ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని, ఆ పార్టీ ఎంపీలు చెప్పారు.
టీఆర్‌ఎస్ ఎంపీల వెల్లడి
న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు చిత్తశుద్ధితో ఉన్నారని, వర్గీకరణకు టీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో టీఎమ్మార్పీఎస్, మాదిగ విద్యార్థి జేఏసీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. గురువారం రెండో రోజు జరిగిన ఈ ధర్నాలో టీఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొని మద్దతు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, ఈ తీర్మాన ప్రతులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారని ఎంపీలు తెలిపారు. కాగా, ఈ ధర్నాలో ఎస్సీ కార్పొరేషన్ చెర్మన్ పిడమర్తి రవి, టీఎమ్పార్పీఎస్ అధ్యక్షుడు ఈటుక రాజు, మాదిగ విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు.