
హుందాగా వ్యవహరించాలని ఎంపీలకు కేసీఆర్ ఫోన్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్టీ ఎంపీలతో ఫోన్లో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో సభలో హుందాగా వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా పార్టీ ఎంపీలకు సూచించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లొద్దని, సభను అడ్డుకోవద్దని సూచనలు చేసిన కేసీఆర్.... సమస్యల పరిష్కారం కోసం తగిన విధంగా ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళదామని తెలిపారు. అలాగే పాత నోట్ల రద్దు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారని సమాచారం.
రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల పక్షంగా టీఆర్ఎస్ వైఖరి ఉండాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చించాలంటూ విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి.