‘గ్రేటర్‌’లో టీడీపీ ఖాళీ..! | Mandava Venkateshwara Rao TDP leaders join TRS | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌’లో టీడీపీ ఖాళీ..!

Published Sun, Apr 7 2019 2:53 AM | Last Updated on Sun, Apr 7 2019 2:53 AM

Mandava Venkateshwara Rao TDP leaders join TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతుండటంతో టీఆర్‌ఎస్‌లోకి వలసలు భారీగా సాగుతున్నాయి. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఇద్దరు శనివారం అధికార పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం తన నివాసంలో మండవకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్ర కూడా పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని ఈ ఇద్దరు నేతలు తెలిపారు. ఖమ్మం లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేస్తానని వద్దిరాజు రవిచంద్ర ఈ సందర్భంగా తెలిపారు.  

టీఆర్‌ఎస్‌లోకి పగిడిపాటి దేవయ్య... 
అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో మహాకూటమి తరఫున తెలంగాణ జనసమితి అభ్యర్థిగా పోటీ చేసిన పగిడిపాటి దేవయ్య శనివారం టీఆర్‌ఎస్‌ కండువా వేసుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి దేవయ్యను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. దేవయ్య 2015 వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 

సీనియర్లను గౌరవిస్తాం: కేటీఆర్‌  
తెలుగు దేశం పార్టీనుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన సీనియర్‌ నేతలను సముచితంగా గౌరవిస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. టీడీపీ హైదరాబాద్‌ నగర విభాగ అధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివాస్, కార్యదర్శి, వివిధ విభాగాల అధ్యక్షులు శనివారం టీఆర్‌ఎస్‌లోకి మారారు. కేటీఆర్‌ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి చేరికతో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. టీడీపీ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని చేరికల సందర్భంగా కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలో మిగిలిన సీనియర్‌ నేతలు, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారికి పార్టీ సముచితంగా గౌరవిస్తుందని తెలిపారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement