మామునూరులోని విమానాశ్రయం రన్‌వే
-
మామూనూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ ?
-
కేంద్రంపై ఒత్తిడికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం
-
నేడు ఢిల్లీలో కొత్త ఎయిర్‌పోర్టులపై సమావేశం
సాక్షి, హన్మకొండ :వరంగల్ ఎయిర్ పోర్టు పునరుద్ధరణ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. వరంగల్ ఎయిర్‌పోర్టును వాడుకలోకి తీసుకొచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ ఎంపీలు నడుం బిగించారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తే వరంగల్ వాసులకు విహంగయానం అందుబాటులోకి వచ్చినట్లే. తెలుగు రాష్ట్రాలకు చెందిన అశోక్‌గజపతిరాజు ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం, పాత ఎయిర్ స్ట్రిప్, ఎయిర్‌డ్రోమ్‌ల పునురుద్ధరణపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. శుక్రవారం న్యూఢిల్లీలో అశోక్‌గజపతిరాజు అధ్యక్షతన కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలు హాజరవుతున్నారు. రాష్ట్రంలో రెండో పెద్దనగరమైన వరంగల్‌లో ఉన్న మామునూరు ఎయిర్‌పోర్టును పునరుద్ధరించాలని వీరు ప్రధానంగా కోరనున్నట్లు సమాచారం.
అడ్డుగా 150 కిలోమీటర్లు
హైదరాబాద్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) పరిధిలో 150 కిలోమీటర్ల పరిధిలో మరో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు వీలు లేదు. ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల్లో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసిన జీఎంఆర్ సంస్థల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఫలితంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండంలలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కేవలం కొత్తగూడెం ఎయిర్‌పోర్టు అభివృద్ధి పైనే ప్రకటనలు ఇస్తోంది.
వరంగల్‌పై ప్రత్యేక దృష్టి..
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రెండో పెద్ద నగరం కావడంతో పాటు త్వరలో ఇక్కడ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టెక్స్‌టైల్స్ పార్కును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు మఫత్‌లాల్ వంటి ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. భారతక్రికెట్ కంట్రోల్ బోర్డుతో చర్చలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఇక్కడ కొలువుదీరగా త్వరలో ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వంటి జాతీయస్థాయి విద్యాసంస్థలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో 150 కిలోమీటర్ల నిబంధన నుంచి వరంగల్ ఎయిర్‌పోర్టుకు సడలింపు ఇవ్వాలనే అంశంపై కేంద్రంతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
50 ఏళ్లుగా భూసేరకణ...
మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరణ 1960కి ముందే భూసేకరణ చేసినట్లు రికార్డులు చెపుతున్నాయి. విమానాశ్రయం కోసం మామునూరు ప్రాంతంలో మొత్తం 706 ఎకరాలు సేరించారు. విమానాశ్రయం అవసరాలకు కనీసం 1200 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలని చెప్పడంతో అదనంగా 450 ఎకరాలు సమీప గ్రామాల్లోని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. దీని కోసం రూ.28 కోట్లు అవసరమవుతాయని... ఈ మొత్తం విడుదల చేస్తే రైతులకు ముందుగా చెల్లింపులు జరుపుతామని ప్రభుత్వానికి నివేదించారు. 2008లో ఒకసారి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం జిల్లాకు వచ్చింది. అప్పటి కలెక్టర్‌తో భేటీ అయ్యింది. మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుకు అక్కడి స్థలాన్ని పరిశీలించింది. జిల్లా యంత్రాంగం నుంచి భూసేకరణ ప్రారంభానికి ముందుగా రూ.28 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసింది. భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ప్రకటన జారీ చేసేందుకు అనుమతివ్వాలని జిల్లా అధికారులు 2012 డిసెంబరులో ప్రభుత్వానికి లేఖ రాసారు. ప్రభుత్వం నుంచి దీనిపై ఇప్పటికీ స్పందన రాలేదు.
నిజాం హయాంలోనే...
హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వ హయంలో మామునూరు విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నడిచేవి. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం సమయంలోనూ ఈ విమానాశ్రయంలోనే రక్షణ దళాలు మొహరించాయి. ఆ తర్వాత సర్వీసులు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరణ, విస్తరణ డిమాండ్ సుదీర్ఘంగా ఉంది. దేశ తొలిప్రధాని నెహ్రూ తొలిసారిగా వరంగల్‌కు వచ్చినప్పుడు వాయుదూత్ విమానంలో మామునూరులో దిగారు. అప్పటి నుంచి జిల్లా యంత్రాంగం భవిష్యత్ అవసరాల దృష్యా›్ట మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరించాలని కేంద్రానికి ప్రతిపాదనలుS పంపుతూనే ఉంది.