బీజేపీ-టీడీపీల మధ్య కుదరని లెక్క
♦ స్థానాల ఖరారుపై మిత్రపక్షాల చర్చలు
♦ అధిక స్థానాలు ఆశిస్తోన్న టీడీపీ
♦ ససేమిరా... అంటోన్న కమల దళం
సాక్షి, సిటీబ్యూరో
బల్దియా బరిలోకి గెలుపు గుర్రాలనే పోటీకి దించాలని భావిస్తున్న బీజేపీ-టీడీపీ మిత్రపక్షాలు సీట్ల పంపకాల విషయంలో ఓ అవగాహనకు రాలేకపోతున్నాయి. మొదట ఫిఫ్టీ-ఫిఫ్టీ అని భావించినా..ఇప్పుడు బీజేపీ అందుకు అంగీకరించడం లేదు. మిత్రపక్షాల ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఇరుపార్టీల అగ్రనేతలు పాల్గొని గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించారు. గ్రేటర్ పీటాన్ని దక్కించుకొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో మిత్రపక్షాలు పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో... ఏ పార్టీకి ఎన్ని స్థానాలు..? అన్నది లెక్కతేల్చుకొనేందుకు ఇరుపార్టీల నేతలు తమకున్న బలా బలాలను బేరీజు వేసుకొంటున్నారు.
150 స్థానాల్లో రెండు పార్టీలు చెరిసగం పంచుకోవాలని మొదట్లో భావించినప్పటికీ టీడీపీ అధిక స్థానాలు ఆశిస్తుండటంతో అందుకు బీజేపీ ససేమిరా అంటోంది. ఏ పార్టీకి ఎన్ని డివిజన్లు అన్నది నిగ్గుతేలాకే... ఏయే స్థానాల్లో ఏపార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలన్నది ఖరారు చేయాలని సమావేశంలో నాయకులు ఓ నిర్ణయానికి వచ్చారు. బీజేపీకి పట్టున్న డివిజన్‌లో టీడీపీకి అవకాశం వచ్చినా.... లేదంటే టీడీపీకి బలమున్న డివిజన్‌లో బీజేపీకి టికెట్ ఇచ్చినా...అక్కడ ఎక్కువగా ఓటు బ్యాంకు ఉన్న పార్టీ అభ్యర్థినే బరిలోకి దించాలని నిర్ణయించారు. ఇలాంటి స్థానాల్లో అభ్యర్థులను పరస్పరం మార్చుకొనేందుకు (ఎక్స్ఛేంజి) ఇరు పార్టీల నేతలు ఓ అంగీకారానికి వచ్చారు.
అయితే... గ్రేటర్‌లోని మొత్తం 150 డివిజన్లలో 75 స్థానాల్లో బీజేపీ, 75 స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలన్న దిశగానే శనివారం చర్చలు జరిగాయి. గ్రేటర్‌లో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను, సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానంలో ఎంపీని, ఒక ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకొన్న బీజేపీ ఆయా ప్రాంతాల్లోని డివిజన్లలో తమ అభ్యర్థులనే పోటీలో నిలపాలని పట్టుబడుతోంది. అయితే... ఆయా నియోజకవర్గాల్లో తమకూ బలం ఉందని, అలాంటి డివిజన్లను తమకే వదిలేయాలని టీడీపీ నాయకులు గట్టిగా కోరుతున్నారు. ఇరుపార్టీలు చెరిసగం స్థానాలను పంచుకొనే విషయమై ఆదివారం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.