చింతమడకలో ఓటేసేందుకు వచ్చిన కేసీఆర్‌కు సిరా గుర్తు వేస్తు్తన్న సిబ్బంది. చిత్రంలో సీఎం సతీమణి శోభ
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి ధీమాతో ఉంది. తాము నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 16 లోక్‌సభ స్థానాల్లో విజయం ఖాయమని అంచనాకు వచ్చింది. 17 లోక్‌సభ సెగ్మెంట్లలో జరిగిన పోలింగ్ సరళిని, క్షేత్రస్థాయిలో ఓటింగ్ తీరుపై వచ్చిన సమాచారాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సేకరించి సమీక్షించారు. ఈ వివరాల ఆధారంగా పలువురు మంత్రులతో, అభ్యర్థులతో ఫోన్లో చర్చించారు. ‘రాష్ట్ర ప్రజలు మరోసారి టీఆర్ ఎస్‌ను దీవించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా చేసిన ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషించే విషయంపై ప్రజలు సానుకూలంగా స్పందించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు విస్తృతం కావాలంటే మన పార్టీవారినే లోక్‌సభకు పంపాలని భావించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలోనూ సానుకూలంగా ఓటింగ్ జరిగింది. 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎప్పటిలాగే ఎంఐఎం భారీ మెజారిటీతో గెలుస్తోంది. కాంగ్రెస్ ఎక్కడా పోటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ చేతులెత్తేయడంతో 2, 3 చోట్ల బీజేపీ రెండో స్థానంలో నిలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలను ప్రజలు పట్టించుకోలేదు. మన పార్టీ ఎమ్మెల్యేలు కష్టపడ్డారు. మంత్రులు సమన్వయం చేస్తూ బాగా పని చేశారు. ప్రచారంలోనే మన పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమైంది. పోలింగ్‌తో గెలుపు పూర్తయింది’అని అన్నారు. సీఎం కేసీఆర్ పలువురు అభ్యర్థులకు అభిందనలు తెలిపినట్లు తెలిసింది.
అన్నింట్లో ఆధిక్యత...
గత లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 11 స్థానాల్లో గెలించింది. ఈసారి 16 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ప్రత్యర్థి పార్టీల కంటే అన్నింట్లోనూ ముందంజలో ఉంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో భారీ ఆధిక్యంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుస్తారని ఆ పార్టీ అంచనాలో ఉంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, మల్కాజిగిరి, చేవేళ్ల, భువనగిరి, ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లోనూ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తామనే అంచనాలో ఉంది. మొత్తంగా అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమని ధీమాతో ఉంది.
పథకాలపై సానుకూలత...
తమ ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు లోక్‌సభ ఎన్నికల్లోనూ బాగా కలిసి వచ్చి ఉండొచ్చని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. అన్ని సెగ్మెంట్లలో గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు పూర్తిగా మద్దతు తెలిపారని లెక్కలేసుకుంటున్నారు. సంక్షమ పథకాల లబ్ధిదారులు, రైతులు, వారి కుటుంబాలు ఏకపక్షంగా తమకే ఓటు వేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రగతి గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ఓటింగ్‌ను బాగా ప్రభావం చూపి ఉంటాయని భావిస్తున్నారు.
ప్రచారంలో ప్రభావం...
లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం ప్రజలకు బాగా చేరిందని ఆ పార్టీ నిర్ధారణకు వచ్చింది. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర... బీజేపీ, కాంగ్రెస్‌ల వైఖరిపై కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజల్లోకి బాగా వెళ్లినట్లు టీఆర్‌ఎస్ అంచనాకు వచ్చింది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని వివరిస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగాలు ఓటర్లపై బాగా ప్రభావం చూపాయని టీఆర్‌ఎస్ భావిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రచారం చేసిన 14 స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపు ఖాయమైనే అంచనాలో ఉంది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్‌లో అన్నీతానై వ్యవహరించారు. చేవేళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ సెగ్మెంట్లలో రోడ్ షోలు నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగింపులో ఎంపీల పాత్రపై ప్రచారంలో స్పష్టంగా ప్రజలకు తెలియజేశారు.
ప్రజల మద్దతు టీఆర్‌ఎస్‌కే: కేటీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్, క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం 16 స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ గెలుస్తోందని హైదరాబాద్‌లో ఎంఐఎం విజయం సాధిస్తోందని తెలిపారు. ‘మండు వేసవిలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన టీఆర్‌ఎస్ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మీరు చేసిన కష్టంతో ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తున్నారు’ అని పోలింగ్ ముగిసిన అనంతరం కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్, అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజల తీరు గర్వంగా ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గడం ఒక్కటే నిరాశ కలిగించింది’ అని మరో ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment