ఎన్డీఏతోనే గ్రేటర్ అభివృద్ధి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
అల్వాల్ : బీజేపి, టీడీపీతోనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ది సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని వెంకటాపురం డివిజన్‌లో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్డీఏ హయాంలోనే నగర అభివృద్ధి జరిగిందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ది కన్నా ప్రచారంపైనే అధికంగా దృష్టి సారించిందన్నారు. ప్రతిపక్షాలు మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. నగరంలో ఐఎస్‌ఐఎస్ కదలికలు అధికమయ్యాయన్నారు. సెంట్రల్ యూనివర్సిటిలో జరిగిన సంఘటనను ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రేటర్ మరింత అభివృద్ది చెందడానికి అవకాశం ఉందన్నారు. ఇందుకు గ్రేటర్‌లో బీజేపీ మిత్రపక్షాల కూటమి విజయం సాధించాల్సిన అవసరముందన్నారు. మచ్చబొల్లారం, అల్వాల్, వెంకటాపురం అభ్యర్థులను పరిచయం చేస్తూ వారిని గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన ధూంధాం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మచ్చబొల్లారం అభ్యర్ధి చిట్టిబాబు, వెంకటాపురం అభ్యర్ధి జగదీష్, అల్వాల్ అభ్యర్ధి తాళ్ల సౌజన్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.