ఫసల్ బీమా పథకం గురించి చెప్పని టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వచ్చినప్పుడు రైతులు నిలదీయాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నల్లగొండ టూటౌన్: ఫసల్ బీమా పథకం గురించి చెప్పని టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వచ్చినప్పుడు రైతులు నిలదీయాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు వచ్చినప్పుడు రైతులకు అండగా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫసల్ బీమా పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు.
రైతులకు మేలు చేసే ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఎకరాకు 4 వేలు ఇస్తే రైతుల సమస్యలు తీరవని, పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రైతులు బిచ్చగాళ్లు కాదని, వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.