విజయవాడ, సాక్షి: ఉచిత గ్యాస్ పేరుతో మరో భారీ మోసానికి సీఎం చంద్రబాబు నాయుడు తెర తీశారు. ప్రారంభంలోనే 40 లక్షల మంది లబ్ధిదారులకు ఎగనామం పెట్టారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటన ద్వారా తేటతెల్లం కావడం గమనార్హం.
ఏపీలో మొత్తం కోటి 48 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా కోటి 55 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నారు. అయితే.. పథకం ప్రారంభించిన నాడే 40 లక్షల మంది లబ్ధిదారులకు పైగా షాక్ తగిలింది. నిబంధనల పేరుతో వాళ్లకు ఫ్రీ సిలిండర్ కోత పెట్టింది కూటమి ప్రభుత్వం. మరోవైపు..
ఇన్నాళ్లూ లబ్ధిదారుల సంఖ్యను చంద్రబాబు ప్రభుత్వం బయటపెట్టకుండా వచ్చింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ ఏమరపాటులో అన్నారో.. కావాలనే చెప్పారో తెలియదుకానీ.. ఈ పథకం కింద కోటి 8 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని చెప్పారు. దీంతో కూటమి సర్కార్ మోసం బయటపడింది.
ఎన్నికల టైంలో.. కూటమి మేనిఫెస్టోలో ప్రతీ ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ల హామీకి తూట్లు పొడుస్తూ నిబంధనలను తెరపైకి తెచ్చారు. రేషన్ కార్డులున్న కుటుంబాలకు ఉచిత సిలిండర్లు ఇవ్వకపోగా.. తర్వాత డబ్బులు జమ చేస్తామంటూ మెలిక పెడుతున్నారు. చూస్తుంటే.. ఆరంభంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను మరింతగా తగ్గించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment