‘విభజన హామీల్లో అదొక్కటే ఉందా?’ | Ponnala Lakshmaiah Slams TRS Over Rajya Sabha Deputy Chairman Issue | Sakshi
Sakshi News home page

‘విభజన హామీల్లో బైసన్‌ పోలో ఒక్కటే ఉందా?’

Published Thu, Aug 9 2018 6:34 PM | Last Updated on Thu, Aug 9 2018 7:10 PM

Ponnala Lakshmaiah Slams TRS Over Rajya Sabha Deputy Chairman Issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో బీజేపీ అభ్యర్ధికి మద్దతిచ్చి.. లోక్‌సభలో బైసన్‌ పోలో గ్రౌండ్‌కోసం నిరసన తెలపడం టీఆర్‌ఎస్‌ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీకి మద్దతుపలుకుతున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.

రాజ్యసభలో బీజేపీ అభ్యర్ధికి మద్దతు పలికి, లోక్‌సభలోనేమో బైసన్‌ పోలో గ్రౌండ్‌ కోసం నిరసన చేయడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. విభజన చట్టంలో ఎన్నో హామీలు ఉండగా కేవలం బైసన్‌ పోలో గ్రౌండ్‌ కోసమే పట్టుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అందుకే నూతన సెక్రటేరియట్‌ నిర్మాణం పేరిట నిధులు దోచుకోవడానికే ఈ కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. బీజేపీ విభజన హామీలు నెరవేర్చకుండా జాప్యం చేస్తుంటే.. ఇంకా ఆ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు.

అవిశ్వాస తీర్మానం రోజు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఓటు వేయకుండా సభనుంచి ఎందుకు పారిపోయారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లు గడిచాక ఇప్పుడు టీఆర్‌ఎస్‌ మంత్రులకు విభజన హామీలు గుర్తుకొచ్చాయంటూ ఎద్దేవా చేశారు. తెర ముందు బీజేపీని తిడుతూ.. తెరవెనక ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. మీ తెర వెనక రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో వాల్లే మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement