బొర్లకుంట వెంకటేశ్ నేత, సోయం బాపురావు
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల తర్వాత 17వ లోక్‌సభ మొదటిసారిగా సమావేశం కానుంది. సోమవారం నుంచి పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. మొదటి మూడు రోజుల పాటు లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీ సోయం బాపురావు, పెద్దపల్లి నుంచి టీఆర్‌ఎస్ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతలు ఇరువురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇరువురు పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆదివారం ఈ నేతలు వేర్వేరుగా దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
అనూహ్యంగా విజయం..
గత ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. మే 23న ఫలితాలు వెలబడ్డాయి. ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు అనూహ్యంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గోడం నగేశ్‌పై 58వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఆరు నియోజకవర్గాల్లో గెలుపొందగా ఒక్క ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఏడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అనూహ్యంగా ఇక్కడ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గెలుపొందడం చారిత్రాత్మకమైంది. ఎస్టీ రిజర్వ్‌డ్ పార్లమెంట్ నియోజకవర్గమైన ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ నేత సోయం బాపురావు ఘన విజయం సాధించారు.
పెద్దపల్లి నుంచి...
పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 95వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ మూడో స్థానంలో నిలిచారు. వెంకటేశ్ నేత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చెన్నూర్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అక్కడ టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో కేటీఆర్ సమక్షంలో పార్లమెంట్ ఎన్నికల ముందు వెంకటేశ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు.
ఇద్దరు తొలిసారే..
ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన సోయం బాపురావు, బొర్లకుంట వెంకటేశ్ నేత ఇరువురు పార్లమెంట్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. సోయం బాపురావు గతంలో బోథ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక బొర్లకుంట నేత ఉద్యోగిగా పదవి విరమణ తీసుకొని డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరిక్షించుకుని విజయం సాధించారు. ఇదిలా ఉంటే సోయం బాపురావు తెలుగులో ప్రమాణస్వీకారం చేయనుండగా, వెంకటేశ్ నేతది తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment