
సాక్షి, హైదరాబాద్ : 15 ఏళ్ల తర్వాత కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే టీఆర్‌ఎస్ ఎంపీలు మాట్లాడలేక పారిపోయారని కాంగ్రెస్ శాసన మండలి నేత షబ్బిర్ అలీ ఎద్దేవా చేశారు. బీజేపీకి టీఆర్‌ఎస్ బి టీమ్‌గా మారిందని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ హక్కుల గురించి టీఆర్‌ఎస్ పార్లమెంట్‌లో ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ఆ పార్టీ రహస్య ఎజెండా ఏంటో, కేంద్రం వద్ద ఎందుకు లాలూచీ పడుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలుగు తల్లిని ముక్కలు చేశారన్న ప్రధాన మంత్రి మాటలను టీఆర్‌ఎస్ ఎంపీలు ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. అవిశ్వాస తీర్మాన సమయంలో పార్లమెంట్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు. ఏపీ గురించి కాకపోయినా కనీసం తెలంగాణ హక్కుల గురించి మాట్లాడితే పోయేది ఏముందని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్‌కు పది సీట్లు కూడా రావు
కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని షబ్బిర్ అలీ ఆరోపించారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం,గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు హామీలను కేంద్రం నుంచి రాబట్టడంలో విఫలమయ్యారన్నారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి పది సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో పులిలా బతికారని ఇప్పుడు పిల్లికన్నా హీనమయ్యారని ఎద్దేవా చేశారు. ఎంపీ కవితకు నిజామాబాద్ లో తిరిగే పరిస్థితులు లేవని షబ్బిర్ అలీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment