'బాబుతో భేటీకి కేసీఆరే చొరవ చూపారు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ సంతృప్తికరంగా సాగిందని టీఆర్ఎస్ ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్ రెడ్డిలు శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి మోడీ హామీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో బయ్యారం ఉక్కు కర్మాగారం, హార్టికల్చర్ యూనివర్శిటీ, ఎన్టీపీసీ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారని వెల్లడించారు. అలాగే తెలంగాణలో సోలార్ అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని మోడీ భరోసా ఇచ్చారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత డేటాతో అక్రమాలు జరుగుతున్నాయని... ఈ నేపథ్యంలో గత నెల 19న సర్వే చేపట్టామని ప్రధానికి వివరించినట్లు చెప్పారు. అయితే తెలంగాణలో నిర్వహించిన సర్వే వివరాలు కేంద్రానికి పంపాలని మోడీ కోరారని చెప్పారు. వీలైతే దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సర్వే చేపట్టాలని ప్రధానికి కేసీఆర్ విన్నవించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో చర్చకు తానే చొరవ చూపానని ప్రధాని మోడీకి ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వివరించారని టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డిలు తెలిపారు. హైదరాబాద్లో తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి సామరస్యంగా మెలగాలని ప్రధాని మోడీ సూచించారని టీఆర్ఎస్ ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్ రెడ్డిలు తెలిపారు.