రామాయపట్నంలో పోర్టు నిర్మాణం జరిగేనా?
పోర్టు కోసం ఐదు వేల ఎకరాలను గుర్తించిన అధికారులు
కావలి : బ్రిటీషుకాలంలో వెలుగు వెలిగిన ప్రకాశం జిల్లా రామాయపట్నం తీరంలో పోర్టు నిర్మాణం జరుగుతుందా అనేదానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేపడితే ప్రకాశం జిల్లాకన్నా ఎక్కువ భాగం లబ్ధి నెల్లూరు జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గాలకు కలుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.7500 కోట్లతో పోర్టు నిర్మిస్తామని సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. పది వేల ఎకరాలు అవసరం అవుతుందని కేంద్రం ప్రకటించగా రామాయపట్నం సముద్రతీరానికి పరిసర ప్రాంతాల్లోని సుమారు 5వేల ఎకరాల ప్రభుత్వ, వక్ఫ్‌భూములను ప్రకాశం జిల్లా అధికారులు గుర్తించారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కావలికి వచ్చిన ప్రతిసారీ రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పుడు జిల్లాలోని దుగ్గరాజుపట్నంలో పోర్టు నిర్మాణం పూర్తయితే రామాయపట్నం పోర్టును మంజూరు చేస్తామని రెండు రోజుల క్రితం ఆయన స్పష్టం చేశారు. దుగ్గరాజుపట్నం పోర్టుకు కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటంతో దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తేలకుండా ఉంది. దీంతో రామాయపట్నం పోర్టు మంజూరుపై నీలి నీడలు అలముకున్నాయి.
రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలుమార్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీకి వినతి పత్రాలు అందించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే కావలి ప్రాంతం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కేంద్రమంత్రులకు రామిరెడ్డి వివరించారు.
కావలి నుంచి 15 కిలో మీటర్లు...
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉన్న రామాయపట్నం కావలి పట్టణం నుంచి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. కందుకూరు నుంచి 34 కిలో మీటర్లు వరకు ఉంటుంది. రామాయపట్నం సమీపంలో ఉన్న ఉలవపాడు మండలం, గుడ్లూరుతోపాటు పలు మండలాలకు చెందిన వారు నిత్యం కావలికి వస్తుంటారు.
పోర్టు నిర్మాణంతో ఉపాధి...
రామాయపట్నంలో నిర్మించే పోర్టులో ఓడల మరమ్మతుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని యూపీఏ ప్రభుత్వం తెలిపింది. రామాయపట్నంపోర్టు నిర్మాణం జరిగితే కొన్ని సంవత్సరాలుగా నిస్తేజంగా ఉన్న రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి కూడా ఊపు వస్తుందని స్థానికులు అంటున్నారు.
రాజకీయాలకు అతీతంగా కృషి
రాజకీయాలకు అతీతంగా రామయపట్నంలో పోర్టు నిర్మాణంకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. పోర్టు నిర్మిస్తే కావలి ప్రాంతం అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కలుగుతుంది. పోర్టు మంజూరు చేసే విషయంపై కేంద్రమంత్రులను కలిసి పలుమార్లు విన్నవించాం.
- రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే
షిప్‌యార్డు మంజూరు చేయాలి
రామాయపట్నంలో పోర్టుతోపాటు షిప్‌యార్డు కేంద్రం మంజూరు చేయాలి. ఈ విషయంపై కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశాం. రామయపట్నంలో పోర్టు నిర్మాణం జరిగితే కావలి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
- కందుకూరి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు