ప్రజలను మాయచేస్తున్న చంద్రబాబు
► ప్రత్యేక హోదా కోసం బాబు చేసిందేమీ లేదు
► వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం : కేంద్ర ప్రభుత్వం నిధులను చంద్రన్న కానుకల పేరుతో ఖర్చు పెడుతూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబునాయుడు మాయ చేస్తూ మాయలపకీర్‌గా మారాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బాబు మోసం చేయడంలో ఆరితేరిన వ్యక్తి అన్నారు. స్థానిక ఇరిగేషన్ బంగ్లాలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలకు పొంతన కుదర డం లేదన్నారు. రాష్ట్రానికి రూ.1.43 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు అడిగితే రూ.1,850 కోట్లు ఇచ్చినట్లు పత్రికల్లో తెలియజేశారన్నారు. అయితే సీఎం, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారన్నారు. అయితే కేంద్రం మాత్రం ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులిచ్చామని చెబుతోందన్నారు. సీఎం వారిచ్చిన నిధుల వివరాలు చెప్పేందుకు ఎందుకు భయపడుతున్నాడని, నిధులను పక్కదారి పట్టించాడా? అని ప్రశ్నించారు. కేంద్ర నిధులను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సొమ్ము కేంద్రానిది.. సోకు చంద్రబాబుదా?
కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రన్న కానుక, భువనేశ్వరి కానుక, లోకేష్ కానుకంటూ ప్రకటించుకోవడం చూస్తే సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా ఉందని ప్రసన్న ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పనులన్నీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 13,14వ ఆర్థికసంఘం నిధులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతోనే జరుగుతున్నాయన్నారు. అయితే వాటిని రాష్ట్ర నిధులతో చేసినట్లుగా సీఎం చెప్పుకోవడం , చంద్రన్న కానుకలుగా వివరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు, పథకాలకు ఎంతమేర నిధులు రాష్ట్రం తరఫున విడుదల చేశారో పత్రికల్లో ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాడని, ప్రస్తుతం ప్రజలు అంతా గమనించారని బాబు మాయమాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు.
ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమే
ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, 14వ ఆర్థిక కమిషన్ అడ్డుకుంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్‌చార్జి సిద్దార్థనాథ్‌సింగ్ ప్రకటించారని, అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమేనని ప్రసన్న అన్నారు. కమిషన్ ప్రత్యేక హోదా వద్దని ఎక్కడ చెప్పిందని ప్రశ్నించారు. ఒకవేళ వద్దని చెప్పినా కేంద్ర మంత్రి వర్గం సమావేశం పెట్టి హోదా ఇస్తున్నామని ఒకే ఒక వాక్యంతో తీర్మానం చేసే హక్కు కేంద్ర మంత్రిమండలికి ఉందన్నారు. మాట నిలబెట్టుకుంటారని మోదీ, వెంకయ్యనాయుడ్ని నమ్మితే వారు కూడా హోదాను పక్కదారి పట్టించి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారన్నారు. చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి మోదీ కాళ్లకు నమస్కారం చేయడం మినహా ప్రత్యేక హోదాపై సాధించేది ఏమీ లేదన్నారు.
ఇప్పటికైనా జిల్లా వాసి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కలువ బాలశంకర్‌రెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు చీమల రమేష్‌బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధికార ప్రతినిధి షేక్ కరీముల్లా (బాబు), జిల్లా కార్యదర్శి షేక్ అల్లాబక్షు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పగుంట విజయభాస్కర్‌రెడ్డి, వార్డు సభ్యుడు మేకల మాల్యాద్రి యాదవ్ పాల్గొన్నారు.