కేంద్ర మంత్రులను కోరిన టీఆర్‌ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే నిధులు, ఇతర ప్రయోజనాలను పెంచాలని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, సృ్మతీ ఇరానీలను టీఆర్‌ఎస్ ఎంపీలు కోరారు. బుధవారం ఈ మేరకు ఎంపీలు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, సీతారాం నాయక్, కొత్త ప్రభాకర్ రెడ్డి, పసునూరి దయాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై వినతిపత్రాలను సమర్పించారు. జవదేకర్‌తో సమావేశమై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించి నట్టు టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణలో ఎరుుమ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయాలని నడ్డాను కోరినట్టు వివరించారు.
స్మృతీ ఇరానీతోనూ సమావేశమై.. మహబూబ్‌నగర్‌లో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. 2026 వరకు అసెంబ్లీ స్థానాల పెంపు కుదరని, పునర్విభజన చట్ట ప్రకారం సీట్ల పెంపు చేయాల్సి వస్తే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేయడంపై ఆయన స్పందిస్తూ.. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చిస్తున్నామని తెలిపారు. కాగా, పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేపడుతోందని ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ముంపు గ్రామాల్లో ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతోందన్నారు.