పార్టీ ఎంపీలు, మంత్రులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కొందరు టీఆర్‌ఎస్ ఎంపీలు కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, దీనిపై సరైన సమయంలో స్పందిస్తానని అన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2,3 రోజుల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన లేదా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ నెల 19 నుంచి పార్ల్లమెంటు సమావేశాలు ప్రారంభమ వుతున్న నేపథ్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఎంపీలతో చర్చించడంతో పాటు వివిధ అంశాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగానే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశం, టీఆర్‌ఎస్ పోషించాల్సిన పాత్రపైనా చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
హక్కులు హరిస్తున్న కేంద్రం
‘దేశ రాజకీయాలు రోజురోజుకూ పూర్తిగా మారిపోతున్నాయి. కొత్త రాష్ట్రమైనా మనం తెలంగాణను బలంగా అభివృద్ధి చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సాయం లేకున్నా అభివృద్ధి బాటలో సాగుతున్నాం. అయితే రాష్ట్రాన్ని బలహీన పరిచేందుకు అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రం మన హక్కులను హరించి వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. అయినా టీఆర్‌ఎస్ వల్లే తెలంగాణ ఈ రోజు దేశం ముందు సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. రాష్ట్రాలకు వాటా మేరకు నిధుల కేటాయింపులు జరగడం సహజమే అయినా, కొత్త రాష్ట్రానికి ఎలాంటి అదనపు సాయం లేదు. దేశ రాజకీయాలపై ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉన్నాం. సరైన సమయంలో స్పందిస్తా..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
సాగునీటి విషయంలో అన్యాయం జరక్కూడదు
‘సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదు. లోక్‌సభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటా కోసం కేంద్రాన్ని నిలదీయాలి. గట్టిగా కొట్లాడాలి. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కృషి చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన పెండింగు సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించాలి. సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలను అందచేయాలి..’ అని పార్టీ ఎంపీలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సంబంధించి సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కేఆర్ సురేశ్‌రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్‌సభ సభ్యులు బి.బి పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment