జయ లేకపోవడం మాకు మంచి అపర్చునిటీ!
- సీఎంగా పన్నీర్ ఎంపికలో నా ప్రమేయం లేదు
- జయలలిత మృతిపై సందేహాలు లేవు
- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలలో జయలలిత లేకపోవడం బీజేపీకి మంచి అవకాశమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. 'గతంలో మేడం (జయలలిత) అమేయమైన వ్యక్తిత్వంతో అపారమైన ప్రభావం చూపేవారు. మా సానుభూతిపరుల ఓట్లు కూడా ఆమెకే దక్కేవి. డీఎంకే, అన్నాడీఎంకేలలో అన్నాడీఎంకే ఉత్తమమైన పార్టీ. అంతేకాకుండా జాతీయవాద దృక్పథమున్న పార్టీ. అందువల్ల గతంలో బీజేపీ సానుభూతిపరులు కూడా అన్నాడీఎంకేకు ఓటు వేశారు. ఇప్పడా పరిస్థితి లేదు' అని వెంకయ్య అన్నారు.
జయలలిత మృతి నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంను ఎంపిక చేయడంలో తన పాత్ర కూడా ఉందని వస్తున్న కథనాలను వెంకయ్యనాయుడు కొట్టిపారేశారు. 'ఆయన పేరు ప్రతిపాదించడానికి నేనెవరిని? అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయన పేరును ప్రతిపాదించారు' అని అన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళకు తాను అభినందనలు తెలుపడంపై ప్రశ్నించగా.. తాను శశికళకు కాకుండా తమిళనాడు ప్రజలకు అభినందనలు తెలిపానని, తీవ్ర విషాద పరిస్థితుల్లోనూ వారు క్రమశిక్షణగా మెలిగారని అన్నారు.
జయలలిత మృతిపై వస్తున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. జయలలలిత మృతదేహాన్ని వెలికితీసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్లను తీవ్రంగా వ్యతిరేకించారు. కొందరు ఎప్పుడూ అనుమానాలతోనే బతుకుతారని అన్నారు. 'నేను డాక్టర్‌ని కాను. డాక్టర్లతో విభేదించే జ్ఞానం కూడా నాకు లేదు. జయలలిత అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు చికిత్స అందించిన వైద్యులను అనుమానించడానికి ఎలాంటి కారణమూ లేదు. అనుమానపక్షులు ఎప్పుడూ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. మేడం జయలలిత భౌతికకాయాన్ని వెలికితీసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలన్న వాదనకు నేను వ్యతిరేకం' అని ఆయన అన్నారు.