
వెంకయ్య నాయుడుతో బిల్ గేట్స్ భేటీ
న్యూఢిల్లీ: పరిశుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి అవసరమైన సాయాన్ని అందిస్తానని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ స్పష్టంచేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయడుతో బిల్గేట్స్ భేటీ అయ్యారు. తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలలో 'స్వచ్ఛ భారత్'లో భాగస్వాములవ్వడం ఓ ఉత్తమ పని అంటూ వ్యాఖ్యానించారు.
బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో సమావేశంలో భారత్లో పట్టణాలలో పరిశుభ్రత కోసం చేపట్టిన కార్యక్రమాలను, వాటి పనితీరును కేంద్ర మంత్రి వెంకయ్య వివరించారు. ఈ ఫౌండేషన్ వారు స్వచ్ఛ భారత్ మిషన్కు చేయూత అందించేందుకు ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్న విషయం విదితమే. ఆఫ్రికాలో భారీ ఎత్తున వ్యక్తిగత టాయిలెట్లు నిర్మించినప్పటికీ వాటి వాడకం మాత్రం మామూలుగానే ఉందని బిల్ గేట్స్ గుర్తుచేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి స్వచ్ఛభారత్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచుతామని కేంద్ర మంత్రి వెంకయ్య పేర్కొన్నారు.