యూపీ బీజేపీ సీఎంగా స్మృతి ఇరానీ?
న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఉంది. అందుకు ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. కులాల ప్రభావం ఎక్కువగా ఉండే యూపీలో ఎవరిని నిలబెట్టాలన్నా ప్రతి పార్టీకీ ఓ పెద్ద సవాలే. బ్రాహ్మణులనా, ఠాకూర్లనా లేదా వెనుకబడిన వర్గాలను నిలబెట్టాలా ? అన్నది ఎవరికైనా సమస్యే. అక్కడ ఒక వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తే మరో వర్గానికి కోపం వస్తుంది.
ఈ పరిస్థితుల్లో ప్రజాధరణ కలిగిన బయటి రాష్ట్రం వ్యక్తిని నిలబెట్టడం సమంజసమని, అందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న స్మృతి ఇరానీని నిలబెట్టడం మంచిదని కేంద్ర బీజేపీ యోచిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను ఆరెస్సెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రం వెలుపలి వ్యక్తిని నిలబెట్టడం తమకే మాత్రం ఇష్టం లేదని ఆరెస్సెస్ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యూపీలోని షహరాన్‌పూర్‌లో ఉన్నప్పుడు అమేథిలో పర్యటిస్తున్న స్మృతి ఇరానీ కూడా ఓ టీవీ ఇంటర్వ్యూలో ఇదే విషయమై ప్రశ్నించారు. ఆమె సూటిగా సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షానే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు. తానొక పార్టీ కార్యకర్తనని, పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని అన్నారు. ఆరెస్సెస్ నాయకత్వం అంగీకరించనంత మాత్రాన ఇరానీ అభ్యర్థిత్వాన్ని అప్పుడే నిరాకరించినట్టుగా భావించరాదని, ప్రస్తుతం ఈ అంశం సంప్రదింపుల స్థాయిలో మాత్రమే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.