గుజరాత్ నుంచి రాజ్యసభకు అమిత్ షా!
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పార్లమెంటులో అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 8న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయన గుజరాత్ నుంచి పోటీ చేస్తారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం వెల్లడించింది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇదే రాష్ట్రం నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు.
పార్టీ సమావేశం అనంతరం సీనియర్ నేత, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకాశ్ నడ్డా ఈ వివరాలు తెలిపారు. గుజరాత్, బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన 9 మంది సభ్యుల పదవీకాలం ఆగస్టు 18తో ముగియనుంది. వీరిలో స్మృతీ ఇరానీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితరులున్నారు. ప్రస్తుతం అమిత్‌షా గుజరాత్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు.