లక్షల ఎకరాలు లాక్కున్నారు
* ఏపీలో 3,77,691, తెలంగాణలో 1,29,456 ఎకరాలు
* యూపీఏ హయాంలో భూసేకరణపై వెంకయ్య
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నాలుగు రెట్ల నష్టపరిహారం, సామాజిక ప్రభావ అంచనా లేకుండానే కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలు రైతుల నుంచి లాగేసుకున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశా రు. భూ సేకరణ చట్టంపై, ప్రధాని మోదీపై రోజూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు రాహుల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004-2014 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 3,77,691 ఎకరాలు, తెలంగాణలో 1,29,456 ఎకరాలను లాక్కుందని జిల్లాల వారీగా గణాంకాలను వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో హరియాణాలో 80,000 ఎకరాలు రైతుల నుంచి లాక్కుందన్నారు.1894 నాటి బ్రిటిష్ చట్టాన్ని ఎందుకు వాడుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, చౌదరి బీరేందర్ సింగ్‌లతో కలసి వెంకయ్య మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఒక్క అంగుళం కూడా భూసేకరణ జరగనివ్వబోమని చెప్పిన రాహుల్ భాషలో ‘అంగుళం’ అంటే ఎంత అని వ్యాఖ్యానించారు. కాగా, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్‌టీ, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్, డెవలప్‌మెంట్ బిల్లులను ప్రవేశపెడతామని వెంకయ్య అన్నారు.