
పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపిస్తాం: టీఆర్‌ఎస్
పోలవరం ఆర్డినెన్స్‌పై అభ్యంతరాలు చెబుతాం... టీఆర్‌ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంకోసం పోరాడినట్టే, తెలంగాణ పునర్నిర్మాణానికి కావలసిన నిధులు, రాయితీలకోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని టీఆర్‌ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ తరఫున తమ వాణిని వినిపిస్తామని చెప్పారు. లోక్‌సభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షం నేత జితేందర్ రెడ్డి, పార్టీ ఎంపీలు కవిత, నర్సయ్యగౌడ్, బాల్క సుమన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూనే, మరోవైపు తెలంగాణకు అధిక నిధులకోసం పోరాడతామని జితేందర్‌రెడ్డి చెప్పారు.
‘ పోలవరం ముంపు గ్రామాలపై ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయంతో 200గ్రామాల ఆదివాసీలను నిర్వాసితులను చేయొద్దని కోరేందుకు రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తాం. సానుకూల స్పందన రాకపోతే సభలో మా వాణి వినిపిస్తాం’ అని పేర్కొన్నారు. ‘ఆర్డినెన్స్ చర్చకు వచ్చినప్పుడు సభలో మా వాదన తప్పక వినిపిస్తాం.
తెలంగాణకు నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక సహాయం కోసం పోరాటం చేస్తాం, సీమాంధ్రకు ఇచ్చిన పన్ను రాయితీ సదుపాయాలు తెలంగాణకు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రికి, ఆర్థిక మంత్రికి వివరిస్తాం’ అని కవిత తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కావలసిన నిధులు రాబట్టేందుకు శక్తివంచన లేకుండా పోరాడతామని బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. తెలంగాణ విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఎంపీగా తనవంతు కృషి చేస్తానని బాల్క సుమన్ అన్నారు.