మన ఎంపీలే మనకు బలం | 16 TRS MPs efficient than Congress and BJP put together | Sakshi
Sakshi News home page

మన ఎంపీలే మనకు బలం

Published Thu, Mar 28 2019 2:36 AM | Last Updated on Thu, Mar 28 2019 8:20 AM

16 TRS MPs efficient than Congress and BJP put together - Sakshi

సిరిసిల్ల: ఢిల్లీలో మనోళ్లు ఉంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవచ్చని టీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు అన్నారు. కేంద్రంలో బడితే ఉన్నోడిదే బర్రె అని.. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఆ రాష్ట్రాలకు నిధుల తన్నుకుంటూ వస్తాయని చెప్పారు. కరీంనగర్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. కేంద్రం మెడలు వంచాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి.. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ సాధించిన కేసీఆర్‌.. 16 మందిని గెలిపిస్తే ఎట్టుంటదో ప్రజలు ఆలోచించా లని కోరారు. కాంగ్రెస్‌ ఎంపీలు గెలిస్తే రాహుల్‌ గాం ధీకి, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోదీకి లాభమని.. అదే టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం చేకూరుతోందని చెప్పారు. ఎక్కువ మంది ఎంపీలుంటే కేసీఆర్‌ దేశానికి దిశానిర్దేశం చేస్తారన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఒక కూటమి తయారు చేస్తారని కేటీఆర్‌ వివరించారు.  

ప్రాంతీయ పార్టీలదే హవా 
దేశంలో కాంగ్రెస్, బీజేపీలు అంటే గిట్టని ప్రాంతీయ పార్టీలు అనేకం ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో గెలిచే 16 మంది ఎంపీలకు తోడు దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలను కలుపుకొని సీఎం ముందుకు వెళ్తారని వివరించారు. ఆ సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోందని చెప్పారు. మందికి ఓట్లు వేసి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చుడేంది.. మన ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి తెలంగాణ గడ్డకు మేలు చేసుకుందామని పిలుపునిచ్చారు. అందుకే ‘సారు.. కారు.. పదహారు.. కేంద్రంలో సర్కారు’అంటున్నామని పేర్కొన్నారు. కరీంనగర్‌ ఎంపీగా వినోద్‌ కేంద్రంలో మంత్రిగా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు 90 శాతం నిధులు వస్తయి.. 10 శాతం మనం పెట్టుకుంటే చాలు.. పొలాలకు నీళ్లు వస్తయి.. రెండు పంటలకు కడుపునిండా నీరు వచ్చే అవకాశం ఉంటుందని కేటీఆర్‌ వివరించారు. 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు మనం రూ.80 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని గోదావరి జలాలు పొలాలకు చేరుతాయని కేటీఆర్‌ అన్నారు. 

కేంద్రం నిధులివ్వలేదు 
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి కేంద్రంలోని నీతి ఆయోగ్‌ సంస్థ తెలంగాణకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నివేదిక ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని కేటీఆర్‌ విమర్శించారు. కేంద్రంలో బడితే ఉన్నోడిదే బర్రె అని, రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్‌కు రైల్వే లైన్లు, రైళ్లు వెళ్లాయని, లాలూప్రసాద్‌ యాదవ్‌ ఉంటే ఆయన అత్తగారి ఊరికి రైలుమార్గం వేసుకున్నారని కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల ప్రాంతానికి రెండేళ్లలో రైలు వస్తుందని, దీనికోసం సీఎం, ఎంపీ వినోద్‌కుమార్‌ ఎంతో కృషి చేశారన్నారు. మనోళ్లు ఢిల్లీలో ఉంటే ఇక్కడ గల్లీలో ఏం కావాలన్నా చేసుకోవచ్చని తెలిపారు. 

మే నుంచి పింఛన్లు  
మే నెల నుంచి ఆసరా పింఛన్లు రూ.2,016 చొప్పున ఇస్తామని, 57 ఏళ్లకే పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో 80 లక్షల మందికి పింఛన్లు ఇస్తామన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష మెజార్టీ అందించాలని కోరారు. ఎంపీ, కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ 35 ఏళ్ల కిందటే కాంగ్రెస్‌ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అర్హతను కోల్పోయిందన్నారు. బీజేపీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయని.. దేశానికి తెలంగాణ దిక్సూచి అవుతుందన్నారు. ముస్తాబాద్‌ ప్రాంత రైతాంగానికి మేలు చేసే కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేయిస్తానన్నారు. ఎంపీగా రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించడంలో, రైల్వే నిధులు సాధించడంతో ముందున్నానని స్పష్టం చేశారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత సమర్ధవంతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement