సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల: టీఆర్‌ఎస్ ఎంపీలను ఢిల్లీకి పంపించి తెలంగాణ హక్కులను సాధించుకుందామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో, కరీంనగర్‌లో రోడ్డు షోలలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం జరుగుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించుకుని ప్రతీ ఎకరాకు కేంద్రం నిధులతో గోదావరి జలాలను మళ్లించుకుందామని తెలిపారు. తెలంగాణ మెట్ట ప్రాంతం సాగు నీరు లేక బోర్లపై ఆధారపడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ బాధలన్నీ పోవాలంటే గులాబీ సైనికులు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఢిల్లీలో ఎగురవేసి ఎర్రకోటపై ఎవరు జెండా ఎగుర వేయాలో నిర్ణయించే శక్తిని టీఆర్‌ఎస్‌కు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎందుకీ పేదరికం?
71 ఏళ్ల స్వతంత్ర దేశంలో 55 ఏళ్లు కాంగ్రెస్, 13 ఏళ్లు బీజేపీ, మూడేళ్లు జనతాపార్టీ అధికారంలో ఉందని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పాలన బాగుంటే దేశం ఇంకా ఎందుకు పేదరికంలో ఉందని ఆయన ప్రశ్నించారు. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు కావాలన్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేశారని వివరించారు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం కాపీ కొట్టిందని విమర్శించారు. పేరు మార్చి దేశంలోని పేద రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని కాస్తయినా అందిస్తున్నారంటే అది కేసీఆర్ పుణ్యమేనని స్పష్టం చేశారు.
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అంటే గిట్టని పార్టీలు చాలా ఉన్నాయని, తెలంగాణ నుంచి 16 సీట్లు టీఆర్‌ఎస్ గెలిస్తే దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి 170 సీట్లతో ఢిల్లీని శాసించే సత్తా టీఆర్‌ఎస్‌కు ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను మన రాష్ట్రం అమలు చేసిందని, ఇదే స్ఫూర్తితో దేశానికి దిక్సూచిగా టీఆర్‌ఎస్ నిలుస్తుందని తెలిపారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని చెబితే స్పందించిన ముఖ్యమంత్రే నేరుగా రైతుతో మాట్లాడే పరిస్థితి ఉందంటే అది కేవలం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. భవిష్యత్‌లో అవినీతి అనే మాటే లేకుండా పనులు జరిగే పరిస్థితులు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌కుబుల్లెట్ రైలు
నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు బుల్లెట్ రైలు వేయించారని, కేంద్రంలో టీఆర్‌ఎస్ అడుగుపెడితే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు తీసుకురావచ్చని కేటీఆర్ చెప్పారు. 16 మంది ఎంపీలతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించుకుందామని అన్నారు. మోదీ పేదల కడుపు కొట్టారని, నోట్ల రద్దుతో చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారని ధ్వజమెత్తారు. మోదీ, చంద్రబాబు నాయుడు తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ మెడలు వంచే మొనగాడు కేసీఆర్
రాష్ట్రంలో పదహారుకు పదహారు ఎంపీ సీట్లను గెలిపిస్తే, అంతటితో ఆగవని.. ఈ పదహారుకు మరో 150 తోడవుతాయని, 150 మందితో ఢిల్లీ మెడలు వంచే మొనగాడు కేసీఆర్ అని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాహుల్, మోదీ వాళ్లిద్దరి మధ్యనే ప్రధాని పదవి ఉండాల్నా అని ప్రశ్నించారు. ఢిల్లీ గులాములు కావాలో, తెలంగాణ గులాబీలు కావాల్నో నిర్ణయించుకోవలసింది ప్రజలేనని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment