ప్రతి ఇంటికీ ఏటా మూడు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో హామీ
వచ్చే 5 నెలల్లో ఐదు పండుగలు.. ఇచ్చే సిలిండర్ మాత్రం ఒకటే
బహిరంగ మార్కెట్‌లో చుక్కలను తాకుతున్న నిత్యావసరాలు
ప్రకృతి వైపరీత్యాలకు తోడు పనుల్లేక ప్రజల్లో క్షీణించిన కొనుగోలు శక్తి
ఇలాంటి సమయంలో ఉదారంగా పథకాన్ని అమలు చేయకుండా సర్కారు తప్పించుకునే ఎత్తుగడలు
ముందుగా నగదు చెల్లించి సిలిండర్ తీసుకోవాలనడం వెనుక కుట్ర
లబ్ధిదారులను వీలైనంత తగ్గించుకునేందుకే మూడు బ్లాక్ పీరియడ్స్
హామీల పేరుతో ప్రజలను వంచించడంలో కూటమి సర్కారు నేతల నైజం మరోసారి బయటపడింది. వారిని నమ్మి ఓట్లేసిన మహిళల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేశారు. దీపావళి సందర్భంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఏటా మూడు ఉచిత సిలిండర్ల వాగ్దానాన్ని తుంగలో తొక్కేసింది. ఈ ఏడాది అక్టోబర్ 29 నుంచి వచ్చే మార్చి 31 వరకు తొలి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంటూ మిగిలిన రెండు ఉచిత సిలిండర్లకు ఎగనామం పెట్టింది. తద్వారా ఈ ఆరి్థక సంవత్సరంలో ఒక్క సిలిండర్‌తోనే పండగ చేసుకోమని చెబుతోంది. – సాక్షి, అమరావతి
ఒక్క సిలిండర్‌తో ఐదు పండుగలా!
వచ్చే మార్చి వరకు విభిన్న వర్గాల పండుగల సీజన్ కనిపిస్తోంది. దీపావళి తర్వాత నవంబర్‌లో కార్తీకమాసం, డిసెంబర్‌లో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి, మార్చిలో ఉగాదితో పాటు రంజాన్ ఉన్నాయి. ఈ క్రమంలో ఉదారంగా పథకాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం ఒక్క సిలిండర్‌తోనే ఐదు నెలల పాటు సరిపుచ్చుతోంది. రాష్ట్రంలోసగటున ఒక్కో కుటుంబం ఏడాదికి ఐదారు సిలిండర్లు వినియోగిస్తోంది. కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క సిలిండర్ ఇచ్చి ఐదు నెలలు గడిపేయాలని చెబుతుండటం గమనార్హం.
క్షీణించిన కొనుగోలు శక్తి
అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా పేదల సంక్షేమాన్ని పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా సాకులు చెబుతోంది. మరోవైపు బయట మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నాయి. ప్రజల జీవన విధానం అతలాకుతలమైంది. సర్వం కోల్పోయి రోడ్డుపై నిలబడ్డారు. చేసేందుకు పనులు దొరక్క.. చేతిలో చిల్లిగవ్వ లేక ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. దీన్ని పసిగట్టిన కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకాన్ని తెరపైకి తెచి్చంది. అయితే తొలి ఏడాది మూడు సిలిండర్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం వచ్చే మార్చి దాకా కేవలం ఒక్క సిలిండర్‌ను మాత్రమే ఇస్తామని ప్రకటించింది. తద్వారా మహిళలను మోసం చేస్తోంది.
అసలు మెలిక ఇదా?
ఉచిత గ్యాస్ సిలిండర్ పేరుతో ప్రజలు ముందుగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న గ్యాస్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆ తర్వాత 48 గంటల్లో రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో (డీబీటీ) జమ చేస్తామని చెబుతోంది. రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ షెడ్యూల్ ప్రకారం సిలిండర్ డబ్బులు ఖాతాల్లో వేస్తే లబ్ధిదారులు తమకు కావాల్సిన సమయంలో గ్యాస్ బుక్ చేసుకుంటారు. ఇలా చేస్తే ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత గ్యాస్ కింద నగదు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఏడాదికి మూడు బ్లాక్ పీరియడ్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ –జూలై, ఆగస్టు – నవంబర్, డిసెంబర్ – మార్చి బ్లాక్ పీరియడ్స్‌లో మాత్రమే గ్యాస్ బుక్ చేసుకునేలా పథకాన్ని రూపొందించింది. దీనివల్ల ఆ సమయంలో ఖాళీ సిలిండర్ లేకపోతే లబ్ధిదారుడు సిలిండర్ రాయితీని నష్టపోవాల్సి వస్తోంది.
పొంతన లేని లెక్కలు.. అర్హులందరికీ ఇస్తారా?
రాష్ట్రంలో 1.48 కోట్లకుపైగా రైస్ కార్డుదారులుంటే ప్రభుత్వం మాత్రం 1.47 కోట్లుగానే చెబుతోంది. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉంటే పథకానికి అర్హులుగా ప్రకటించింది. ప్రభుత్వం రూ.894 ఉన్న గ్యాస్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు చెబుతోంది. ఈ లెక్కన ఓ కుటుంబానికి ఏడాదికి రూ.2,682 విలువైన మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి.
తద్వారా మొత్తం కార్డుదారులకు ఏడాదికి దాదాపు రూ.4,000 కోట్లు వెచి్చంచాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఏడాదికి రూ.2,684.75 కోట్లు బడ్జెట్ మాత్రమే చూపిస్తుండటం పథకం అమలుపై సందేహాలు రేకెత్తిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికీ ఉచిత గ్యాస్ అని హామీ ఇచి్చన చంద్రబాబు.. తీరా తెల్లరేషన్ కార్డు నిబంధన పెట్టడంతో లక్షలాది మంది అనర్హులుగా మిగిలిపోతున్నారు.
రేపు శ్రీకాకుళంలో ‘ఉచిత గ్యాస్’ ప్రారంభం
⇒ హాజరుకానున్న సీఎం చంద్రబాబు
⇒ తొలి సిలిండర్ ఖర్చు రూ.894 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: దీపం–2 పథకంలో భాగంగా మూడు సిలిండర్లను ఉచితంగా అందించేందుకు వీలుగా తొలి సిలిండర్‌కు అయ్యే ఖర్చు రూ.894 కోట్లను సీఎం చంద్రబాబు బుధవారం పెట్రోలియం సంస్థలకు అందజేశారు. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించేందుకు రూ.2,684 కోట్ల ఖర్చుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇక 1వ తేదీన శ్రీకాకుళంలో దీపం–2 పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
కాగా, ఈనెల 29 నుంచే ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు ముందుగా డబ్బు చెల్లించి బుక్ చేసుకోవాలని సూచించింది. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమవుతుందని ప్రకటించింది. కేంద్రం ఇచ్చే రూ.25 రాయితీ పోను మిగిలిన రూ.876లను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన ‘ఎక్స్’ ఖాతాలో తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దీపం 2.0’తో దీపావళి కాంతులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment