
అర్హులందరికీ ఉచిత సిలిండర్లు ఉత్తిమాటే
బడ్జెట్‌లో కేవలం 90.1 లక్షల మందికి మాత్రమే నిధుల కేటాయింపు
వాస్తవానికి రాష్ట్రంలో 1,48,43,671 మంది రేషన్ కార్డుదారులు
సుమారు 58 లక్షల మంది లబ్దిదారులకు మొండిచెయ్యి
సాక్షి, అమరావతి: పేదింటి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామన్న టీడీపీ కూటమి పార్టీల ఎన్నికల హామీ క్రమంగా మసకబారుతోంది. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా చేతులెత్తేసింది. ఫలితంగా.. దశాబ్దాల తరబడి రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉండి కూడా అర్హులైన కుటుంబాలకు పథకం వర్తింపు మిథ్యగానే మిగిలిపోతోంది.
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ పథకానికి నామమాత్రపు నిధులను కేటాయించడమే ఇందుకు కారణం. కేవలం 90.1 లక్షల కుటుంబాలకు మాత్రమే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు మాత్రమే కేటాయించింది.
లబ్దిదారుల సంఖ్యలో భారీ కోత..
తెల్లరేషన్ కార్డున్న వారికి మాత్రమే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన ఏపీలోని 1,48,43,671 కార్డుదారులకు గ్యాస్ రాయితీ అందాల్సి ఉంది. ఇందుకోసం రూ.4వేల కోట్లు కావాలి. కానీ, బడ్జెట్‌లో మాత్రం 90.1 లక్షల మందికి మాత్రమే రాయితీ ఇస్తామని చెప్పి లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత పెట్టింది. ఇలా దాదాపు 58 లక్షల మందికి పైగా అర్హులను నిలువునా బాబు సర్కారు మోసంచేసింది.
2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చేందుకు వీలుగా గత బడ్జెట్‌లో రూ.895 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన కోటి మంది లబ్దిదారులకు గ్యాస్ రాయితీ దక్కాలి. కానీ, 93 లక్షల మందికి మాత్రమే రాయితీ వర్తించినట్లు.. వీరికి రూ.686 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఈనెల 25న సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అసెంబ్లీలో ప్రకటించారు.
ప్రస్తుత గ్యాస్ ధరల ప్రకారం ఒక్కో సిలిండర్‌కు రూ.850 చొప్పున రాయితీ విడుదల చేస్తే సుమారు రూ.790 కోట్లు ఖర్చవుతుంది. కానీ, చంద్రబాబు చెప్పినదానిని బట్టి చూస్తే రూ.100 కోట్లకు పైగా చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. పైగా.. వాస్తవ కేటాయింపులు రూ.895 కోట్లు అయితే చెల్లించింది మాత్రం రూ.686 కోట్లే కావడంతో ఉచిత సిలిండర్లకు భారీ కోత విధించినట్లు స్పష్టమవుతోంది.
ఏటా ఇవ్వాల్సింది రూ.4,000 కోట్లు
బడ్జెట్‌లో కేటాయించింది రూ.2,601 కోట్లు
తేదీ: మే 28, 2023
వేదిక: రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు సభ ‘‘ఏవమ్మా దీపం ఇచ్చాను నేను. నా ఆడబిడ్డల కష్టాలను చూసి ఆలోచించా.. సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి.అందుకే మళ్లీ దీపం వెలిగిస్తా. ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను’– చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment