We Want డెవలప్ మెంట్
♦ అభివృద్ధికే ఓటు అంటున్న సిటీజనులు
♦ ఆశలు..ఆకాంక్షలు నెరవేర్చే వారికే మద్దతని స్పష్టీకరణ
♦ చల్లారిన భావోద్వేగాలు..వ్యక్తం కాని భయాందోళనలు
♦ 2014తో పోలిస్తే.. మారిన ఓటరు ప్రాధాన్యతలు
♦ రాజకీయ చిత్రపటంపై..సరికొత్త ఆవిష్కరణలకు ఛాన్స్
‘కొత్త రాష్ట్రం, సరికొత్త ఆశలు, అనేకానేక ఆకాంక్షలు..అన్నీ నెరవేరుస్తాం లేదంటే..వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం..’ అంటూ అధికార టీఆర్‌ఎస్ సర్కార్ స్పష్టమైన హామీలు ఒకవైపు., ఏడాదిన్నర గా ఏమీ చేయలేదు. మాటలు కోటలు దాటాయ్..చేతలు గడప దాటలేదంటూ విపక్షాల విసుర్లు మరో వైపు. ఏదైతే నేం మహానగర పాలకమండలికి రేపు జరిగే పోలింగ్‌లో ఓటరు ఎవరి పక్షం వహించబోతున్నాడు? మమ్మల్ని నమ్మండి..చెప్పింది చేసి చూపిస్తా మంటున్న టీఆర్‌ఎస్‌ను బలపరుస్తారా? చెప్పింది సక్రమంగా చేయటం లేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఓటరు నాడిని పట్టి చూసే ప్రయత్నం చేసింది. ఇందులో శివార్లు మొదలుకుని మిగిలిన ప్రాంతాల్లో మెజారిటీ నగర ప్రజలు ‘అభివృదే’్ధ తమకు ముఖ్యమని, దాన్ని కొనసాగించటమే తమ తొలి ప్రాధాన్యం అంటూ మనోగతాన్ని బయటపెట్టారు. ఇక పాతబస్తీ ఓటరు సైద్ధాంతికంగా తమ మనసుకు దగ్గరైన పార్టీలు, అభ్యర్థులకు ఓటేస్తామంటున్నారు.
- సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మహానగర రాజకీయ ముఖచిత్రమూ మారింది. పార్టీల ప్రాధాన్యతలతోపాటు ప్రజల దృక్పథంలోనూ మార్పు కనిపిస్తోంది. వాస్తవంగా 2014లో రాష్ట్ర విభజనఅనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో నగరంలో పాతబస్తీ ఎంఐఎంకు అనుకూలంగా స్పందించగా, మిగిలిన ప్రాంతాల్లో ఒక్క సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, పటాన్‌చెరు(టీఆర్‌ఎస్) తప్ప మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీస్తూ బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లలో భారీ మెజారిటీలు సొంతం చేసుకున్నారు.
అయితే 2014 ఎన్నికలు రాష్ట్ర విభజన, అనంతరం వెల్లువెత్తిన భావోద్వేగాల వేడిలోనే జరగటంతో నగరంలో స్థిరపడ్డ వివిధ ప్రాంతాల వాసులంతా బీజేపీ, దేశం కూటమిని బలపర్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి స్థానిక సర్టిఫికెట్ల వివాదం, 26 కులాలను బీసీ జాబితా నుండి తొలగించడం, సామాజిక సర్వే, గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరితో వివిధ వర్గాలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. కాలక్రమేణా భావోద్వేగాల స్థానంలో అందరికీ సరైన భద్రత, అభివృద్ధి అంశం ముందుకు వచ్చింది. అధికార టీఆర్‌ఎస్ నేతలు, ప్రభుత్వ తీరులోనూ స్పష్టమైన మార్పు కనబడుతోంది. దీంతో ఓటర్లలోనూ మార్పు వస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై హైదర్‌నగర్ డివిజన్‌లో స్థిరపడ్డ గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌రెడ్డి అనే వ్యాపారిని ప్రశ్నిస్తే..‘నగరంలో 19 నెలల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు..హైదరాబాద్ అభివృద్ధికి కొనసాగింపుగానే ఓటేయాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.
కొత్త రాజకీయ సమీకరణలకు ఛాన్స్
గ్రేటర్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావటంతో విజయం కోసం అన్ని పార్టీలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గడిచిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్‌లో మూడు స్థానాల్లోనే విజయం సాధించి, మిగిలిన అన్ని చోట్ల రెండవ స్థానంలో నిలిచిన టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీగా లాభపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమ అభ్యర్థుల ఎంపికలో నగరంలో స్ధిరపడ్డ వారికి ప్రాధాన్యతనివ్వటంతో పాటు అనేక మంది ఇతర పార్టీల వారు టీఆర్‌ఎస్‌లో చేరిపోవటం వంటి అంశాలు ఈ పార్టీకి కలిసిరానున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో మెజారిటీ డివిజన్లలో ఆ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది.
2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సింగిల్ డిజిట్‌కు పరిమితం కాగా, వచ్చే ఎన్నికల్లో గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం దిగజారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 2009 ఎన్నికల్లో 45 డివిజన్లలో విజయం సాధించిన టీడీపీ ఈ ఎన్నికల్లో భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదనే చెపాల్పి. బలహీన ప్రత్యర్థులు ఉన్న ప్రాంతాల్లో, బలమైన అభ్యర్థులు నిలిపిన అతి కొద్ది ప్రాంతాల్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ ఎన్నికలు గ్రేటర్‌లో సరికొత్త రాజకీయ సమీకరణలకు వేదిక అవుతాయనటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.
ఎంతో మార్పు వచ్చింది...
2014 ఎన్నికలకు.. ప్రస్తుతం ఎన్నికలకు ఎంతో మార్పు ఉంది. రాష్ట్ర విభజన కోపంతో సీమాంధ్రులంతా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా టీడీపీ,బీజేపీలకు ఓటు వేశారు. కానీ కాలం గడిచిపోయిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. అంతే కాకుండా అధికారంలో ఉన్న పార్టీలు మెజారిటీ స్థానాలు గెలుచుకోవటం ఓ సంప్రదాయంగా వస్తుంది. మారిన రాజకీయ పరిస్థితులకు తోడు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ఇది అనుకూలం కావచ్చు.
- ప్రొఫెసర్ హరగోపాల్
ఫలితాలు పునరావృతం కావు
2014 - 2016 ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి ఒక విధంగా, ఎమ్మెల్యే అభ్యర్థికి మరో విధంగా ఓట్లు వేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అలాగే ప్రస్తుతం జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 2014 ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కావు. ఓటింగ్‌లో తప్పక చేంజ్ ఉంటుంది. అయితే అది ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పుడే చెప్పలేం.
- ప్రొఫెసర్ నాగేశ్వర్
అభ్యర్థులే కొత్త.. ఎజెండాలు ‘పాత’వే..
పాతబస్తీలో గ్రేటర్ ఎన్నికల్లోనూ పాత అంశాలే ప్రధాన ఎజెండాలయ్యాయి. బలమైన క్యాడర్, నినాదం ఉన్న ఎంఐఎం తమ సిద్ధాంత బలంతో ఈ ఎన్నికల్లోనూ జనంలోకి దూసుకుపోయింది. కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ మేనిఫేస్టోలు పక్కనబెడితే గ్రేటర్‌లో 60 స్థానాలకే పోటీ చేస్తున్నప్పటికి పార్టీ అధినేత అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లు ‘షహర్ హమారా..మేయర్ హమారా’ నినాదాంతో జెట్ స్పీడ్‌తో తమకు బలమైన ప్రాంతాలన్నింటిని చుట్టేయగలిగారు. ఇక బీజేపీ సైతం తన బలాన్ని నిరూపించుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేయగా, 2009లో గౌలీపురా, ఘాన్సీబజార్ స్థానాల్లోనే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ మారు చార్మినార్ నియోజకవర్గంలో శాలిబండ, పురానాపూల్, ఘాన్సీబజార్‌లలో ఎంఐఎంకు గట్టిపోటీ విసురుతోంది. ఎంబీటీ ఈ మారు చంద్రాయణగుట్ట, యాకుత్‌పుర నియోజకవర్గాల్లో ఉనికి కోసం పోరాడుతుండగా, బీజేపీ గోషామహల్, యాకుత్‌పురా, కార్వాన్ నియోజకవర్గాల్లో భారీ ఆశలు పెట్టుకుంది.