అన్నీ ఆవిష్కరణలే
హ చిలకలూరిపేటలో రూ.517.51 కోట్ల పనులకు పునాది
హ హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
చిలకలూరిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల పర్యటన గురువారం ‘అన్నీ ఆవిష్కరణలే’ అన్నట్టుగా సాగింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం రూ. 517.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పైలాన్‌లు ఆవిష్కరించారు. తొలుత హెలికాప్టర్ దిగిన సీఎం, కేంద్రమంత్రి పురుషోత్తమపట్నం వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్డిని పరిశీలించారు. రూ.23.08 కోట్లతో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ మిషన్ పథకం’కు సంబంధించిన పైలాన్‌ను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతంగా ప్రకటించారు. శారద హైస్కూల్ రోడ్డులో రూ.1.40 కోట్లతో ఆధునికీకరించిన శ్మశానవాటిక శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రూ.2 కోట్లతో నిర్మించిన పోలీస్‌స్టేషన్ నూతన భవన సముదాయాన్నీప్రారంభించారు. పట్టణ మౌలిక వసతులు, మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం కింద రూ.143 కోట్లతో చేపట్టనున్న పనుల కోసం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పైలాన్‌ను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కేటాయించాలి...
ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన పథకం కింద రూ.248.16 కోట్లతో 52.66 ఎకరాల్లో 4,512 జీప్లస్ -3 గృహ నిర్మాణ పనులకు సంబంధించి నరసరావుపేట రోడ్డులోని ఎన్‌ఎస్‌పీ కెనాల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దీని పక్కనే రూ. 15 కోట్లతో చేపట్టే కల్చరల్ అకాడమీ హాలు, రూ.2.16 కోట్లతో శ్మశానాల అభివృద్ధి పనులు, 13వ ఆర్థిక సంఘం, ప్రణాళిక, ప్రణాళికేతర, ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్, మున్సిపల్ నిధులతో రూ.20.16 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. డ్వాక్రా గ్రూపులకు వివిధ బ్యాంకు లింకేజీ రుణాలు రూ.65.95 కోట్లకు సంబంధించిన చెక్కును మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు.
రూ. 45 కోట్లు కేటాయించాలి : మంత్రి ప్రత్తిపాటి
సీఎం కాన్వాయ్ కళామందిర్ సెంటర్‌కు చేరుకోగానే మక్కామసీదు వద్ద వేచి ఉన్న అంజుమన్ కమిటీ సభ్యులు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రిని వెండి కిరీటాలతో సత్కరించారు. అండర్ డ్రైనేజీ విధానానికి పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలో 33 గ్రామాలకు మంచినీటి కొరత లేకుండా చే సేందుకు రూ.45 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా కోరారు.