ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
రాంగోపాల్‌పేట్: గొంతుమీద కత్తిపెట్టినా భరతమాతకు జై అనబోమని కొంత మంది అంటున్నారని భరతమాతకు జై అంటే అమ్మకు జై అన్నట్లేనని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ విదేశాలకు ఊడిగం చేసే వారికి అలా అనే హక్కు ఎవరిచ్చారని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో బంగారు లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ‘అయామ్ డోనర్’ పేరుతో రూపొందించిన రక్తదాన యాప్‌ను, ట్రస్టు వెబ్‌సైట్‌ను, లోగోను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..స్వాతంత్య్ర ఉద్యమంలో జాతి నేతలు వందేమాతరం అన్నారని అంటే మాతా నీకు వందనం అని అర్థమని అన్నారు.
ఆనాడు ఖాసీం రజ్వీ తెలంగాణలో ఎన్నో అరాచకాలు చేశాడని ఆయన కూడా భారతమాతకు జై అనలేక పాకిస్తాన్ వెళ్లిపోయాడని గుర్తు చేశారు. అలాంటి వారసత్వంలో వచ్చిన మత ఛాందసవాద సంస్థలు మతం పేరుతో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్న వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే వర్సిటీని కొంత మంది రాజకీయ తీర్థయాత్రలా మార్చివేశారన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణాలేంటి, కారకులు ఎవరు అనేదానిని విశ్లేషించాల్సింది పోయి కేవలం తమను నిందించేందుకు వాడుకున్నారని అన్నారు. అప్జల్‌గురు, యాకుబ్ మెమెన్‌లకు కీర్తించ డం జాతి వ్యతిరేక చర్య అని ఆయన ఖండించారు.
దేశంలో 740 యూనివర్శిటీలు ఉండగా, అందులో 3, 4 యూనివర్శిటీల్లో మాత్రమే ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటుండటం దురదృష్టకరమని అన్నారు. త్వరలో ఉజ్వల పథకం కింద దేశంలో 5కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ అందించనున్నామన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బంగారు లక్ష్మణ్ పార్టీకి, సమాజానికి అందించిన సేవల గురించి వివరించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ టీవీ నారాయణ, కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ శోభానాయుడులను ఘనంగా సత్కరించారు. రిటైర్డ్ జడ్జి సీవీ రాములు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.