సాక్షి, న్యూడిల్లీ: 70 ఏళ్లు తీవ్ర వెనుకబాటుతనానికి, దోపిడీకి గురైన తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం దృష్టి సారించా లని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీల అమలుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎంపీలు కె.కేశవరావు, బండ ప్రకాశ్ మాట్లాడారు.
కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఏపీలో కలిపారని, దీనివల్ల సీలేరు విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని కేకే అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సిన 6 వేల మెగావాట్ల విద్యుత్‌కు బదులు 1,600 మెగా వాట్లే ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదన్నారు.
పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, తెలంగాణకు కలిగే నష్టానికే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఏపీకి హామీల అమలుపై ఎలాంటి అభ్యంతరం లేదని, చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన వాటిని కేంద్రం అమలు చేయాలన్నారు.
హామీలపై సమాధానం చెప్పండి..
విభజన చట్టం తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించిందని బండ ప్రకాశ్ పేర్కొన్నారు. ఏపీకి అమలు కావాల్సిన హామీలనే కాకుండా తెలంగాణకు అమలు కావాల్సిన హామీలపై కూడా కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. చట్టంలో రాష్ట్రానికి బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టీ్టకల్చర్, గిరిజన వర్సిటీలు, 400 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు బాధితులకు పునరావాసం, కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు మంజూ రు కావాల్సి ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను చేపడుతున్నామని చెప్పారు. కేంద్రం ఏపీ హామీల అమలుపై చర్చించి తెలంగాణ హామీలపై స్పందించకపోవడం సరికాదన్నారు. తెలంగాణ తీవ్ర వెనుకబాటుతనానికి గురైందని, ఎన్నో పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రానికి ఇప్పటికీ కూడా నీళ్లు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును దేశమంతా ప్రశంసిస్తోందని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినట్లు నిధులను కేంద్రం విడుదల చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment