సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వంపై పోరును తీవ్రం చేయాలని అధికార టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ విషయంలో లేఖలు, లెక్కల పేరిట గోల్‌మాల్ చేస్తున్న బీజేపీ వైఖరిని ఎండగట్టేందుకు ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనుంది. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో పార్టీ ఎంపీలు, పలువురు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపై తదుపరి పోరాటం, శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. నాలుగు రోజులపాటు పార్లమెంటు లోపల, బయట నిరసన చేపట్టిన పార్టీ ఎంపీలను కేసీఆర్ అభినందించారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వడంతోపాటు ధాన్యం కొనుగోలులో వార్షిక లక్ష్యం నిర్ణయించడం, కనీస మద్దతు ధరల చట్టం కోసం డిమాండ్ చేయడంలో వెనక్కి తగ్గొద్దని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఇతర పార్టీలను కలుపుకొని సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని సూచించారు.
తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు శాసనమండలి ఎన్నికలు ముగిశాక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడదామని కేసీఆర్ ప్రతిపాదించారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో కలసి తాను కూడా ధర్నాలో పాల్గొంటానని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఎంపీలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన లెక్కలపై త్వరలో స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment