సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పార్టీ పెద్దల సమక్షంలో స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నోటి నుంచి సోయం బాపూరావు చేరిక ప్రస్తావన వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోయం పేరును ప్రకటిస్తారని అంటున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పర్యటనలో ఉన్న ఆయనను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించింది. రేవంత్ నోటి వెంట మీ పేరు వచ్చిందని సోయంను అడగ్గా.. అభిమానంతో ఆయన చెప్పి ఉండొచ్చని బదులిచ్చారు.
కాంగ్రెస్‌లో చేరిక విషయంలో అన్ని ఊహాగానాలేనంటూ కొట్టిపారేశారు. నాలుగు నెలల క్రితం కూడా సోయం కాంగ్రెస్‌లో చేరుతు న్నారని జోరుగా ప్రచారం జరగగా, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన బహిరంగంగా ఖండించారు. తాజాగా మళ్లీ ఈ ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బీజేపీ ఎంపీలందరూ వచ్చే శాసనసభ ఎన్నికల బరిలో ఉండాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ ఆయన దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు.
తనయుడు వెంకటేశ్‌ను బోథ్ నుంచి దరఖాస్తు చేయించారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌తో సోయంకు సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. బోథ్ నియోజకవర్గంలో ఆదివాసీ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో బలమైన ఆదివాసీ నేత సోయంను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన అనిల్ జాదవ్ లంబాడా సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్, బీజేపీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ తర్వాత జరుగుతున్న రాజకీయ సమీకరణాలపై అందరి దృష్టి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment