వెంకయ్యకు నారాయణ కౌంటర్ | CPI Narayana slams Venkaiah naidu over freedom of speach coments | Sakshi
Sakshi News home page

వెంకయ్యకు నారాయణ కౌంటర్

Published Sun, Mar 27 2016 11:50 PM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

వెంకయ్యకు నారాయణ కౌంటర్ - Sakshi

వెంకయ్యకు నారాయణ కౌంటర్

హైదరాబాద్: చైనా, పాకిస్తాన్, రష్యా దేశాల సిద్ధాంతాలను భారత్ లో అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలను ఉద్దేశించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలకు సీసీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ ధీటుగా బదులిచ్చారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ బీజేపీకో, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికో పరిమితం కాదని  ధ్వజమెత్తారు.

విశ్వవిద్యాలయాల ప్రాంగణాలను రాజకీయం వద్దని చెబుతున్న వెంకయ్య నాయుడు తన గతాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో నారాయణ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే భావప్రకటన అంటే 'అదేదో వారి గుత్తసొత్తు' గా ఉన్నట్టు అర్థమవుతుందని విమర్శించారు. భావప్రకటనను ఎవరు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడూ ఎటువంటి త్యాగాలు చేయని ఆర్‌ఎస్‌ఎస్ వారు దేశభక్తులు ఎలా అయ్యారని ప్రశ్నించారు.

అబద్ధాన్ని పదేపదే చెప్పినంత మాత్రాన నిజమై పోతుందనుకుంటే పొరబాటవుతుందని, అఫ్జల్‌గురు అంశానికీ జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌కు సంబంధం లేదని పదేపదే చెప్పినా వెంకయ్య నాయుడు పాతపాటే పాడుతున్నారని నారాయణ విమర్శిచారు. కన్హయ్య ఏనాడూ దేశ వ్యతిరేక శక్తులను సమర్థించలేదని, అయినా బీజేపీ నేతలు పదేపదే అదే ఆరోపణ చేస్తున్నారని, అవాస్తవాలను ప్రచారం చేస్తే ప్రజలే తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement