అమ్మకు సహకారం
* దేశాభివృద్ధిలో సమష్టిగా ముందుకు
* తమిళనాట బీజేపీ భవిష్యత్ ఆశాజనకం
* కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నైః తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి, ఇక పరస్పర సహకారమే తరువాయి అని కేంద్ర పట్టణ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అ న్నారు. చెన్నైలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, జయలలిత ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ రాలేకపోయినందున ఆయన ప్రతినిధిగా తాను వచ్చానని తెలిపారు.
అత్యద్భుత విజయాన్ని సాధించిన ఆమెను అభినందించానని తెలిపారు. గణనీయమైన ఓట్లను సాధించినా అసెంబ్లీలో బీజేపీ తన ఖాతాను తెరవలేక పోయిందని అన్నారు. ద్రవిడ పార్టీలు వేర్వేరుగా రంగంలో దిగడం వల్ల ఆశించిన ఫలితాలను తమ పార్టీ అందుకోలేక పోయిందని వివరించారు. అయినా బీజేపీకి రాష్ట్రం ఆశాజనకంగా మారిందని తెలిపారు. ఒక సానుకూల పరిణామం చోటుచేసుకుందని టాస్మాక్ దుకాణాల సంఖ్య తగ్గిస్తూ సీఎం జయలలిత తొలి సంతకం చేయడంపై వెంకయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికలు ముగిసిపోయినందున రాజకీయాలకు ఇక తెరదించి, దేశాన్ని అభివృద్ది పథంవైపు నడిచేలా కలిసి సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దిశగా తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.