కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని స్థానిక ఓటరుగా మారారు.
ఎంపీ ప్రతినిధి విజయ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీగంజ్‌లోని మెదన్ మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్న స్మృతి ఇరానీ అక్కడ ఓటరు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడామె ఆ గ్రామంలో ఓటరుగా మారారని విజయ్ గుప్తా తెలిపారు.
స్మృతి ఇరానీ అమేథీని తన కుటుంబంగా భావిస్తారు. అమేథీ కుటుంబం మధ్య నివసించేందుకు ఆమె ఇక్కడే తన నివాసాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. ఇంటి నిర్మాణంతో ఆమె అమేథీ నుంచి ఓటరుగా నిలిచే ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం లాంఛనాలు పూర్తయ్యాయని గుప్తా తెలిపారు.
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని గౌరీగంజ్ అసెంబ్లీ స్థానంలోని మెదన్ మావాయి గ్రామంలోని బూత్ నంబర్ 347లో ఓటరుగా మారారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి స్మృతి ఇరానీ గత ఫిబ్రవరి 22న గృహ ప్రవేశం చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి స్మృతి ఇరానీని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని సుమారు 55,000 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. కాగా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మే 20న అమేథీలో ఐదో దశలో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment