‘సంపన్నుల హృదయం’లో స్థానమెవరికో?
♦ బంజారాహిల్స్ బరిలో పోటీ రసవత్తరం
♦ విజయం కోసం ప్రధాన పార్టీల హోరాహోరి
♦ ముఖ్య నేతల వారసులతో హీటెక్కిన పోరు
మొత్తం ఓట్లు 48,450
పురుషులు 26,279
మహిళలు 22,162
ఇతరులు 9
గ్రేటర్ ఎన్నికల పర్వం మాంచి రసపట్టులో ఉంది. ప్రచారానికి సరిగ్గా వారం రోజుల వ్యవధి మిగిలింది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గల్లీ గల్లీ..ఇల్లిల్లూ తిరుగుతూ ఎవరికి వారు గెలుపు వ్యూహాలతో సాగుతున్నారు. ఇక ప్రతి పార్టీలోనూ మేయర్ అభ్యర్థులు అంటూ కొందరు నేతలు ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఈ నేపథ్యంలో హాట్ సీట్‌గా మారిన ‘మేయర్ అభ్యర్థుల’ డివిజన్లలో ప్రస్తుత పరిస్థితి, నేతల బలాబలాలు, వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రభావిత బస్తీలు, గెలుపు అవకాశాలపై ‘సాక్షి’ ఫోకస్.. హాట్‌సీట్...
సాక్షి, సిటీబ్యూరో
సకల సంపన్నులు, భిన్న సామాజికవర్గాలు, విభిన్నమైన వృత్తుల వారితో నిరంతరం కళకళలాడే బంజారాహిల్స్‌లో ప్రస్తుతం ఏ కాలనీ, బస్తీ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ఫిబ్రవరి 2వ తేదీన జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి గెలిచేందుకు మూడు ప్రధాన పార్టీలు హోరాహోరిగా తలపడుతున్నాయి. ఒకరిని మించి మరొకరు తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో పాదయాత్రలు, ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ముమ్మురం చేశారు. ఈ డివిజన్‌లో మొత్తం పదకొండు మంది పోటీలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్‌ఎస్ , కాంగ్రెస్ , బీజేపీ అభ్యర్థుల మధ్యే నెలకొంది. పోటీ చేస్తున్న వారిలో ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మీ (టీఆర్‌ఎస్), మాజీ మంత్రి మేచినేని కిషన్‌రావు కుమారుడు శ్రీనివాసరావు(బీజేపీ), మాజీ కార్పోరేటర్ రాజు యాదవ్(కాంగ్రెస్) ఉన్నారు.
నగర్‌లే.. గెలుపోటముల నిర్ణేతలు
బంజారాహిల్స్ డివిజన్‌లో రోడ్ 12, 13లలోని ఎమ్మెల్యే కాలనీ, మినిస్టర్ క్వార్టర్స్, మిథిలా, దుర్గానగర్‌లు, గ్రీన్ బంజారా కాలనీలతో పాటు ఎన్‌బీటీనగర్, ఎన్‌బీనగర్, ఖాజానగర్, ప్రేమ్‌నగర్, బోలానగర్, ఇబ్రహీంనగర్, అంబేద్కర్‌నగర్, ఉదయ్‌నగర్ బస్తీలూ ఉన్నాయి. ఇక్కడ సంపన్నులు నివసించే కాలనీల్లో పోలింగ్ 30 శాతమే నమోదవుతుండగా, మధ్య తరగతి,ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాసులు నివసించే ప్రాంతాల్లో 80 శాతం పోలింగ్ జరగనుంది. దీంతో ఎవరు గెలువాలన్న నగర్‌ల ఓట్లే కీలకం కానున్నాయి.
గద్వాల్ విజయలక్ష్మి - టీఆర్‌ఎస్
ప్రచార సరళి: ఇప్పటికే డివిజన్ మొత్తాన్ని ఒక రౌండ్ చుట్టేశారు. పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం, స్వయం సంఘాలు, ముస్లిం, క్రిష్టియన్ సామూహిక వర్గాలకు తోడు కిట్టీ క్లబ్‌లతో వెరైటీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
బలాలు(+): ఎంపీ కేశవరావు కూతురు కావటం, గెలిస్తే మేయర్ పీఠం వరించే అవకాశం. ఎం.ఏ ఎల్‌ఎల్‌బీ చదువుకున్న విద్యాధికురాలే కాకుండా విజయలక్ష్మి అందరికంటే ముందుగానే ప్రచారం చేపట్టారు, ఆర్థికంగా బాగా ఉండటం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండటం. గెలిస్తే అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఆసరా ఫించన్లు ఇతర సంక్షేమ,అభివృద్ధి పథకాలు మరిన్ని అమలు చేస్తామన్న హామీలివ్వటం ఈమె బలాలుగా చెప్పొచ్చు.
బలహీనతలు(-): ముప్పై ఏళ్లు అమెరికాలో ఉండి రావటంతో స్థానికులతో అంత సులువుగా కలిసిపోలేకపోవటం. డివిజన్‌లో జీఒ 58 కింద ఉచిత పట్టాలు ఇంకా ఇవ్వకపోటం, మంచినీటి సమస్యలకు తోడు డ్రైనేజీ లీకేజీలు, ఓపెన్ నాలాల సమస్యలు పరిష్కారం కాకపోవటం ఇబ్బందికరం.
బి.రాజుయాదవ్ - కాంగ్రెస్
ప్రచార సరళి: అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా మూడేళ్ల క్రితమే బీకాం దూర విద్య డిగ్రీ పొందిన 47 ఏళ్ల రాజుయాదవ్ డివిజన్‌లో విస్తృతంగా పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో తమను బలపరచమంటూ ప్రజలకు విన్నవిస్తున్నారు. పిలిస్తే పలికేవాడనని, 24 గంటలు అందుబాటులో ఉంటానంటూ ఇంటింటికి వ్యక్తిగతంగా వెళ్లి వేడుకోవటం ఆయనకు కొంత కలిసి వస్తోంది.
బలాలు(+): గత ఎన్నికల్లో పంజాగుట్ట డివిజన్ నుండి కార్పొరేటర్‌గా పనిచేయటం. భౌగోళికంగా డివిజన్ సమస్యలు, బస్తీవాసులతో నేరుగా పరిచయటం ఉండటం. మాస్ జనాల్లో ఇట్టే కలిసిపోయే మనస్తత్వం ఉండటం. మంత్రిగా నాగేందర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రచారం చేయటం ఆయన బలాలుగా చెప్పొచ్చు.
బలహీనతలు(-): అభ్యర్థిత్వం లేటుగా ఖరారు కావటంతో ఇంకా అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించకపోవటం. రాష్ర్టంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవటం.
మేచినేని శ్రీనివాసరావు - బీజేపీ
ప్రచార సరళి: అమెరికాలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి, అక్కడే వ్యాపారాలు నిర్వహించిన మేచినేని శ్రీనివాసరావు ఎక్కువ సోషల్ మీడియా, సామూహిక సమావేశాల ద్వారా ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రచార వ్యూహాన్ని రూపొందించి ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే డివిజన్‌లో 80 శాతం ప్రాంతాలు చుట్టేసి వచ్చారు.
బలాలు(+): మాజీ మంత్రి మేచినేని కిషన్‌రావు కుమారుడు కావటం, ఆర్థికంగా బలంగా ఉండ టం. కేంద్రంలో అధికారంలో ఉండటానికి తోడు దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డిలు ఈ డివి జన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం. డివిజన్‌లో స్థిరపడ్డ విద్యావంతులు, వ్యాపారులు, ఇతర రాష్ట్రాల వారు ఉండటం.
బలహీనతలు(-): స్థానికంగా పెద్దగా పరి చయాలు లేకపోవటం. ఎమ్మెల్యేగా చింతల ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేకపోవటం. టీడీపీ నుండి పూర్తి సహకారం లభించకపోవటం. గెలిస్తే స్థానికులకు అందుబాటులో ఉండరన్న ప్రచారం.