- ‘గ్యాస్’ కనెక్షన్లతో ఏటా 3 ఉచిత సిలిండర్లకయ్యే ఖర్చు రూ.4 వేల కోట్లు
- కానీ సర్కారు లెక్క ఏటా రూ.2,684.75 కోట్లే..
- అర్హత ఉన్నా 54 లక్షలకుపైగా కుటుంబాలకు పథకాన్ని వర్తింప చేయకుండా సర్కారు మోసం
- దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఒక్కో సిలిండర్ ఇవ్వాలంటే రూ.1,345 కోట్లు అవసరం
- దీపావళికి తొలి సిలిండర్ పేరుతో బడ్జెట్‌లో కేవలం రూ.894.92 కోట్లే కేటాయింపు
- ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్..’ అంటూ ఎన్నికల వేళ కూటమి పార్టీల ప్రచారం
- ఈ ఏడాది ఇవ్వాల్సిన రెండు సిలిండర్లకు ఎగనామం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 1.80 కోట్లకుపైనే! వీరిలో 1.54 కోట్ల మందికి యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు కోటిన్నరకుపైగా కుటుంబాలు! ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ ఇస్తామన్న టీడీపీ కూటమి పార్టీల ఎన్నికల హామీని నెరవేర్చాలంటే ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల కోసం రూ.2,684.75 కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
దాదాపు పది లక్షల వరకు ఉన్న ప్రధాని ఉజ్వల యోజన కనెక్షన్లకు పాక్షిక రాయితీతోపాటు మిగతా గ్యాస్ వినియోగదారులకు ఎన్నిల హామీ ప్రకారం పూర్తి ఉచితంగా సిలిండర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం లబ్ధిదారులకు ఒక్క ఉచిత సిలిండర్ పంపిణీ కోసం రూ.1,345 కోట్లు అవసరం. కానీ కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో ఇచ్చిందెంతో తెలుసా? దీపావళికి తొలి సిలిండర్ పంపిణీ కోసం ఇచ్చింది కేవలం.. రూ.894.92 కోట్లు మాత్రమే!!
అంటే పథకాన్ని కేవలం కోటి కుటుంబాలకు లోపే పరిమితం చేసి మిగతా 54 లక్షల కుటుంబాలకు ఎగ్గొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఇంటికీ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్నికల వేళ బుకాయించిన కూటమి పార్టీల నేతలు ఈ ఏడాది ఇవ్వాల్సిన రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టేయడంతోపాటు అర కోటికిపైగా కుటుంబాలను పథకానికి దూరం చేయడం గమనార్హం.
అంతా ఉత్త గ్యాసేనా!
రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘ఉత్త గ్యాస్’గా మారిపోతోందా? అర్హత ఉన్నా ఉచిత గ్యాస్ అందుతుందన్న గ్యారంటీ పోయిందా? రేషన్ కార్డు ఉండీ.. దశాబ్దాలుగా గ్యాస్ కనెక్షన్ వినియోగిస్తున్న కుటుంబాలు ప్రభుత్వం దృష్టిలో అనర్హులైపోతున్నాయా? కూటమి పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పిన ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ వాగ్దానంలో మోసం బట్టబయలైందా? అంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అవుననే అంటున్నాయి. దీపం–2 కింద దీపావళి కానుకగా తీసుకొచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అందరికీ కాదనేది తేటతెల్లమవుతోంది. గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి అర్హుడికీ రాయితీ మొత్తం ఖాతాల్లో పడుతుందనేది భ్రమగా తేలిపోయింది.
ఇంటింటికీ అని నమ్మించి..
ఎన్నికల్లో ఓట్లే పరమావధిగా చంద్రబాబు బృందం ప్రతి ఇంటికీ ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బూటకపు హామీని గుప్పించింది. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు తర్వాత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేసింది. ఓట్లు వేయించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు విధించని కూటమి నాయకత్వం ఉచిత గ్యాస్ పథకం పొందాలంటే మాత్రం అర్హత ఉండాలనే మెలిక పెట్టింది.
నిజానికి కూటమి పార్టీల ఎన్నికల హామీ ప్రకారం చూస్తే రాష్ట్రంలో 1.80 కోట్ల కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున (ప్రభుత్వ జీవో ప్రకారం సిలిండర్‌కు రూ.894) ఇవ్వడానికి రూ.4,827.60 కోట్లు ఖర్చవుతుంది. దీంతో ఉచిత గ్యాస్ పథకాన్ని కుదించేందుకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత గ్యాస్ రాయితీ వర్తిస్తుందంటూ షరతులు విధించారు.
పొంతన లేని సర్కారు లెక్కలు..
రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ ఉంటే ఉచిత గ్యాస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 1,48,43,671 మంది కార్డుదారులు తమకు పూర్తిగా గ్యాస్ రాయితీ వస్తుందని ఆశపడ్డారు. వీరంతా బీపీఎల్ కిందే నమోదైన వారే. అయితే పథకాన్ని ప్రారంభించిన తొలి రోజే లక్షల కుటుంబాలకు నిరాశ ఎదురైంది. ఏళ్ల తరబడి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా పథకానికి అనర్హులుగా తేల్చడంతో నివ్వెరపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.
54 లక్షల కుటుంబాలకు అర్హత లేదా?
రేషన్ కార్డులున్నప్పటికీ సుమారు 54 లక్షల కుటుంబాలను ఉచిత గ్యాస్ పథకం నుంచి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. వీరిని వడపోసిన తర్వాతే పథకానికి బడ్జెట్ ప్రకటించినట్లు సమాచారం. ఏ ప్రమాణాల ప్రకారం వీరిని అనర్హులుగా ప్రకటించారో చెప్పకుండా అర్హులందరికీ ఉచిత గ్యాస్ ఇస్తున్నట్లు మభ్యపెడుతోంది.
అర్హుల కుదింపుతోపాటు మరోవైపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునేలా మూడు బ్లాక్ పీరియడ్స్‌ను తెచ్చింది. ఆయా సమయాల్లో గ్యాస్ సిలిండర్‌ఖాళీగా లేకుంటే లబ్ధిదారుడు నష్టపోవాల్సి వస్తుంది. తద్వారా ప్రభుత్వం ఖర్చును తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు ఒక్క సిలిండర్‌తోనే సరిపెడుతూ రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టింది.
ఇదీ గ్యాస్ ‘‘పథకం’’!
రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1.80 కోట్లు
యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.54 కోట్లు
రేషన్ కార్డులు 1,48,43,671
» ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఖర్చు రూ.4 వేల కోట్లు
(ఒక్కోటి రూ.894 చొప్పున 1.54 కోట్ల మందికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు)
కానీ మూడు సిలిండర్లకు ప్రభుత్వం ఎంత ఇస్తోంది?: రూ.2,684.75 కోట్లు
(ఈ బడ్జెట్ కోటి కుటుంబాలకు కూడా సరిపోదు.. మరో అర కోటికిపైగా అర్హులైన కుటుంబాలకు మొండి చెయ్యే)
» కార్డుదారులకు ఒక్క సిలిండర్ ఇవ్వటానికయ్యే ఖర్చు రూ.1,345 కోట్లు
»తొలి సిలిండర్ కోసం విడుదల చేసిన మొత్తం రూ.894.92 కోట్లు
» ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం చూస్తే లబ్ధి పొందే కుటుంబాలు సుమారు కోటి
» అర్హత ఉన్నప్పటికీ పథకానికి దూరమైన కుటుంబాలు సుమారు అర కోటి
నోట్: ఏపీలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద సుమారు 9.68 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీరికి కేంద్రం గ్యాస్ సిలిండర్‌కు రూ.300 రాయితీ ఇస్తోంది. అది పోనూ ఇటువంటి కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.594 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన మాత్రం పూర్తిగా రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment