ఈసారి 17 మంది వస్తాం | Clean sweep for TRS in Telangana Lok Sabha polls | Sakshi
Sakshi News home page

ఈసారి 17 మంది వస్తాం

Published Thu, Feb 14 2019 2:06 AM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM

Clean sweep for TRS in Telangana Lok Sabha polls - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 16వ లోక్‌సభకు 11 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్నికవగా తరువాత మరో ముగ్గురు జత అయ్యారని, 17వ లోక్‌సభలో మాత్రం తెలంగాణలోని అన్ని సీట్లు గెలుచుకుని 17 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులం వస్తామని ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 16వ లోక్‌సభ చివరి సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. సభాపతి సుమిత్రా మహాజన్‌ తమను బిడ్డల్లా ఆదరించారని పేర్కొన్నారు. తెలంగాణపై మాట్లాడేందుకు అనేకసార్లు అవకాశం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

అయితే తెలంగాణకు సంబంధించి ఇంకా ఒక అంశం పెండింగ్‌లో ఉందని, బైసన్‌ పోలో మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉందని సభలోనే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తెలంగాణ నూతన సచివాలయాన్ని ఇక్కడ నిర్మించాలన్న ప్రతిపాదనతో ఉన్నామని వివరించారు. ఫుడ్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందుకు సభాపతికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ పదవిలో ఉంటూ క్యాంటీన్‌ ద్వారా అందరికీ హైదరాబాద్‌ బిర్యానీ అందుబాటులోకి తెచ్చానని వివరించారు.

దీనికి సభాపతి స్పందిస్తూ పోరాటం చేసేందుకు దీని వల్లే బలం వచ్చిందంటారా? అని ఛలోక్తి విసిరారు. దీనికి జితేందర్‌రెడ్డి స్పందిస్తూ.. కేవలం హైదరాబాద్‌ బిర్యానీ మాత్రమే కాదని, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ సహకారంతో అన్ని రాష్ట్రాల ఆహారాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన ఆహారాన్ని ఒక్కో వారం పాటు ఫుడ్‌ ఫెస్టివల్‌ రూపంలో పార్లమెంటులో అం దుబాటులోకి తెచ్చామని తెలిపారు. చక్కటి ఆహారం అందించినందుకు ప్రధాని కూడా తనను ఓ సందర్భంలో అభినందించారని పేర్కొన్నారు.

నారమల్లి శివప్రసాద్‌ను గుర్తుచేసిన ప్రధాని..
ప్రధాని తన ప్రసంగంలో టీడీపీ ఎంపీ నారమల్లి శివప్రసాద్‌ను గుర్తుచేశారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన టాలెంట్‌ చూపారని, టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కూడా తన వేషధారణతో అందరి దృష్టిని మళ్లించేవారని, సభ్యులంతా టెన్షన్‌ మరిచి ఆయన వైపు అటెన్షన్‌గా చూసేవారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడుతూ.. ఆలింగనం చేసుకోవడం, బలవం తంగా మీద పడటం తనకు ఈ సభ ద్వారానే తెలిసిం దని వ్యంగ్యంగా అన్నారు. కన్నుగీటడం ద్వారా పరాచికాలు చేయవచ్చని తనకు ఇక్కడే తెలిసిందని, దేశంలోని మీడియా ఆ వీడియోలను బాగా ఆస్వాదించిందని ఛలోక్తులు విసిరారు.  

ప్రధాని ప్రశంసలు..
సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘జితేందర్‌రెడ్డి మంచి భోజనం తినిపించారు. పార్లమెంటు బయట ప్రజల్లో ఒక చర్చ నడిచేది. పార్లమెంటు క్యాంటీన్‌లో భోజనం చవక అని, బయట చాలా ఎక్కువ రేట్లని, ఎంపీలకు అలా ఎందుకు అందించారని చర్చ నడిచేది. జితేందర్‌రెడ్డి నేతృత్వంలోని ఫుడ్‌ కమిటీ నా భావనలను అర్థం చేసుకుంది. సభాపతి కూడా మా భావనలను అర్థం చేసుకున్నారు. సభ్యుల జేబులకు కొంత భారం పడినా.. క్యాంటీన్‌ రేట్లను సవరించడం బాగుంది’అని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement