నెల్లూరు త్యాగయ్య.. సాంబమూర్తి
♦ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
♦ నెల్లూరులో ఎస్పీ బాలు తండ్రి సాంబమూర్తి విగ్రహావిష్కరణ
♦ హాజరైన కమల్‌హాసన్, కె.విశ్వనాథ్
నెల్లూరు (బాలాజీనగర్): భిక్షాటనతో త్యాగరాజ సంకీర్తనలను పరిచయం చేసేందుకు జీవితాన్ని అంకితం చేసిన సాంబమూర్తి నెల్లూరు త్యాగయ్యగా చరిత్రలో నిలిచారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. నెల్లూరులోని శ్రీవేంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్ర ప్రాంగణంలో శనివారం సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి విగ్రహాన్ని ఆయన సతీమణి శకుంతలమ్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాబోయే సంగీత తరాలకు సాంబమూర్తి స్ఫూర్తి, ప్రేరణగా నిలిచారని చెప్పారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించి, తెలుగు సినిమా ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ‘శంకరాభరణం’ చిత్రం కథ విని పచ్చజెండా ఊపింది బాబాయి సాంబమూర్తేనని తెలిపారు. సినీనటుడు కమల్‌హాసన్ మాట్లాడుతూ తన ప్రతి విజయం వెనుక బాలసుబ్రహ్మణ్యం ఉన్నారని చెప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడు తూ తన గాత్ర, సంగీత, సాహిత్య కళలకు తల్లిదండ్రు ల ప్రతిభే కారణమని పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోపాటు ఆయన కుటుంబసభ్యులు శైలజ, వసంత, శుభలేఖ సుధాకర్, చరణ్ తదితరులు సాం బమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజ మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరె డ్డి, ఎస్పీ గజరావు భూపాల్, పారిశ్రామికవేత్త జె.ఎస్.రెడ్డి, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకహోదాను మించి నిధులు తెస్తాం
వెంకటాచలం(మనుబోలు): ప్రత్యేక హోదాతో దక్కే నిధులకు మించిన స్థాయి నిధులతో ఏపీని అభివృద్ధి చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రీమియం చెక్కులను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు చెబుతున్నారన్నారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. దీనిని సరిదిద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ప్రాజెక్ట్‌లను, నిధులను ఏపీకి కేటాయిస్తుందన్నారు. విభజన సమయంలో ఏపీ విషయంలో ఆ రోజు తాను ఏమి కోరానో, కేంద్రం ఏమి ఇచ్చిందో అన్నీ తనకు గుర్తున్నాయన్నారు. ఎవరి సర్టిఫికెట్లూ తనకు అవసరం లేదన్నారు.
చదువులేని వారి పట్ల చులకన భావం తగదు: కమల్ హాసన్
ఉన్నత చదువులు చదవని వారిపట్ల చులకన భావన వద్దని సినీనటుడు కమల్‌హాసన్ అన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్నారు. మధ్యలో చదువాపేసిన వారు కూడా భవిష్యత్తులో సైంటిస్టులో, తనలాగే పెద్ద యాక్టర్‌లో కావచ్చన్నారు.