు అడ్డుపడుతుండటంతో.. శాంతించాలని, వెల్‌లోకి రావొద్దని వారికి చైర్మన్ సూచించారు. బండ ప్రకాశ్ పేరును ప్రస్తావిస్తూ ఆయన్న అదుపు చేయాల్సిందిగా కేశవరావును కోరారు. ఈ గందరగోళం మధ్యే జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానం ఇచ్చేందుకు లేచి నిలబడి మాట్లాడటం ప్రారంభించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు ఆవరణలోని గాంధీవిగ్రహం వద్ద టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన కొనసాగించారు. బీజేపీ ప్రభుత్వం–రైతుల ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు.
సమగ్ర ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలి
రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలానికి సంబంధించి కేంద్రం పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించాలని కేకే, నామా నాగేశ్వర్‌రావులు డిమాండ్ చేశారు. సమగ్ర జాతీయ ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలని కోరారు. తెలంగాణలో పెరిగిన వరిసాగుకు అనుగుణంగా ధాన్యం సేకరించాలని కోరితే కేంద్రం సరైన విధంగా స్పందించడం లేదని విమర్శించారు. యావత్ రైతాంగానికి సంబంధించిన ఈ అంశంపై మిగతా పార్టీల ఎంపీలు కూడా కలిసి రావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment