
వైభవోత్సవాలకు ఢిల్లీ వేదిక కావాలి
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
నెల్లూరు(బృందావనం) : సంస్కృతి,సంప్రదాయాలతోపాటు, ధార్మిక,ఆధ్యాత్మిక చింతన కలిగించే శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు రాజధాని ఢిల్లీలో జరిపించాలని, ఇందుకు మహానగరం వేదిక కావాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలో జరుగుతున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన పుష్పయాగంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశేషంగా హాజరైన శ్రీవారి భక్తులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పవిత్రమైన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నెల్లూరులో జరగడం, తాను నెల్లూరుకు తొలిసారిగా రావడం, స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందం కలిగిస్తోందన్నారు. దేశరాజధానిలో ైవె భవోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ, హిందూధర్మప్రచారపరిషత్ సహకారం అందించాలని స్మృతి కోరారు.
హిందూ సంస్కృతి ఉన్నతమైంది: కేంద్ర మంత్రి వెంకయ్య
శతాబ్దాలపాటు విదేశీమూకల దండయాత్రలను ఎదుర్కొని నేడు ప్రపంచవ్యాప్తంగా విశేషమన్ననలు పొందుతున్న హిందూ సంస్కృతి ఎంతో ఉన్నతమైందని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వైభవోత్సవాల ముగింపులో పాల్గొన్న ఆయన భారతదేశ కీర్తిని మరింత ఇనుమడించేసేందుకు ప్రతి ఒక్కరూ దైవచింతన, భక్తి,సన్మార్గం కలిగిన జీవనసరళితో ముందుకుసాగాలన్నారు. వీరి వెంట రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి , టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, టీటీడీ జేఈఓ పోలభాస్కర్, ఉభయదాత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు, స్వర్ణభారత్‌ట్రస్ట్ మేనేజింగ్‌ట్రస్టీ దీపావెంకట్ తదితరులు ఉన్నారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఘన స్వాగతం
నెల్లూరు(బృందావనం): జిల్లా పర్యటనలో భాగంగా తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కలెక్టర్ జానకి , సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు ఘన స్వాగతం పలికారు. నెల్లూరులోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్న కేంద్రమంత్రి ఇరానీని ఎంపీ, కలెక్టర్‌లు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి స్వగృహానికి చేరుకున్నారు.
నెల్లూరు (టౌన్): బీజేపీ రాష్ట్రపార్టీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి, నగర అధ్యక్షులు మండల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.