
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నూతన సచివాలయం, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి వీలుగా రక్షణశాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని టీఆర్‌ఎస్ ఎంపీలు మండిపడ్డారు. గురువారం లోక్‌సభలో ఈ అంశంపై ఆందోళన చేపట్టారు. తెలంగాణ మీద ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి. జితేందర్‌రెడ్డి నిలదీశారు. జీరో అవర్‌లో ఆయన మాడ్లాడుతూ ‘‘తెలంగాణలో ప్రస్తుత సచివాలయం ఇరుకుగా ఉన్నందున బైసన్ పోలో మైదానం, జింఖానా మైదానంలో నూతన సచివాలయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్థలాన్ని బదలాయించాలని ప్రధాని, రక్షణ మంత్రికి మా ముఖ్యమంత్రి పలుమార్లు విన్నవించారు.
సచివాలయ నిర్మాణంతోపాటు జాతీయ రహదారి–44, రాష్ట్ర రహదారి–1పై పలు మౌలిక వసతులు నిర్మించాల్సి ఉంది. ఇందుకు మొత్తంగా 200.58 ఎకరాలు అవసరమవుతోంది. సికింద్రాబాద్ ప్రాంతంలో ఇరుకైన రహదారి కారణంగా కరీంనగర్ రోడ్డు తరచూ బ్లాక్ అవుతుంది. అందువల్ల రక్షణశాఖ పరిధిలోని ఈ మైదానాలను బదలాయించాలని అనేక మార్లు కోరగా అప్పటి రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఈ భూములను బదలాయించేందుకు వీలుగా రూ. 95 కోట్లు చెల్లించాలని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఇది జరిగి మూడేళ్లయినా తదుపరి చర్యలు లేవు. ఈ స్థలం కేటాయించడం వల్ల తాము కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేసేలా ఏటా రూ. 31 కోట్లు పరిహారంగా చెల్లించాలని కంటోన్మెంట్ బోర్డు కోరింది. అయితే దీన్ని మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది.
అప్పటి నుంచి బదలాయింపు పెండింగ్‌లో ఉంది. కర్ణాటక ప్రభుత్వానికి ఇటీవల 200 ఎకరాల రక్షణ భూమిని కొద్ది సమయంలోనే బదలాయించారు. కానీ మేం మూడేళ్లుగా అడిగినా బదలాయించలేదు. తెలంగాణలో మౌలిక వసతుల నిర్మాణాలను పెండింగ్‌లో పెట్టేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండరాదు’’అని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా బతిమాలుతూ వచ్చామని కానీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామన్నారు. అందుకే నిరసన కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు వెల్‌లో తమ నిరసన కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment