సాక్షి, న్యూఢిల్లీ: జనాభా దామాషా ప్రకారం ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆయా రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ 12 రోజులుగా టీఆర్‌ఎస్ చేస్తున్న ఆందోళన మంగళవారం కూడా కొనసాగింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై వాయిదా పడిన వెంటనే పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. తిరిగి 12 గంటలకు సభలో వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ ఎంపీలు ఎ.పి.జితేందర్‌రెడ్డి, లక్ష్మీకాంతరావు, బి.వినోద్‌కుమార్, అజ్మీరా సీతారాంనాయక్, బాల్క సుమన్, నగేశ్, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్ పాల్గొన్నారు.
మా హక్కునే అడుగుతున్నాం: సీతారాం నాయక్
పార్లమెంటు ఆవరణలో సీతారాంనాయక్ మీడియాతో మాట్లాడుతూ ‘12 రోజులుగా మేం ఒకే నినాదంతో పోరాడుతున్నాం. రిజర్వేషన్ కోటాను పెంచాలి. రిజర్వేషన్ సాధించే వరకు పోరాడుతాం. రాజ్యాంగం ఇచ్చిన హక్కును మేం అడుగుతున్నాం. ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ అడగడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణచివేయకుండా చూడండి’అని పేర్కొన్నారు. ‘2001 నుంచి టీఆర్‌ఎస్ రిజర్వేషన్లపై స్పష్టతతో ఉంది. తెలంగాణలో ఉన్న జనాభా దామాషా ప్రకారం పెంచుకుంటామ ని ఉద్యమ సందర్భంలోనే కేసీఆర్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాం.
ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ప్రధానికి గతంలోనే వివరించాం. సానుకూలంగా స్పందించారు. కానీ అది ఆచరణలో కనిపించలేదు. అందుకే ఆందోళనకు దిగాం’అని బాల్క సుమన్ చెప్పారు. ‘ఆయా రాష్ట్రాల్లో ఉండే సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలి. తమిళనాడులో 69% ఉంది. మహారాష్ట్రలో 52% రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ల పెంపుపై మరో 9 రాష్ట్రాల నుంచి కూడా నివేదనలు ఉన్నాయి. రిజర్వేషన్ల కోటా పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం. పలు పార్టీ ల మద్దతు కూడగట్టాం. తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, ఇతర విపక్షాలు మద్దతిస్తు న్నాయి. ఇది ఓ పార్టీకో, ఓ రాష్ట్రానికో సంబంధించిన అంశంగానీ కాదు. దేశంలోని చట్టాల ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది’అని పేర్కొన్నారు.
అగ్రవర్ణాల పేదలకూ పరిశీలిస్తాం..: కొత్త ప్రభాకర్‌రెడ్డి
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం చర్చించేందుకు ముందుకు రావడం లేదు. ఆ దమ్మూ ధైర్యం బీజేపీకి లేదు. మా ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. బీజేపీ మా దారిలోకి వస్తుందని భావిస్తున్నాం’అని పేర్కొన్నారు. అగ్రవర్ణాల పేదలు కూడా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్నారని మీడియా ప్రస్తావించగా ‘రిజర్వేషన్లు అవసరమైనప్పుడు ఆ డిమాండ్‌ను టీఆర్‌ఎస్ పరిశీలిస్తుంది’అని తెలిపారు.
మా నిరసన అడ్డంకి కాదు
స్పీకర్ తలచుకుంటే అవిశ్వాసంపై చర్చ సాధ్యమే : ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో వైఎస్సార్ సీపీ, టీడీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిపేందుకు తమ నిరసన ఏ మాత్రం అడ్డంకి కాదని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాసంపై చర్చ జరపాలన్న ఉద్దేశం ఉంటే స్పీకర్‌కు అది పెద్ద విషయమేకాదన్నారు. తాము సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రిజర్వేషన్ల పెంపు అంశంపైనే సభలో ఆందోళన చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజనను అశాస్త్రీయంగా, హేతుబద్ధత లేకుండా చేశారని టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ జాతికే అవమానకరమన్నారు.
నిన్నటి వరకు బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ నేడు అవిశ్వాస తీర్మానం పెట్టింద ని ఆరోపించారు. టీడీపీ అసలు ఎవరిని సంప్రదించి అవిశ్వాసం పెట్టిందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం తోనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని, తమతో చర్చించకుండా అవిశ్వాసం పెడితే తామెందుకు మద్దతివ్వాలని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment