చిన్నమ్మకు చిక్కులు!
అన్నాడీఎంకేలో అసంతృప్తి
ప్రధాని వద్దకు జయ అన్న కుమార్తె దీప
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కావాలని భావిస్తున్న చిన్నమ్మ శశికళకు చట్టపరమైన చిక్కులు తప్పేలా లేవు. శశికళను చట్టపరంగా ఎదుర్కొ నేందుకు వ్యతిరేక వర్గం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 29న జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశానికి శశికళ మద్దతుదారులకు మాత్రమే ఆహ్వానాలు పంపు తున్నారు. పిలవకున్నా హాజరై ఎంపికను అడ్డుకుంటాం, విఫలమైతే చట్టపరంగా సాధిస్తామని వ్యతిరేక వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.
పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేని శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ‘పార్టీ నియమావళి ప్రకారం ఒక సభ్యునిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఐదేళ్లపాటు అతను ఎన్నికల్లో పోటీచేసేందుకు వీల్లేదు. 2011 డిసెంబర్‌లో శశికళను ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. 2012 మార్చిలో తిరిగి జయ వద్దకు చేరారు. అయితే శశికళకు ప్రాథమిక సభ్యత్వ కార్డును జారీ చేయలేదు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా పార్టీ నిబంధనలను సవరించి శశికళను ఎన్నుకుంటే అది చట్టవ్యతిరేకం అవుతుంది. ఎన్నికల కమిషన్ సంప్రదాయాన్ని విస్మరించి, శశికళ మాత్రమే నామినేషన్ వేసేలా పార్టీ పెద్దలు వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌లో పిటిషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వ్యతిరేక వర్గం పేర్కొంటోంది.
ప్రధానిని కలవనున్న దీప
జయలలిత అన్న కుమార్తె దీప త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుస్తారని తెలుస్తోంది. శశికళ వ్యతిరేకవర్గం పన్నీర్‌సెల్వం లేదా దీపను ప్రధాన కార్యదర్శి చేయాలని పట్టుపడుతున్నారు. దీప పేరవై అనే సంస్థను స్థాపించి జోరుగా సభ్యత్వాన్ని చేరుస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని దీపపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. అన్నాడీఎంకే రాజకీయాలను బీజేపీ తెరవెనుక ఉండి శాసిస్తున్నట్లు ఉవ్వెత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీప ప్రధానిని కలుసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.